మార్చి 7-10 మధ్యలో షెడ్యూలు!
Published Thu, Feb 20 2014 2:06 AM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM
లోక్‌సభతోపాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం ఎన్నికలు
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలకు మార్చి 7 నుంచి 10వ తేదీ మధ్యకాలంలో షెడ్యూలు వెలువడే అవకాశాలున్నాయి. ఈ నెల 26 లేదా 28 తేదీల్లోనే షెడ్యూలు ప్రకటించాలని కేంద్ర ఎన్నికల సంఘం భావించినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో మరో వారం రోజులు గడువు తీసుకుంటున్నట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలతోపాటే ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల శాసనసభలకు కూడా సాధారణ ఎన్నికల షెడ్యూలును ప్రకటించనున్నారు. జాతీయస్థాయిలో ఎన్నికల ఏర్పాట్లపై కేంద్ర ఎన్నికల సంఘం గురువారం అత్యంత కీలక సమావేశం ఏర్పాటు చేయనుంది.
ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాల ఎన్నికల ప్రధానాధికారులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు, ఇతర ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. సార్వత్రిక ఎన్నికల ఏర్పాట్లు, శాంతి భద్రతల పరిస్థితి, దశలవారీగా ఎన్నికల నిర్వహణ తదితర అంశాలను కేంద్ర ఎన్నికల సంఘం ఈ సమావేశంలో రాష్ట్రాలవారీగా సమీక్షించనుంది. ఈ సమీక్ష అనంతరం లోక్‌సభ ఎన్నికలు, మూడు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు ఎన్ని విడతల్లో ఎన్నికలు నిర్వహించాలనే అంశంపై ఒక అంచనాకు రానుంది. ప్రాథమిక సమాచారం మేరకు ఐదునుంచి ఏడు విడతలుగా ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది.
ప్రస్తుత లోక్‌సభ కాలపరిమితి మే 31తో, ఆంధ్రప్రదేశ్ శాసనసభ కాలపరిమితి జూన్ 2తో, ఒడిశా జూన్ 7తో, సిక్కిం శాసనసభ కాలపరిమితి మే 21తో ముగుస్తుంది. ఈ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రాల వారీగా ఓటర్ల తుది జాబితాను ఆయా రాష్ట్రాల ఎన్నికల ప్రధానాధికారులు ఇప్పటికే ప్రకటించగా, ఆ సమాచారాన్ని క్రోడీకరించి కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం రోజున జాతీయస్థాయిలో ఓటర్ల తుదిజాబితాను అధికారికంగా ప్రకటించింది.
ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించవచ్చని తెలుస్తోంది. రాష్ట్రాల విభజన జరిగిన పక్షంలో తెలంగాణలో ఒక విడత, ఆంధ్రప్రదేశ్‌లో ఒక విడతగా ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయని సమాచారం. మొత్తంగా గురువారం సమావేశం అనంతరం మార్చి 7నుంచి 10 మధ్యలో షెడ్యూలు ప్రకటించేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.
Advertisement
Advertisement