coalition politics
-
కరెంటు కోత..చార్జీల మోత.! . ఆంధ్రప్రదేశ్‌లో కూటమి పాలనలో భారీగా పెరిగిన విద్యుత్ చార్జీలు
-
డామిట్! కథ అడ్డం తిరిగింది.. నితీశ్‌ను తప్పించబోయి చిత్తయిన లలన్
న్యూఢిల్లీ/పట్నా: బిహార్‌లో అధికార కూటమి భాగస్వామి అయిన జేడీ(యూ)లో తెర వెనక ‘తిరుగుబాటు’కు ఎట్టకేలకు తెర పడింది. పారీ్టలో అధ్యక్ష మార్పు తప్పదన్న ఊహాగానాలే నిజమయ్యాయి. మీడియా కథనాలను నిజం చేస్తూ లలన్సింగ్ను తప్పించి పార్టీ అధ్యక్ష పగ్గాలను సీఎం నితీశ్‌కుమార్ లాంఛనంగా తన చేతుల్లోకి తీసుకున్నారు. శుక్రవారం జరిగిన పార్టీ జాతీయ కౌన్సిల్ భేటీ ఇందుకు వేదికైంది. పార్టీ అధ్యక్షునిగా నితీశ్ పేరును సభ్యులంతా ముక్త కంఠంతో సమర్థించారు. ఆ వెంటనే లలన్ రాజీనామా, అధ్యక్షునిగా నితీశ్ బాధ్యతల స్వీకరణ చకచకా జరిగిపోయాయి. అయితే ఈ పరిణామం వెనక నిజానికి చాలా పెద్ద కథే నడిచినట్టు తెలుస్తోంది. లలన్ తిరుగుబాటు యత్నమే దీనంతటికీ కారణమని సమాచారం. నితీశ్ స్థానంలో డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌ను ముఖ్యమంత్రిని చేసేందుకు లలన్ చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టి చివరికి ఆయన ఉద్వాసనకు దారితీసినట్ చెబుతున్నారు! కొద్ది నెలల క్రితం నుంచే... ఆర్జేడీతో, ఆ పార్టీ చీఫ్ లాలుప్రసాద్ యాదవ్‌తో లలన్‌సింగ్ సాన్నిహిత్యం ఇప్పటిది కాదు. నితీశ్ కూడా దీన్ని చూసీ చూడనట్టే పోయేవారు. అయితే విశ్వసనీయ వర్గాల కథనం మేరకు... లాలు కుమారుడు తేజస్వికి సీఎం పదవి అప్పగించి నితీశ్ డిప్యూటీ సీఎంగా కొనసాగాలంటూ కొద్దికాలం క్రితం లలన్ ప్రతిపాదించారు. 18 ఏళ్లపాటు సుదీర్ఘంగా సీఎం పదవిలో కొనసాగినందున అధికార మహాఘట్బంధన్ సంకీర్ణంలో పెద్ద భాగస్వామి అయిన ఆర్జేడీకి సీఎం అవకాశమిస్తే బాగుంటుందని సూచించారు. దీన్ని నితీశ్ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. లాలు–లలన్ ప్లాన్ నితీశ్ నిరాకరించినా తేజస్విని ఎలాగైనా సీఎం చేసేందుకు లాలు, లలన్ ఒక పకడ్బందీ ప్రణాళిక రూపొందించారు. అందులో భాగంగా జేడీ(యూ)ను చీల్చి కనీసం ఒక డజను మంది ఎమ్మెల్యేలను ఆర్జేడీలోకి పంపేందుకు లలన్ ఒప్పుకున్నారు. బదులుగా వచ్చే ఏప్రిల్‌లో ఆర్జేడీ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాన్ని ఆయనకిచ్చేలా అంగీకారం కుదిరింది. 