మోడీ షో నేడే
నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్, హైదరాబాద్‌లలో పర్యటన
ఎల్‌బీ స్టేడియంలో ప్రసంగించనున్న పవన్‌కల్యాణ్
భారీ జనసమీకరణకు కమలదళం ముమ్మర ఏర్పాట్లు
'భారత్ విజయ్ సంకల్ప్ యాత్ర’గా నామకరణం
హైదరాబాద్: సరిగ్గా ఎనిమిది నెలల క్రితం... ఆగస్టు 11న ఎల్‌బీ స్టేడియంలో బహిరంగసభలో ప్రసంగించటం ద్వారా బీజేపీ తరఫున సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన ఆ పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ మరోసారి రాష్ట్రంలో పర్యటించబోతున్నారు. మంగళవారం ఆయన సుడిగాలి పర్యటన కోసం తెలంగాణకు వస్తున్నారు. నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్‌తోపాటు హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో నిర్వహించే బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు. ఒకేరోజు నాలుగు బహిరంగ సభలను ఏర్పాటు చేసిన బీజేపీ నేతలు వాటిని విజ యవంతం చేసేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో బహిరంగ సభలతో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రత్యర్థులపై విమర్శలు కురిపిస్తుండడం... మూడు రోజుల క్రితం కరీంనగర్‌లో సోనియా, సోమవారం మహబూబ్‌నగర్, నిజామాబాద్ జిల్లాల్లో రాహుల్ సభలతో కాంగ్రెస్ కాస్త ఉత్సాహం మీదుండగా బీజేపీ మాత్రం నియోజకవర్గాల ప్రచారానికే పరిమితమైంది. దీంతో మోడీ సభలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని వాటిని విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. వాస్తవానికి తెలంగాణలో రెండు విడతల్లో ప్రచారం చేయటానికి తొలుత నరేంద్రమోడీ అంగీకరించారు. రెండు రోజుల్లో తెలంగాణ మొత్తాన్ని చుట్టడం సాధ్యం కానందున మూడు రోజులు సమయం కేటాయించాలని పార్టీ తెలంగాణ నేతలు కోరారు.
కానీ దేశవ్యాప్తంగా ప్రచారాన్ని భుజానేసుకున్న మోడీ ఎన్నికల సభల షెడ్యూల్ అత్యంత బిజీగా ఉండటంతో దానికి అంగీకరించలేదు. ఆ తర్వాత సమయాభావం వల్ల రెండు విడతల పర్యటనను కూడా ఒక విడతకు కుదించుకున్నారు. తెలంగాణలో ప్రత్యర్థులకు గట్టిపోటీనిస్తున్నట్టుగా పార్టీ భావిస్తున్న నిజామాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్ పార్లమెంటు స్థానాల్లోనే ప్రచారానికి వస్తున్నట్టు మోడీ తేల్చిచెప్పారు. దీంతో కంగుతిన్న పార్టీ తెలంగాణ నేతలు అతికష్టంమీద మహబూబ్‌నగర్‌ను కూడా జోడించగలిగారు. అక్కడ కూడా పార్టీ గట్టిపోటీనిస్తోందని, మోడీ ప్రచారం చేస్తే పరిస్థితి మరింత అనుకూలంగా మారుతుందని ఆయనకు నివేదిక ఇవ్వటంతో దానికి అంగీకరించారు. దీంతో ఒకేరోజు నాలుగు సభలకోసం ఆయన పర్యటన ఖరారైంది. సోనియా, రాహుల్‌ల సభలకు జనం ఊహించినంతగా రాలేదని భావిస్తున్న బీజేపీ నేతలు ముందుగానే జాగ్రత్త పడ్డారు. నియోజకవర్గాల వారీగా సమావేశమై భారీ జనసమీకరణకు ఏర్పాట్లు చేశారు. ‘భారత్ విజయ్ సంకల్ప్ యాత్ర’గా వీటికి బీజేపీ నామకరణం చేసింది.
ఇదిలా ఉండగా నిజామాబాద్, హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో జరిగే బహిరంగ సభల్లో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ కూడా పాల్గొననున్నారు. పవన్‌కల్యాణ్‌ను నిజామాబాద్ సభకు తీసుకువెళ్లడానికి బీజేపీ నేతలు ప్రత్యేక హెలికాప్టర్‌ను ఏర్పాటు చేశారు. ఈ సభ అనంతరం పవన్ అదే హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు తిరిగి వచ్చి సాయంత్రం ఎల్‌బీ స్టేడియం సభకు హాజరై ప్రసంగిస్తారు.
ఎమ్మల్యే అభ్యర్థులకు మరో వేదిక...
మోడీ ఉండే వేదికపైకి బీజేపీ-టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు ప్రవేశం ఉండదని తెలుస్తోంది. వారి కోసం విడిగా వేదికలు ఏర్పాటు చేయాలని మోడీ భద్రతా సిబ్బంది పార్టీకి స్పష్టం చేశారు. దీంతో హైదరాబాద్, మెదక్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలకు చెందిన అభ్యర్థులు పాల్గొనే ఎల్‌బీస్టేడియం సభలో వారి కోసం అదనంగా మరో భారీ వేదికను ఏర్పాటు చేస్తున్నారు. ఎన్డీయే సభ అయినందున ఎల్‌బీస్టేడియంకు టీడీపీ అభ్యర్థులు కూడా హాజరవుతున్నారు. నిజామాబాద్, కరీంనగర్‌లలో మాత్రం ఈ విషయంలో స్పష్టత రాలేదు. తామూ హాజరవుతామంటూ టీడీపీ అభ్యర్థులు కోరుతున్నా బీజేపీ నేతలు తర్వాత చెప్తామని పేర్కొనటం విశేషం.
పర్యటన షెడ్యూల్ ఇలా...
నిజామాబాద్: మధ్యాహ్నం 1.45 గంటలు -
నరేంద్రమోడీ, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి జవదేకర్, పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పాల్గొంటారు.
కరీంనగర్: మధ్యాహ్నం 3.15 - మోడీ,
కిషన్‌రెడ్డిలు మాత్రమే పాల్గొంటారు.
మహబూబ్‌నగర్: సాయంత్రం 5 గంటలు -
మోడీ, చంద్రబాబు, బీజేపీ జాతీయస్థాయి నేత రాజ్ పురోహిత్, కిషన్‌రెడ్డి పాల్గొంటారు.
ఎల్‌బీస్టేడియం (హైదరాబాద్): సాయంత్రం
6.15 గంటలలు - మోడీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్, బీజేపీ నేతలు జవదేకర్, కిషన్‌రెడ్డి, సతీష్‌జీ, మురళీధర్‌రావులు పాల్గొంటారు.