మోడీ శైలే వేరు
సాక్షి, హైదరాబాద్: నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్ సభల్లో క్లుప్తంగా, చెప్పదలుచుకున్న విషయాలపై సూటిగా మాట్లాడిన బీజేపీ అగ్రనేత నరేంద్ర మోడీ హైదరాబాద్ ఎల్‌బీ స్టేడియంలో మాత్రం తనదైన బాణీలో ప్రసంగించారు. కాంగ్రెస్ పెద్దలకు చురకలంటించారు. అడపాదడపా చలోక్తులు సంధించారు. అవి ఆయన మాటల్లోనే...
ఢిల్లీలో ఎలాంటి ప్రభుత్వం కొలువు దీరాలి. గట్టిగా చెప్పండి.. ఆసుపత్రి బెడ్‌పై పడుకున్న ప్రభుత్వం కావాలా? తల్లీకొడుకుల(సోనియా, రాహుల్) ఆక్సిజన్‌తో నడిచే సర్కారు కావాలా? రిమోట్ కంట్రోల్‌తో నడిచే ప్రభుత్వం కావాలా?
- గత ఎన్నికల సమయంలో పది కోట్ల మందికి ఉపాధి చూపుతామని తల్లీకొడుకుల ప్రభుత్వం చెప్పింది. ఈ సభలో ఉన్న వారిలో ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా? మీ కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా వచ్చిందా? మీ దోస్తుల్లో ఎవరైనా ఉద్యోగం పొందారా? వారి దోస్తుల్లో ఎవరికైనా వచ్చిందా?
- మోడీ ప్లస్ పవన్‌కల్యాణ్ ప్లస్ బాబు... 1 ప్లస్ 1 ప్లస్ 1... ఎవరినైనా అడిగితే 3(ముగ్గురు) అంటారు. అది అర్థమెటిక్. కానీ నాకు కెమిస్ట్రీ కనిపిస్తుంది. ఇక్కడ ముగ్గురు కాదు. 111 (నూటాపదకొండు).
- దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు రావాలంటే వీసా ఉండాల్సిన పరిస్థితి నుంచి కొద్దిలో తప్పించుకున్నాం. ఆ పుణ్యం సర్దార్ వల్లభాయ్ పటేల్‌దే. ఆ ఉక్కు మనిషి ఈ సంస్థానాన్ని దేశంలో విలీనం చే యించి దీన్ని భారత్‌లో భాగం చేశారు.
తెలుగువారిపై పగ కాదా..?
మోడీ పాల్గొన్న నాలుగు వేదికల్లో ఓ అంశాన్ని గట్టిగా నొక్కి చెప్పారు. ఇందిర కుటుంబానికి ముందు నుంచీ తె లుగువారంటే కోపముందని వివరించారు. ఇందిరాగాంధీ హయాంలో రాష్ట్రపతిగా కాంగ్రెస్ అధికారిక అభ్యర్థి, తెలుగు వ్యక్తి నీలం సంజీవరెడ్డి గెలవకుండా ఆమె వీవీగిరిని గెలిపించారని గుర్తు చేశారు. దళిత ముఖ్యమంత్రి అంజయ్యను విమానాశ్రయం లో తీవ్రంగా అవమానించి రాజీవ్‌గాంధీ ఆయ న కంట నీరు పెట్టించారన్నారు. దానిపై విమర్శలు చెలరేగడంతో కోపంతో కొద్దిరోజులకే అంజయ్యను పదవి నుంచి తప్పించారన్నారు. పీవీ నరసింహారావు గొప్ప ప్రధానిగా చరిత్రలో నిలిచిపోయేలా పనిచేస్తే ఆయనను దారుణంగా అవమానిందన్నారు. ఆయన జయంతి, వర్ధంతి సమయాల్లో ఆ పార్టీ నేతలు కనీసం పుష్పాంజలి కూడా ఘటించరని పేర్కొన్నారు.