243 మంది సభ్యుల బిహార్ అసెంబ్లీలో జేడీ(యూ)తో నిమిత్తం లేకుండా ప్రభుత్వ ఏర్పాటుకు తేజస్వికి కేవలం మరో ఏడుగురు ఎమ్మెల్యేల మద్దతు చాలు. కానీ 45 మంది జేడీ(యూ) ఎమ్మెల్యేల్లో డజను మందే పార్టీ ఫిరాయిస్తే వారిపై అనర్హత వేటు ఖాయం. తన అధ్యక్ష పదవి సాయంతో ఈ ముప్పు తప్పించేలా లలన్ ఎత్తే వేశారు. అందులో భాగంగా వారిని పార్టీ నుంచి ఆయనే సస్పెండ్ చేస్తారు. అప్పుడిక వారికి అనర్హత నిబంధన వర్తించదు. ఆనక 12 మంది ఎమ్మెల్యేలూ ఆర్జేడీకి మద్దతు పలికేలా, నితీశ్ సర్కారు కుప్పకూలి తేజస్వి గద్దెనెక్కేలా వ్యూహరచన జరిగింది. ఈ మేరకు 12 మంది జేడీ(యూ) ఎమ్మెల్యేలతో కొద్ది వారాల క్రితం లలన్ గుట్టుగా మంతనాలు కూడా జరిపారు. వారందరికీ మంత్రి పదవులు ఆశ చూపారు. ఆర్జేడీకి చెందిన స్పీకర్ అవధ్ బిహారీ చౌధరి ఇందుకు పూర్తిగా సహకరిస్తారని చెప్పారు. అయితే సదరు ఎమ్మెల్యేల్లో తన వీర విధేయుడైన సభ్యుడొకరు దీనిపై ఉప్పందించడంతో నితీశ్ అప్రమత్తమయ్యారు. సైలెంట్‌గా వారం క్రితం ‘ఆపరేషన్ లాలన్’కు తెర తీశారు. ఎమ్మెల్యేలతో పాటు పార్టీ నేతలందరితోనూ విడివిడిగా మాట్లాడి వారంతా తనకే విధేయులుగా ఉండేలా చర్యలు తీసుకున్నారు. అలా పావులు కదుపుతూ శుక్రవారం కథను క్లైమాక్స్‌కు తెచ్చారు. విషయం అర్థమైన లాలన్‌సింగ్ అస్త్రసన్యాసం చేశారు. అధ్యక్ష పదవికి తానే నితీశ్ పేరును సూచించి తప్పుకున్నారు! -
చారిత్రక విజయం దిశగా నెతన్యాహు పార్టీ
జెరుసలేం: ఇజ్రాయెల్‌లో తాజా ఎన్నికల్లో మాజీ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు(73) సారథ్యంలోని సంకీర్ణ కూటమి చరిత్రాత్మక విజయం దిశగా సాగుతోంది. వామపక్ష మెరెట్జ్ పార్టీ గట్టి పోటీ ఇస్తున్నా 85 శాతం ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికే 120 మంది సభ్యుల పార్లమెంట్లో 65 సీట్లు నెతన్యాహు కూటమికి దక్కేలా కనిపిస్తున్నాయి. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాక గత నాలుగేళ్లలో దేశంలో ఏకంగా ఐదుసార్లు ఎన్నికలు జరిగాయి. తాజా ఫలితాలతో రాజకీయ సందిగ్ధానికి తెరపడనుంది. నెతన్యాహు కూటమికి 65 వరకు సీట్లు దక్కుతాయని ఎగ్జిట్ పోల్స్‌లోనూ వెల్లడైంది. ఈ కూటమిలో నెతన్యాహుకు చెందిన లికుడ్ పార్టీ, యూదు మతవాద పార్టీలు ఉన్నాయి. -
బీజేపీకి నిరాశ.. మళ్లీ తెరపైకి ప్రాంతీయ శక్తులు!
