సార్వత్రిక నోటిఫికేషన్ విడుదల
తొలి రోజు 10 నామినేషన్లు
ఎంపీ స్థానానికి ఒకటి, అసెంబ్లీ స్థానాలకు9
అనంతపురం కలెక్టరేట్, సార్వత్రిక సంగ్రామం మొదలైంది. శనివారం ఉదయం 11 గంటలకు తమ చాంబర్‌లో కలెక్టర్ లోకేష్‌కుమార్, జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. గుంతకల్లు అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి బీ.విజయేందిర గుంతకల్లు తహసీల్దార్ కార్యాలయంలో విడుదల చేయగా అనంతపురం, ధర్మవరం, పెనుకొండ అసెంబ్లీ నియోజకవర్గం ఆర్‌ఓలు హుస్సేన్‌సాబ్, నాగరాజ, వెంకటేష్ ఆయా ఆర్డీఓ కార్యాలయాల్లో నోటిఫికేషన్ విడుదల చేశారు. మిగిలిన నియోజకవర్గాలకు చెందిన ఆర్‌ఓలు ఆయా తహసీల్దార్ కార్యాలయాల్లో నోటిఫికేషన్ జారీ చేశారు. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ ప్రతిని ఆయా కార్యాలయాల్లోని నోటీస్‌బోర్డుల్లో, గ్రామ పంచాయతీ భవనాల వద్ద ప్రదర్శించాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
అసెంబ్లీ స్థానాలకు 9 నామినేషన్లు
తొలి రోజు అసెంబ్లీ స్థానాలకు 9 నామినేషన్లు దాఖలయ్యాయి. అనంతపురం అర్బన్ అసెంబ్లీ స్థానానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బి.గురునాథ్‌రెడ్డి ఒక సెట్టు నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి హుస్సేన్‌సాబ్‌కు అందజేశారు. ఇదే స్థానానికి సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా కమ్యూనిస్ట్ (ఎస్‌యూసీఐ(సీ)) పార్టీ అభ్యర్థి డి.రాఘవేంద్ర నామినేషన్ వేశారు. గుంతకల్లు అసెంబ్లీ స్థానానికి స్వతంత్ర అభ్యరిగా బీ.ఉదయ్‌కిరణ్ ఒక సెట్టు నామినేషన్ వేశారు. పుట్టపర్తి అసెంబ్లీ స్థానానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కడపల మోహన్‌రెడ్డి తరఫున ఒక సెట్టు నామినేషన్ పత్రాలు దాఖలయ్యాయి. కదిరి అసెంబ్లీ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్, ఆయన సతీమణి కె. యశోదాదేవి ఒక్కో సెట్ నామినేషన్లు సమర్పించారు. ఇదే అసెంబ్లీ స్థానానికి వీ.భాస్కర్‌రెడ్డి ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేశారు. శింగనమలలో వైఎస్‌ఆర్‌సీపీ నేత జొన్నలగడ్డ పద్మావతి నామినేషన్ వేశారు. ఇదే నియోజకవర్గానికి యుసీసీఆర్‌ఐ (ఎంఎల్) తరఫున ఓబుళేసు నామినేషన్ వేశారు.
లోక్‌సభకు బోణి
తొలి రోజే అనంతపురం లోక్‌సభ స్థానానికి బోణీ అయింది. సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా కమ్యూనిస్ట్ (ఎస్‌యూసీఐ(సీ)) పార్టీకి చెందిన అభ్యర్థి జీ.లలిత ఒక సెట్టు నామినేషన్ దాఖలు చేశారు. పత్రాలను అనంతపురం లోక్‌సభ రిటర్నింగ్ అధికారి కలెక్టర్‌కు అందజేశారు. అంతకు ముందు పార్టీ కార్యాలయం నుంచి ఆమె ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. అభ్యర్థితో పాటు ఐదుగురిని మాత్రమే లోపలికి అనుమతించారు.