ముంబై: ఒకే కూటమిగా కొనసాగుతూ, పాలనలో భాగస్వాములుగా ఉంటూ కూడా ఉప్పూ-నిప్పుగా ఉంటున్న కాంగ్రెస్, ఎన్సీపీల మధ్య సయోధ్య కుదిర్చేందుకు పదిమందితో కూడిన కమిటీ ఏర్పాటైంది. ఈ విషయాన్ని ఎన్సీపీ నేత, ఉప ముఖ్యమంత్రి అజిత్‌పవార్ సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... ఈ కమిటీలో కాంగ్రెస్ నుంచి ఐదుగురు, ఎన్సీపీ నుంచి ఐదుగురు సభ్యులుగా ఉంటారు. ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, రాష్ట్రాధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రే, సీనియర్ నేత హర్షవర్ధన్ పాటిల్, మరో ఇద్దరు మంత్రులు కాంగ్రెస్ నుంచి ప్రాతినిథ్యం వహించగా ఎన్సీపీ నుంచి ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు శరద్ పవార్, రాష్ట్రాధ్యక్షుడు భాస్కర్ జాదవ్, వర్కింగ్ ప్రెసిడెండ్ జితేంద్ర అవ్హాద్, మరో ఇద్దరు మంత్రులు ప్రాతినిథ్యం వహిస్తారు.
వీరంతా 48 నియోజకవర్గాల్లో ఇరు పార్టీల మధ్య తలెత్తే విభేదాలను పరిష్కరిస్తారు. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రితో మాట్లాడేందుకు త్వరలో ఓ హెల్ప్‌లైన్ నంబర్‌ను కూడా ప్రకటించనున్నారు. ముందుగా ఈ నంబర్ ఆఫీస్ బేరర్లకు కనెక్ట్ అవుతుంది. ఆ తర్వాత వారు సీఎం, డిప్యూటీ సీఎంకు కనెక్ట్ చేస్తారు. ముఖ్యమంత్రి, ఠాక్రే ఈ విషయంలో ప్రతి జిల్లాలోని కాంగ్రెస్ కార్యాలయానికి లేఖలు పంపుతారు. అదేవిధంగా ఎన్సీపీ కార్యాలయాలకు అజిత్‌పవార్‌తోపాటు జాదవ్ లేఖలను పంపుతారు. ఇక ఎన్సీపీ భవిష్యత్తు గురించి అజిత్‌పవార్ మాట్లాడుతూ... గతంలోకంటే ఈసారి తమ పార్టీ మరింత మెరుగైన ఫలితాలు సాధిస్తుందన్నారు. అందుకోసమే తాము చాలా ముందుగా అభ్యర్థులను ఖరారు చేశామని చెప్పారు. ఇలా చేయడంవల్ల పోటీ చేసే అభ్యర్థికి కావలసినంత సమయం ఉంటుందని చెప్పారు.
గవిత్‌ను సాగనంపుతాం...
నందూర్బార్ ఎమ్మెల్యే, వైద్య విద్యాశాఖ మంత్రి విజయ్‌కుమార్ గవిత్ కూతురు బీజేపీలో చేరనుందనే వార్తలపై అజిత్‌పవార్ స్పందిస్తూ... ఒకవేళ ఆయన కూతురు బీజేపీలో చేరి, ఉత్తర మహారాష్ట్ర నుంచి పోటీ చేస్తే గవిత్‌ను పార్టీ నుంచి బయటకు పంపుతామని హెచ్చరించారు. మీడియాలో వస్తున్న కథనాలే నిజమైతే, గవిత్ కుమార్తె కులతత్వ పార్టీ అయిన బీజేపీతో జతకడితే గవిత్‌ను మంత్రిపదవి నుంచి తొలగించాలని సీఎం చవాన్‌కు లేఖ రాస్తానన్నారు. అయితే గవిత్ తన కుమార్తెను బీజేపీలో చేరనీయరనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. నియమనిబంధనలు పార్టీలోని అందరికీ వర్తిస్తాయని, ఎవరు అతిక్రమించినా ఫలితం చవిచూడాల్సి వస్తుందంటూ పరోక్షంగా గవిత్‌ను హెచ్చరించారు.
కాంగ్రెస్, ఎన్సీపీల మధ్య విభేదాలను రూపుమాపేందుకు పది మందితో కమిటీ
Published Mon, Mar 17 2014 10:06 PM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
Advertisement