న్యూఢిల్లీ: మాజీ కేంద్ర మంత్రి, ఎన్‌సీపీ నేత ప్రఫుల్ పటేల్ యూపీఏ ప్రభుత్వ హయాంలో జరిగిన విమానాల లీజు వ్యవహారంలో ఎలాంటి అవినీతికి పాల్పడలేదని సీబీఐ తాజాగా క్లీన్ చిట్ ఇచ్చింది. ఢిల్లీలో ఈ కేసు విచారణ జరుగుతున్న కోర్టులో సీబీఐ ఈ మేరకు దర్యాప్తు క్లోజర్ రిపోర్టు దాఖలు చేసింది.
యూపీఏ హయంలో ప్రఫుల్ విమానయాన శాఖ మంత్రిగా ఉన్నపుడు ఎయిర్ ఇండియా విమానాల లీజులో అవినీతి జరిగిందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని క్లోజర్ రిపోర్టులో సీబీఐ పేర్కొంది. ఈ క్లోజర్ రిపోర్టును విచారించి కేసును మూసివేసే అంశంలో నిర్ణయం తీసుకునేందుకుగాను ఏప్రిల్ 15న హాజరుకావాలని కేసు దర్యాప్తు అధికారికి కోర్టు నోటీసులు జారీ చేసింది.
శరద్‌పవార్ అధ్యక్షుడిగా ఉన్న ఎన్‌సీపీని ఆయన మేనల్లుడు అజిత్‌పవార్ చీల్చి మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా చేరిన విషయం తెలిసిందే. సరిగ్గా ఇది జరిగిన 8 నెలల తర్వాత ఎన్‌సీపీ ముఖ్య నేత ప్రఫుల్‌పటేల్‌కు సీబీఐ క్లీన్‌చిట్ ఇవ్వడం చర్చనీయాంశమవుతోంది. అవసరం లేకున్నా ఎయిర్‌ఇండియా కోసం అత్యంత ఎక్కువ ఖర్చుతో విమానాలు లీజుకు తీసుకున్నారన్న ఆరోపణలపై ప్రఫుల్‌పటేల్ మీద 2017లో సీబీఐ కేసు నమోదు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఈ కేసును దర్యాప్తు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment