సీమాంధ్రలో 5 సీట్లకేనా? | bjp participated only 5 mp seats in seemandhara? | Sakshi
Sakshi News home page

సీమాంధ్రలో 5 సీట్లకేనా?

Published Sun, Apr 13 2014 12:47 AM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM

సీమాంధ్రలో 5 సీట్లకేనా? - Sakshi

సీమాంధ్రలో 5 సీట్లకేనా?

మోడీ హవా ఉంటే పరిమిత సీట్లకే పోటీ చేయడమేంటన్న
మీడియా ప్రశ్నకు వెంకయ్యనాయుడు తటపటాయింపు
ఓట్లు చీలకూడదనే నిర్ణయం తీసుకున్నామని జవాబు

 
 హైదరాబాద్: ఈ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా నరేంద్రమోడీదే హవా అంటూ ప్రచారం చేసుకుంటున్న బీజేపీ నేతలకు ఆంధ్రప్రదేశ్‌లో ఇరకాట పరిస్థితి ఏర్పడింది. మోడీ హవా అంతగా ఉంటే సీమాంధ్రలో ఐదు లోక్‌సభ సీట్లకే ఎందుకు పరిమితం కావాల్సి వచ్చిందన్న ప్రశ్నకు జవాబిచ్చేందుకు ఆ పార్టీ నేతలు తడబడుతున్నారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడుదీ ఇదే పరిస్థితి. మీడియా నుంచి ఈ ప్రశ్న ఎదురవగా.. జవాబు చెప్పేందుకు ఆయన కాసేపు తటపటాయించారు. కొద్ది క్షణాల తరువాత ‘అలా నిర్ణయం తీసుకున్నాం’ అని బదులిచ్చారు.

‘‘మా పార్టీ నిర్ణయాలపై మీరు(మీడియా) ఎలాంటి అభిప్రాయాలు వెలిబుచ్చినప్పటికీ.. మా బలమేంటో ప్రజలే తీర్పిస్తారు’’ అని అంటూ.. సీమాంధ్రలో ఓట్లు చీలకూడదనే ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన వివరించారు. బీజేపీ-టీడీపీల పొత్తుపై కొందరు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని తప్పుపట్టారు. గతంలో వారు పొత్తులు పెట్టుకున్నప్పడు ఒప్పయింది.. ఇప్పుడు తప్పెలా అవుతుందన్నారు. రాష్ట్రంలో కూటమి కాకుండా ఇతరులకు ఓటు వేస్తే అస్థిరత్వానికి ఓటు వేసినట్టే అవుతుందని చెప్పారు. తాను వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నానని.. అన్నిచోట్లా నరేంద్ర మోడీ హవా స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లోనూ లోక్‌సభకు మోడీకే ఓటేయాలని ప్రజలు నిర్ణయం తీసుకున్నార న్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు జరిగిన మూడుదశల పోలింగ్‌లో బీజేపీ ముందుకు దూసుకుపోతోందని స్పష్టమైందని, ఈ ఎన్నికల్లో ప్రత్యర్థులు కూడా ఊహించని ఫలితాలొస్తాయని జోస్యం చెప్పారు.

మోడీ ప్రభావంతోనే యువ ఓటర్లు పెద్ద సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొంటున్నారన్నారు. మన్మోహన్‌సింగ్ ప్రధాని పదవిలో కొనసాగినా అధికారిక నిర్ణయాలన్నీ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ చలాయించారని ప్రధానికి సలహాదారునిగా పనిచేసినవారు రాసిన పుస్తకంపై ఆ పార్టీ ప్రజలకు జవాబు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దెబ్బతిన్నా.. ఎన్నికల తర్వాత మళ్లీ అందర్నీ కూడగట్టి వెనుక నుంచి అధికారం చలాయించే ప్రమాదముందని హెచ్చరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement