'గెలవరని బీజేపీకి ముందే తెలుసు'
లక్నో: ఉత్తరప్రదేశ్లో బీజేపీ అధికారంలోకి రాదని బహుజన్ సమాజ్ వాది పార్టీ అధినేత మాయావతి అన్నారు. సమాజ్ వాది పార్టీ చీఫ్ ములాయం మాదిరిగానే ప్రధాని నరేంద్రమోదీ కూడా తప్పుడు హామీలు ఇస్తున్నారని, అసత్య ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు ఎన్నో హామీలను మోదీ ఇచ్చారని వాటిల్లో ఏ ఒక్కటీ ఉత్తరప్రదేశ్‌లో అమలు కాలేదని, దీంతో ప్రజలు ఆయనపై అసంతృప్తితో ఉన్నారని చెప్పారు.
వారు గెలవరనే విషయం బీజేపీకి ఇప్పటికే అర్థమైందన్నారు. అదే సమయంలో ఎస్పీ-కాంగ్రెస్ కూటమి అంశంపై ఆమె స్పందిస్తూ బీజేపీ ఆమోదం పొందిన తర్వాతే ఆ రెండు పార్టీల ఉమ్మడి కార్యచరణ ప్రారంభమవుతుందని ఎద్దేవా చేశారు. బీజేపీకి లబ్ధి చేకూరే అవకాశం ఉంటేనే ఆ రెండు పార్టీలు కూటమిగా ఏర్పడతాయని చెప్పారు. ఈడీ, ఐటీ, సీబీఐ అధికారుల సహాయం తీసుకుంటూ కాంగ్రెస్ తో కూటమిని ఏర్పాటుచేయాలని బీజేపీ ములాయం సింగ్‌పై ఒత్తిడి చేస్తోందని ఆరోపించారు.