న్యూఢిల్లీ: ప్రస్తుతం వెలువడిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, ముఖ్యంగా మమతా బెనర్జీ ఘన విజయం రెండు విషయాలను స్పష్టం చేస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. తమకు ఉన్న భారీ బలగంతోనే ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం కుదరదని తేలిపోయిందని.. మరోవైపు జాతీయ రాజకీయాల్లోకి ప్రాంతీయ శక్తులు తిరిగి ప్రవేశించడం ఖాయమని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ చచ్చుబడిపోవడం కూడా దీనికి కారణమని పేర్కొంటున్నారు. కోవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో ఎన్డీయే సర్కారు విఫలమైందన్న ప్రతిపక్షాల విమర్శలకు.. బెంగాల్లో గెలుపుతో చెక్ పెట్టవచ్చని, కేంద్ర విధానాలకు ప్రజా మద్దతు ఉందని చెప్పుకోవచ్చని బీజేపీ భావించిందని విశ్లేషకులంటున్నారు. కానీ బెంగాల్ ఓటమి, తమిళనాడు, కేరళల్లో నిరాశాజనక ఫలితాలు బీజేపీ ఆశలపై నీళ్లు చల్లాయని విశ్లేషిస్తున్నారు. సంకీర్ణ రాజకీయాలు మొదలయ్యే అవకాశం ‘‘బెంగాల్లో మమత గెలుపు దేశంలో సంకీర్ణ రాజకీయాలకు మళ్లీ తెరలేపే పరిస్థితి కనిపిస్తోంది. బెంగాల్ బయట కూడా తృణమూల్ కాంగ్రెస్‌కు కేడర్ ఉంది. బీజేపీని ఎదిరించి పోరాడిన ఆమెతో కలిసి పనిచేసేందుకు పలు ప్రాంతీయ పార్టీలు ముందుకొచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ ఇప్పటికీ బలంగా ఉన్న రాష్ట్రాల్లో ఆ పార్టీ కీలకంగా ఉంటుంది. బీజేపీ తీరుతో ఆగ్రహంగా ఉన్న మమత.. యాంటీ బీజేపీ పార్టీలను ఏకం చేయడంలో కీలకంగా వ్యవహరించే అవకాశం ఉందంటున్నారు. -
కశ్మీర్లో ప్రధాన పార్టీల కూటమి
శ్రీనగర్: స్వతంత్ర ప్రతిపత్తిని తిరిగి సాధించడమే లక్ష్యంగా జమ్మూకశ్మీర్‌లోని ప్రధాన రాజకీయ పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి. గత ఏడాది ఆగస్టు 5వ తేదీ నాటికి ముందు పరిస్థితిని జమ్మూకశ్మీర్‌లో పునరుద్ధరించాలనీ, దీనిపై సంబంధిత పక్షాలన్నిటితో కేంద్రం చర్చలు జరపాలని డిమాండ్ చేశాయి. గురువారం నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా నివాసంలో జరిగిన ఈ భేటీకి పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ, పీపుల్స్ కాన్ఫరెన్స్ చైర్మన్ సజాద్ లోనె, పీపుల్స్ మూవ్‌వెంట్ నేత జావెద్ మిర్, సీపీఎం నేత యూసఫ్ తారిగామి హాజరయ్యారు. దాదాపు 2 గంటలపాటు కొనసాగిన ఈ సమావేశం అనంతరం ఫరూక్ అబ్దుల్లా మీడియాతో మాట్లాడారు. ‘పీపుల్స్ అలయెన్స్ ఫర్ గుప్కార్ డిక్లరేషన్’గా తమ కూటమికి పేరు పెట్టామన్నారు. జమ్మూకశ్మీర్, లద్దాఖ్లకున్న ప్రత్యేక హోదాతోపాటు, కశ్మీర్ ప్రత్యేక రాజ్యాంగాన్ని సాధించుకుంటామన్నారు. తమ కూటమి భవిష్యత్ కార్యాచరణపై త్వరలోనే వెల్లడిస్తామన్నారు. జేకేపీసీసీ చీఫ్ గులాం అహ్మద్ మిర్ ఈ సమావేశానికి హాజరుకాలేదు. -
టెన్షన్.. టెన్షన్..
