సీమాంధ్రలో బీజేపీ పోటీచేసే లోక్‌సభ స్థానాల్లో మాత్రమే ఆ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ ప్రచారం నిర్వహించనున్నారు.
హైదరాబాద్: సీమాంధ్రలో బీజేపీ పోటీచేసే లోక్‌సభ స్థానాల్లో మాత్రమే ఆ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ ప్రచారం నిర్వహించనున్నారు. మే 2 నుంచి 4 తేదీల్లో ఏదో ఒకరోజు ఆయన పర్యటించే అవకాశముంది. బీజేపీ పోటీ చేస్తున్న నాలుగు స్థానాల్లో మాత్రమే ఆయన పర్యటిస్తారు. విశాఖపట్నంతోపాటు నరసాపురం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని భీమవరం, తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ కేంద్రం, రాజంపేట లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని మదనపల్లిలో మోడీ పర్యటన కొనసాగనుంది.
టీడీపీ పోటీలో ఉన్న లోక్‌సభ స్థానాల్లోనూ ప్రచారం చేయాలని కోరుతున్నా.. అందుకు మోడీ విముఖత చూపుతున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. సీమాంధ్రలో మరో రోజు కూడా పర్యటించాలని మోడీని టీడీపీ అధినేత కోరినప్పటికీ తేదీలు సర్దుబాటు చేయడం కష్టంగా ఉందని సమాధానమొచ్చినట్టు సమాచారం. కాగా సీమాంధ్రలో మోడీ పర్యటించే సభల్లో ఒకట్రెండుచోట్ల బాబుతోపాటు పవన్‌కల్యాణ్ పాల్గొనే అవకాశమున్నదని తెలుస్తోంది.