అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈ ఫలితాలే: వెంకయ్య
హైదరాబాద్: సీమాంధ్రలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లోనూ పునరావృతమవుతాయని బీజేపీ రాజ్యసభ సభ్యుడు వెంకయ్యనాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ గట్టిగానే ఉందని, అది కాద నలేని వాస్తవమని అన్నారు. అయినప్పటికీ టీడీపీ- బీజేపీ కూటమి తప్పక విజయం సాధిస్తుందని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో కూటమికి స్థానిక ఎన్నికల్లో వచ్చిన దానికన్నా మెరుగైన ఫలితాలు వస్తాయని బుధవారం విలేకరులకు తెలిపారు.
సాధారణ ఎన్నికల ఫలితాల తరువాత ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, తెలంగాణలో హంగ్ వస్తుందని చెప్పారు. ఈ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఎన్డీయేకు 300 వరకు సీట్లు వస్తాయన్నారు. కేంద్రంలో బీజేపీ ఏర్పాటు చేయబోయే ప్రభుత్వానికి దేశహితం కోరి ఏ రాజకీయ పార్టీ అయినా మద్దతు ఇవ్వడానికి ముందుకొస్తే తీసుకోవడానికి తమకేమీ అభ్యంతరం లేదని చెప్పారు. కాగా, రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల సరళిపై నరేంద్ర మోడీ ఆరా తీశారు. బుధవారం వెంకయ్య నాయుడుకు ఫోను చేసి తాజా పరిణామాలపై చర్చించారు.