సాక్షి, కొత్తగూడెం (ఖమ్మం): వచ్చే నెలలోనే ఎన్నికలు జరుగనున్నట్లు వార్తలు వస్తుండడంతో రాజకీయ పార్టీల్లో వేడి తారాస్థాయికి చేరుకుంది. గత నెల 6న అసెంబ్లీని రద్దు చేసిన కేసీఆర్.. అదే రోజున 105 మంది అభ్యర్థులను ప్రకటించారు. ఈ క్రమంలో టీఆర్ఎస్లో అసమ్మతి సెగలు రగులు తున్నప్పటికీ అభ్యర్థులు తమ ప్రచార కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఉన్నారు. టీఆర్ఎస్ను ఎదుర్కొనేందుకు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ టీడీపీ, సీపీఐ, టీజేఎస్ పార్టీలతో కూటమిగా ఏర్పడింది. కూటమి ఏర్పాటు, చర్చల ప్రక్రియ ప్రారంభమై నెల రోజులు కావస్తున్నా ఇప్పటివరకు ఈ వ్యవహారం ఓ కొలిక్కి రాలేదు. కూటమిలో ఉన్న పార్టీలలో ఎవరికి ఏ స్థానం ఇవ్వాలనే విషయమై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కాంగ్రెస్, టీడీపీ, సీపీఐల మధ్య సీట్ల విషయమై ఎటూ తేలడం లేదు. ఈ జిల్లాలో ఈ పార్టీలన్నింటికీ గట్టి ప్రాబల్యం ఉండడంతో సీట్ల విషయంలో ఎవరికి వారు పట్టుపడుతున్నారు. ముఖ్యంగా సీపీఐ కొత్తగూడెం సీటు విషయమై గట్టిగా పట్టు పడుతోంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్, సీపీఐ మధ్య ఈ విషయమై పీటముడి వీడడం లేదు. అశ్వారావుపేట సీటు కోసం టీడీపీ పట్టుపడుతోంది. ఇలా జిల్లాలోని మిగిలిన సీట్ల విషయంలోనూ గందరగోళమే నెలకొంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ను దీటుగా ఎదుర్కొనేందుకు ప్రతి సీటు కీలకం కావడంతో కాంగ్రెస్ పార్టీ విడతలవారీగా ప్రత్యేకంగా సర్వేలు చేయించుకుంది. ఏ నియోజకవర్గం ఏ పార్టీకి కేటాయిస్తే గెలుపు సాధ్యమవుతుందనే అంశం ప్రధానంగా ఈ సర్వేలు చేయించినట్లు తెలుస్తోంది. దీంతో ఏ సీట్లు ఏ పార్టీకి కేటాయిస్తారో అనే విషయమై టెన్షన్ నెలకొంది. ఇప్పటికే ఎన్నికల ఫీవర్ నేపథ్యంలో అన్ని పార్టీలు అటెన్షన్ స్థితిలోకి వచ్చాయి. టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించడంతో వారు ప్రచార రంగంలో దూసుకెళుతున్నారు. ఇప్పటికే ఒక విడత ప్రచారం సైతం పూర్తి చేశారు. ఈ క్రమంలో కూటమి పార్టీలు అటెన్షన్లో ఉన్నప్పటికీ ఆయా పార్టీల శ్రేణుల్లో మాత్రం టెన్షన్ నెలకొంది. మథనపడుతున్న ఆశావహులు.. కూటమిలో సీట్ల కేటాయింపులు మరింత సాగతీతగా ఉండడంతో ఆశావహులు ఆందోళన చెందుతున్నారు. దీని కోసం ఎదురుచూస్తూనే టికెట్ల కోసం ఎవరికి వారు తమవంతుగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అయితే పొత్తుల్లో భాగంగా తాము ఆశించే సీటు మరో పార్టీకి వెళితే తమ పరిస్థితి ఏంటనే ఆందోళన వారిలో నెలకొంది. మరోవైపు, టికెట్ తమకు కాకుండా పార్టీలో మరొకరికి వెళితే ఏవిధంగా ముందుకెళ్లాలి అని ఎవరికి వారు తీవ్రంగా ఆలోచనలు చేస్తున్నారు. పొత్తుల్లో ఇతర పార్టీకి పోయినా, లేదా తామున్న పార్టీలోనే టికెట్ మరొకరు దక్కించుకున్నా.. తాము ఇతర పార్టీ నుంచి బరిలో నిలిచేందుకు కొందరు ఆశావహులు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అయితే ఈ విషయంలో సమయం మించిపోతుండడంతో ఎటూకాకుండా పోతామోననే ఆందోళన కూడా వారిలో మొదలైంది. జిల్లాలోని కొన్ని నియోజకవర్గాలకు చెందిన పలువురు ఆశావహులు ఇప్పటికే బీజేపీతో టచ్‌లో ఉన్నారు. కూటమిలో ఏ సీటు ఎవరిదో.. కాంగ్రెస్ కూటమికి సంబంధించి ఇతర ఏ జిల్లాలో లేని విధంగా ఇక్కడ ప్రత్యేక పరిస్థితి నెలకొంది. ఇక్కడున్న ఐదు సీట్లలో దాదాపు అన్ని సీట్లలో తమకు బలముందని ఆయా పార్టీలు చెబుతున్నాయి. మూడు పార్టీలు గట్టి పట్టుమీద ఉండడంతో ఒక సీటు కాకపోతే మరో సీటులో పీటముడి నెలకొనే పరిస్థితులు ఏర్పాడ్డాయి. కొత్తగూడెం విషయంలో సీపీఐ పట్టుబడుతుండగా, పినపాక, భద్రాచలం స్థానాల్లో సీపీఐకి ఏదో ఒకటి ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇక టీడీపీ అశ్వారావుపేటతో పాటు పినపాక, భద్రాచలంలలో ఒక సీటు ఇవ్వాలని కోరుతోంది. అయితే అశ్వారావుపేట సీటు టీడీపీకి ఇవ్వవద్దని కాంగ్రెస్ శ్రేణులు అంటున్నాయి. దీంతో మూడు పార్టీల మధ్య ఐదు ముక్కలాట అనేలా పరిస్థితి తయారైంది. -
