మాయావతి మంత్రం పారుతుందా?
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది మొదట్లో జరుగనున్న ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు సాధించేందుకు బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత మాయావతి వ్యూహాత్మకంగా ముందుకు కదులుతున్నారు. ఆగ్రా సభలో ఆదివారం నాడు ఆమె మాట్లాడిన తీరు ఇందుకు అద్దం పడుతోంది. రాష్ట్రంలో 40 శాతం ఉన్న దళితులు-ముస్లింల కాంబినేషను క్యాష్ చేసుకోవడమే సరైన వ్యూహంగా ఆమె ముందుకు కదులుతున్నారు. బ్రాహ్మణుల పక్షాన నిలిచే భారతీయ జనతా పార్టీయే ప్రధాన లక్ష్యంగా విమర్శల వర్షం కురిపించినా ఆమె కాంగ్రెస్ పార్టీని ఒక్క పల్లెత్తు మాట అనలేదు. కాంగ్రెస్ పార్టీ పట్ల సానుకూలంగా ఉన్న ముస్లిం వర్గాలను దరిచేర్చుకోవాలనుకోవడమే అందుకు కారణం.
యూపీలో 22 శాతం మంది దళితులు ఉండగా, 18 శాతం మంది ముస్లింలు ఉన్నారు. వీరిలో మెజారిటీ ప్రజలు బీఎస్‌పీ పక్షాన నిలబడితే ఆమె రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడం అంతకష్టమేమి కాకపోవచ్చు. 2007లో మాయావతి అధికారంలోకి వచ్చినప్పుడు ఆమె దళితులు, ముస్లింలులతోపాటు బ్రాహ్మణులను కూడా ఆకర్షించడం కోసం బహుజన పార్టీని ‘సర్వ జన్’ పార్టీగా అభివర్ణించారు. అప్పుడు బ్రాహ్మణులు కూడా ఆమెకు ఎక్కువగానే ఓట్లు వేశారు. ఆ ఎన్నికల్లో ఆమె పార్టీ 30.43 శాతం ఓట్లతో రాష్ట్రంలోని 403 స్థానాలకుగాను 206 స్థానాలను గెలుచుకున్నారు. ఆ ఎన్నికల్లో ఆమె బ్రాహ్మణ సామాజిక వర్గానికి కూడా 50 సీట్లను కేటాయించారు. అయితే ఆ తర్వాత ఆమె అధికారంలోకి వచ్చాక బ్రాహ్మణులకు కూడా సముచిత స్థానం కల్పించేందుకు ప్రయత్నించగా దళితులు ఆమెకు దూరమయ్యారు. వారు ఆ తర్వాత ఎన్నికల్లో ఎస్పీకి దగ్గరవడంతో మాయావతి ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.
అలాంటి పొరపాటు ఈసారి చేయకూడదని ఆమె భావిస్తున్నట్లు ఉన్నారు. దళితులు, ఇతర వెనకబడిన వర్గాలు, ముస్లింల సమీకరణే లక్ష్యంగా ముందుకు కదలాలని భావిస్తున్నారు. గో సంరక్షణ పేరిట దళితులపై గుజరాత్ తదితర ప్రాంతాల్లో జరుగుతున్న దాడులను, వ్యతిరేకంగా దళితుల ఆందోళన చేస్తున్న అంశాలను ఉపయోగించుకుంటున్నారు. ప్రత్యక్షంగా ఆమె బ్రాహ్మణుల లక్ష్యంగా ఆరోపణలు చేయకపోయినప్పటికీ గో రక్షకుల దాడులను బీజేపీ వక్రీకరిస్తోందని విమర్శించారు. ఆగ్రా సభ ఇచ్చిన స్ఫూర్తితో ఆమె ఆజంగఢ్, సహరాన్‌పూర్, అలహాబాద్ నిర్వహించే పార్టీ సభల్లో ప్రసంగించేందుకు సమాయత్తమవుతున్నారు.