మోడీ వారసుడి ఎంపికపై కసరత్తు?
గాంధీనగర్‌లో ఎమ్మెల్యేలు,నేతలతో మోడీ భేటీ
అహ్మదాబాద్‌లో బీజేపీ రాష్ట్ర కోర్ గ్రూప్ సమావేశం
గుజరాత్ తదుపరి సీఎంపై చర్చించేందుకే ఈ భేటీలంటూ కథనాలు
అహ్మదాబాద్: సార్వత్రిక ఎన్నికల ఘట్టం ముగిసింది. ఇక ఫలితాలు వెలువడటమే మిగిలి ఉంది. ఈలోగా ఎగ్జిట్ పోల్ సర్వేలన్నీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికే అధికారం ఖాయమని చెప్పడంతో గుజరాత్ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే విషయంపై అప్పుడే ఊహాగానాలు మొదలయ్యాయి. గుజరాత్ సీఎం నరేంద్రమోడీ బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా బరిలో ఉన్న సంగతి తెలిసిందే. ఇక మోడీ ప్రధానిగా ఢిల్లీ వెళ్లడం ఖాయమని, గుజరాత్‌లో ఆయన వారసుడిగా ఎవరిని ఎంపిక చేయాలనే అంశంపై కసరత్తు ప్రారంభించినట్టు కథనాలు వెలువడ్డాయి. గుజరాత్ బీజేపీ చీఫ్ ఆర్.సి.ఫల్దు అధ్యక్షతన పార్టీ కోర్ గ్రూప్ మంగళవారమిక్కడ సమావేశం కావడం ఈ కథనాలకు మరింత బలం పెంచింది. అనంతరం గాంధీనగర్‌లో బీజేపీ శాసనసభాపక్షం, పార్టీ రాష్ట్ర అగ్రనేతలతో నరేంద్ర మోడీ సమావేశమయ్యారు. దీంతో సీఎం వారసుడి ఎంపికపై చర్చించేందుకే వీరు భేటీ అయ్యారనే ఊహాగానాలు మరింతగా ఎక్కువయ్యాయి. అయితే వీటిని పార్టీ వర్గాలు తోసిపుచ్చాయి. ఇవి సాధారణంగా జరిగే సమావేశాలేనని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్ రుపానీ చెప్పారు. గుజరాత్ తదుపరి సీఎం ఎవరనే అంశంపై మే 16న లోక్‌సభ ఫలితాలు వెల్లడైన తర్వాతే చర్చిస్తామని స్పష్టంచేశారు. దీనిపై కేంద్ర పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. కాగా, గుజరాత్‌లో మోడీ వారసుడిగా ఇప్పటికే పలు పేర్లు తెరపైకి వచ్చాయి. ఇందులో మోడీ సన్నిహితుడు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమిత్‌షా, గుజరాత్ మహిళా మంత్రి ఆనంది బెన్ పటేల్, మంత్రులు నితిన్ పటేల్, సౌరభ్ పటేల్‌లతోపాటు పార్టీ రాష్ట్ర నేత భింకు దల్సానియాలు ఉన్నారు. నితిన్ పటేల్, దల్సానియాలు తాము గుజరాత్ సీఎం పదవి చేపట్టడానికి సన్నద్ధంగా ఉన్నామని ఇప్పటికే ప్రకటించారు.
హస్తినలో బీజేపీ నేతలు బిజీబిజీ..
న్యూఢిల్లీ: పోలింగ్ ముగిసి, ఎగ్జిట్ పోల్ సర్వేలు వెలువడిన నేపథ్యంలో మంగళవారం బీజేపీ నేతలు భేటీలతో బిజీబిజీగా గడిపారు. ఎగ్జిట్ పోల్ సర్వేలన్నీ ఎన్డీఏకే అధికారం అని చెప్పడంతో వాటి పై చర్చించుకున్నారు. బీజేపీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ.. పార్టీ అగ్రనేత అద్వానీని కలిసి భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. మరోవైపు జాతీయ ప్రయోజనాల దృష్ట్యా తమకు ఎవరు మద్దతిచ్చినా స్వాగతిస్తామని బీజేపీ నేత అమిత్ షా తెలిపారు.
కలసిమెలసి పనిచేస్తాం: ఒబామా
వాషింగ్టన్:భారత్‌లో రాబోయే ప్రభుత్వంతో కలసిమెలసి పనిచేయడానికి తాము ఎదురుచూస్తున్నామని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. రాబోయే కాలాన్ని రెండు దేశాలకు మరింత ప్రయోజనం చేకూర్చేలా వినియోగించుకునేందుకు ప్రయత్నిస్తామన్నారు. లోక్‌సభ ఎన్నికలు దిగ్విజయంగా ముగిసిన తరుణాన్ని పురస్కరించుకుని ఒబామా భారత ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.