కాంగ్రెస్, ఎన్సీపీల మధ్య విభేదాలను రూపుమాపేందుకు పది మందితో కమిటీ
ముంబై: ఒకే కూటమిగా కొనసాగుతూ, పాలనలో భాగస్వాములుగా ఉంటూ కూడా ఉప్పూ-నిప్పుగా ఉంటున్న కాంగ్రెస్, ఎన్సీపీల మధ్య సయోధ్య కుదిర్చేందుకు పదిమందితో కూడిన కమిటీ ఏర్పాటైంది. ఈ విషయాన్ని ఎన్సీపీ నేత, ఉప ముఖ్యమంత్రి అజిత్‌పవార్ సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... ఈ కమిటీలో కాంగ్రెస్ నుంచి ఐదుగురు, ఎన్సీపీ నుంచి ఐదుగురు సభ్యులుగా ఉంటారు. ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, రాష్ట్రాధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రే, సీనియర్ నేత హర్షవర్ధన్ పాటిల్, మరో ఇద్దరు మంత్రులు కాంగ్రెస్ నుంచి ప్రాతినిథ్యం వహించగా ఎన్సీపీ నుంచి ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు శరద్ పవార్, రాష్ట్రాధ్యక్షుడు భాస్కర్ జాదవ్, వర్కింగ్ ప్రెసిడెండ్ జితేంద్ర అవ్హాద్, మరో ఇద్దరు మంత్రులు ప్రాతినిథ్యం వహిస్తారు. వీరంతా 48 నియోజకవర్గాల్లో ఇరు పార్టీల మధ్య తలెత్తే విభేదాలను పరిష్కరిస్తారు. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రితో మాట్లాడేందుకు త్వరలో ఓ హెల్ప్‌లైన్ నంబర్‌ను కూడా ప్రకటించనున్నారు. ముందుగా ఈ నంబర్ ఆఫీస్ బేరర్లకు కనెక్ట్ అవుతుంది. ఆ తర్వాత వారు సీఎం, డిప్యూటీ సీఎంకు కనెక్ట్ చేస్తారు. ముఖ్యమంత్రి, ఠాక్రే ఈ విషయంలో ప్రతి జిల్లాలోని కాంగ్రెస్ కార్యాలయానికి లేఖలు పంపుతారు. అదేవిధంగా ఎన్సీపీ కార్యాలయాలకు అజిత్పవార్తోపాటు జాదవ్ లేఖలను పంపుతారు. ఇక ఎన్సీపీ భవిష్యత్తు గురించి అజిత్‌పవార్ మాట్లాడుతూ... గతంలోకంటే ఈసారి తమ పార్టీ మరింత మెరుగైన ఫలితాలు సాధిస్తుందన్నారు. అందుకోసమే తాము చాలా ముందుగా అభ్యర్థులను ఖరారు చేశామని చెప్పారు. ఇలా చేయడంవల్ల పోటీ చేసే అభ్యర్థికి కావలసినంత సమయం ఉంటుందని చెప్పారు. గవిత్‌ను సాగనంపుతాం... నందూర్బార్ ఎమ్మెల్యే, వైద్య విద్యాశాఖ మంత్రి విజయ్‌కుమార్ గవిత్ కూతురు బీజేపీలో చేరనుందనే వార్తలపై అజిత్‌పవార్ స్పందిస్తూ... ఒకవేళ ఆయన కూతురు బీజేపీలో చేరి, ఉత్తర మహారాష్ట్ర నుంచి పోటీ చేస్తే గవిత్‌ను పార్టీ నుంచి బయటకు పంపుతామని హెచ్చరించారు. మీడియాలో వస్తున్న కథనాలే నిజమైతే, గవిత్ కుమార్తె కులతత్వ పార్టీ అయిన బీజేపీతో జతకడితే గవిత్‌ను మంత్రిపదవి నుంచి తొలగించాలని సీఎం చవాన్‌కు లేఖ రాస్తానన్నారు. అయితే గవిత్ తన కుమార్తెను బీజేపీలో చేరనీయరనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. నియమనిబంధనలు పార్టీలోని అందరికీ వర్తిస్తాయని, ఎవరు అతిక్రమించినా ఫలితం చవిచూడాల్సి వస్తుందంటూ పరోక్షంగా గవిత్‌ను హెచ్చరించారు.