బీజేపీయే అతిపెద్ద పార్టీ: ఎన్సీపీ
న్యూఢిల్లీ/కోల్‌కతా: సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం భారీ మెజారిటీని కైవసం చేసుకుని అతిపెద్దగా అవతరించే అవకాశం బీజేపీకి ఉందని యూపీఏ మిత్రపక్షం ఎన్సీపీ నొక్కిచెప్పింది. అదేసమయంలో దేశంలో సుస్థిర ప్రభుత్వ ఏర్పాటు ఖాయమని తెలిపింది. ‘రాబోయే ఐదేళ్లకు దేశంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడుతుంది’ అని ఎన్సీపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి ప్రఫుల్ పటేల్ అన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ..
ఎగ్జిట్ పోల్ లేదా ఒపీనియన్ పోల్ ఫలితాల సరళిని గమనిస్తే బీజేపీయే శక్తిమంతమైన పార్టీగా అవతరించనున్న విషయం సుస్పష్టంగా తెలుస్తోందని, ప్రజాభీష్టాన్ని గౌరవించాల్సిన అవసరం ఉందని అన్నారు. దేశానికి సుస్థిర ప్రభుత్వ అవసరం ఎంతో ఉందని చెప్పారు. అయితే, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మేజిక్ ఫిగర్ బీజేపీకి లేదా ఆ పార్టీ నేతృత్వంలోని ఎన్డీయేకు అవసరమైన పక్షంలో ఎన్సీపీ మద్దతిస్తుందా? అన్న ప్రశ్నకు అలాంటి ఉద్దేశమేదీ లేదని, ప్రస్తుతం తాము యూపీఏలో భాగస్వాములుగా ఉన్నామని, రానున్న రోజుల్లో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తామన్నారు.