కాంగ్రెస్ రెండంకెలకే పరిమితం: వెంకయ్య
విశాఖ : రానున్న ఎన్నికల్లో మిత్రపక్షాలతో కలిసి భారతీయ జనతా పార్టీకి 300 స్థానాలు వచ్చే అవకాశం ఉందని ఆపార్టీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు జోస్యం చెప్పారు. ఆయన శనివారం విశాఖలో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి రెండంకెల సీట్లే వస్తాయన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ నీటి బుడగ అని తెలిసిపోయిందన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీకి కాంగ్రెస్ మద్దతు ఇచ్చి చారిత్రాత్మక తప్పు చేసిందని వెంకయ్య వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గాలి విస్తోందని ఆయన అన్నారు. బీజేపీ ప్రాంతీయ, ఉప ప్రాంతీయ పార్టీ కాదని....భారతీయులకు ప్రాతినిధ్యం వహించే పార్టీ అన్నారు.
మూడో ప్రత్యామ్నాయం కెప్టెన్ ఎవరో ఎవరికీ తెలియదని వెంకయ్య నాయుడు ఎద్దేవా చేశారు. దక్షిణాది ప్రజలు కూడా బీజేపీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. పార్లమెంట్లో జరిగిన ఘటనను బీజేపీ ఖండిస్తోందని ...అది భారత జాతికి అవమానం జరగడమేనని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఎంపీలు, కేంద్రమంత్రులే వెల్లోకి వచ్చారని ... ఈ ఘటనపై కాంగ్రెస్ పూర్తి బాధ్యత వహించాలని వెంకయ్యనాయుడు డిమాండ్ చేశారు.
సొంత పార్టీ నేతలపై చర్యలు తీసుకోలేని కాంగ్రెస్ పైపెచ్చు తమపై విమర్శలా అని ప్రశ్నించారు. సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ వైఫల్యం చెందిందన్నారు. సభ సజావుగా జరగలేదని తెలిసినా...కాంగ్రెస్కు ముందే తెలిసినా చర్యలు తీసుకోలేదన్నారు. తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టడంపై ప్రభుత్వం స్పీకర్ ప్రకటించాలని వెంకయ్యనాయుడు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి, సీమాంధ్రల సమస్యలు పరిష్కరించాలని అద్వానీ చెప్పిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.