మంచి బెర్త్‌లు
- కేంద్ర కేబినెట్లో రాష్ట్రానికి పెద్ద పీట
- రాజ్యసభ సభ్యుడు వెంకయ్యకూ స్థానం
- మొత్తం నాలుగు మంత్రి పదవులు
- ఆర్‌ఎస్‌ఎస్ జోక్యం వల్లే ఈ గౌరవం
సాక్షి, బెంగళూరు : దేశ నూతన ప్రధాని నరేంద్ర మోడీ తన కేబినెట్‌లో రాష్ట్రానికి అధిక ప్రాధాన్యతనిచ్చారు. ముగ్గురు నూతన పార్లమెంట్ సభ్యులు, ఓ రాజ్యసభ సభ్యుడికి అమాత్య పదవులివ్వడం ద్వారా కర్ణాటకకు ప్రత్యేక స్థానాన్ని ఇచ్చినట్లైంది. బ్రాహ్మణ వర్గానికి చెందిన అనంతకుమార్, ఒక్కలిగ వర్గంలో వివాద రహిత నాయకుడిగా పేరుగడించిన సదానందగౌడ, కర్ణాటక రాజకీయాలను శాసించడంలో ముందున్న లింగాయత్ వర్గానికి చెందిన జీ.ఎం సిద్దేశ్వర్‌కు కేంద్ర మంత్రి పదవులు దక్కాయి.
రాష్ట్ర శాసన సభ నుంచి రాజ్యసభకు ఎన్నికైన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వెంకయ్యనాయుడికి కూడా తన మంత్రి మండలిలో మోడీ స్థానం కల్పించారు. షెడ్యూల్ కులానికి చెందిన రమేష్ జిగజిణగి, రాష్ట్రం నుంచి పార్లమెంటు సభ్యురాలిగా ఎన్నికైన ఏకైక మహిళ శోభాకరంద్లాజే మంత్రి పదవుల కోసం చివరి వరకూ పోరాడినా ఫలితం దక్కలేదు. మొదట్లో కర్ణాటకకు ఒకటి లేదా రెండు మంత్రి పదవులు మాత్రమే కేటాయించాలని నరేంద్ర మోడీ భావించినా.. ఆర్‌ఎస్‌ఎస్ నాయకుల సూచనల మేరకు నాలుగు మంత్రి పదవులు (వెంకయ్య సహా) ఇచ్చినట్లు సమాచారం.
రైల్వే శాఖ మళ్లీ కర్ణాటకకే
కేంద్ర రైల్వే శాఖ మళ్లీ కర్ణాటకకే లభించనుంది. యూపీఏ-2 ప్రభుత్వంలో చివరి కొద్దికాలం పాటు కర్ణాటకకు చెందిన మల్లికార్జున ఖరే ఆ శాఖ నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వంలో కర్ణాటకకే చెందిన సదానందగౌడకు ఈ శాఖను కట్టబెట్టుతూ ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అదేగనుక జరిగితే వరుసగా రెండు పర్యాయాలు కన్నడిగులే రైల్వే శాఖ మంత్రులుగా పనిచేసినట్లవుతుంది.
అదేవిధంగా కర్ణాటక శాసనసభ నుంచి రాజ్యసభకు ఎన్నికైన వెంకయ్యనాయుడుకు పట్టణాభివృద్ధి శాఖ, అనంతకుమార్‌కు రసాయనాలు, ఎరువుల శాఖ కేటాయించనున్నట్లు సమాచారం. చివరి నిమిషంలో కేంద్ర మంత్రి మండలిలో స్థానం సంపాదించుకున్న జీ.ఎం సిద్దేశ్వరకు సహాయ మంత్రి పదవి దక్కే అవకాశం ఉన్నట్లు తెల్సింది. కాగా, కర్ణాటకకు చెందిన జాఫర్ షరీఫ్ కూడా గతంలో రైల్వేశాఖ మంత్రిగా పనిచేశారు.