సాక్షి, ముంబై: తొలి దశ లోక్‌సభ ఎన్నికల ప్రచారం ముగిసింది. గురువారం ఎన్నికలు జరిగే విదర్భ ప్రాంతంలోని పది లోక్‌సభ నియోజకవర్గాల్లో ఇన్ని రోజులు కనిపించిన రాజకీయ నాయకుల సందడి, రోడ్ షోలు, ఇంటిఇంటికి ప్రచారానికి మంగళవారం సాయంత్రంతో తెరపడింది. ఎన్నికల షెడ్యూలు ప్రకారం ఈ నెల పదిన నాగపూర్, భండారా, గోండియా, రాంటెక్, యావత్మల్-వాషీమ్, వార్ధా, అకోలా, బుల్దానా, గడ్చిరోలి-చిమూర్, అమరావతి, చంద్రపూర్ లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈవీఎం యంత్రాలు, బూత్ అధికారులు, సిబ్బంది దాదాపు అన్నిపోలింగ్ కేంద్రాల వద్దకి చేరుకుంటున్నారు.
పొలింగ్ జరిగే కేంద్రాల వల్ల పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. అక్రమ మద్యం, డబ్బుల సరఫరాపై నిఘా వేశారు. ఎన్నికలకు మరొక్కరోజు మాత్రమే ఉండటంతో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అభ్యర్థులు శతాథా ప్రయత్నించే అవకాశముందన్న సమాచారం మేరకు ఖాకీలు ఆయా ప్రాంతాల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. మావోయిస్టుల ప్రాబల్యమున్న గడ్చిరోలి-చిమూర్, చంద్రాపూర్ ప్రాంతాల్లో గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. పారా మిలటరీ బలగాలు కూడా రంగంలోకి దిగాయి.
చివరి రోజు అభ్యర్థుల కోలాహలం...
ఎన్నికల ప్రచారానికి చివరి రోజైనా మంగళవారం ఆయా పార్టీల అభ్యర్థులు క్షణం తీరిక లేకుండా ఓటర్లను ప్రసన్నం చేసుకున్నారు. తమకు ఓటేస్తే నియోజకవర్గాలను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని అభ్యర్థించారు. స్థానికంగా ఉన్న సమస్యలను పరిష్కరించడంతో పాటు అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తామని హామీలిచ్చారు. యువత, మహిళలు, వృద్ధులు...ఇలా అందరిని కలిసి ఓటేయ్యాలని కోరారు.
అభ్యర్థుల్లో మొదలైన టెన్షన్...
ఎన్నికల ప్రచారం ముగియడంతో ఆయా పార్టీల అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. ఏఏ ప్రాంతంలో ఎవరి ఓట్లు ఎటు, కుల సమీకరణాలు ఎలా ఉన్నాయి, తాము ఇచ్చిన హామీలకు ఎంత మంది ప్రజలు ఆకర్షితులయ్యే అవకాశముంది తదితర అంశాలపై చర్చిస్తూ లెక్కలు వేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. తమ పార్టీ సారథుల ప్రభావం పొలింగ్‌పై ఎంతమేరకు ప్రభావం చూపనుందనే దానిపై కూడా చర్చించుకుంటున్నారు. విదర్భలోని పది స్థానాల్లో మహాకూటమి, ప్రజాసామ్య కూటమి మధ్య ప్రధాన పోరు జరిగే అవకాశం కనబడుతోంది. కొన్ని స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభావం ఉన్నా చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండకపొవచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. విదర్భ ప్రాంతంలో ఏర్పడిన కరువు, అతివృష్టి వల్ల పంటలు కోల్పోయిన రైతులు ఎవరివైపు మొగ్గుచూపుతారన్నది కూడా ప్రధానం కానుంది. స్థానిక రాజకీయ వాతావరణ పరిస్థితులను చూస్తే మహాకూటమి, ప్రజాస్వామ్య కూటమి చెరో ఐదు సీట్లు దక్కవచ్చన్న ప్రచారం జరుగుతోంది.
విదర్భలోని పది లోక్‌సభ స్థానాలకు పోటీచేసే 201 మంది అభ్యర్థుల్లో 90 మంది ఇండిపెండెంట్లు, 15 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. నమోదిత రాజకీయ పార్టీల నుంచి 80 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఏడు స్థాన్లాల్లో కాంగ్రెస్, మూడు స్థానాల్లో ఎన్‌సీపీ, ఆరు స్థానాల్లో బీజేపీ, నాలుగు స్థానాల్లో శివసేన పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మాయావతి నేతృత్వంలోని బహుజన సమాజ్ వాద్ పార్టీ పది స్థానాల్లో బరిలో ఉండగా, సీపీఐ ఒకే స్థానంలో పోటీ చేస్తోంది. నాగపూర్ లోక్‌సభ నుంచి బరిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత విలాస్ ముత్తెంవార్ శాయశక్తులా కృషి చేస్తున్నారు. ముత్తెంవార్‌కు బీజేపీ అభ్యర్థి నితిన్ గడ్కారీతో పాటు ఆప్ అభ్యర్థిని అంజలి దమనియా నుంచి తీవ్ర పోటీ ఎదురవుతోంది. వార్ధా లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ దత్తా మెఘే కుమారుడు సాగర్ మెఘేలకు గట్టి పోటీ ఎదురవుతోంది.
అలాగే భండారా, గోండియా నుంచి బరిలో ఉన్న కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి ప్రఫుల్ పటేల్, రాంటెక్ నుంచి కాంగ్రెస్ నేత ముకుల్ వాస్నిక్, యావత్మల్-వాషీమ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్న రాష్ట్ర మంత్రి శివాజీరావ్ మోఘే గెలుపు కోసం శాయశక్తులూ ఒడ్డుతున్నారు. వార్ధా, అకోలా, బుల్దానా, గడ్చిరోలి-చిమూర్, అమరావతి, చంద్రపూర్‌లోనే అందరూ అభ్యర్థులు ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధ్యక్షులు కేజ్రీవాల్‌తోపాటు పలువురు ప్రముఖ నాయకులు ఇప్పటికే వివిధ బహిరంగ సభల్లో పాల్గొని తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు అనేక హామీలను గుప్పించారు.
రేపు తొలి అంకం
Published Tue, Apr 8 2014 10:39 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement
Advertisement