ఎన్నికల్లో పరాజయానికి కారణాలపై రేపు ఏపీ పీసీసీ సమీక్ష
రాష్ట్ర స్థాయి సమావేశానికి విజయవాడలో ఏర్పాట్లు
విజయవాడ: సార్వత్రిక ఎన్నికల్లో ఓటమికి కారణాలపై సమీక్షించేందుకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీ పీసీసీ) సిద్ధమైంది. ఇందుకోసం ఈ నెల 17న విజయవాడలో రామవరప్పాడు చౌరస్తాలోని పరిణయ ఫంక్షన్ హాల్‌లో ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు సమావేశం నిర్వహించనుంది. ఈ రాష్ట్ర స్థాయి సమావేశానికి ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఏపీ పీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి రుద్రరాజు పద్మరాజు, మాజీ మంత్రి శైలజానాథ్, పార్టీ ప్రధాన కార్యదర్శి టీజే సుధాకర్‌లను పార్టీ నియమించింది. 13 జిల్లాల్లోనూ నియోజకవర్గాల వారీగా ఓటమికి కారణాలపై ఈ సమావేశంలో సమీక్షించడంతో పాటు పార్టీ పునరుత్తేజానికి అవసరమైన భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికనూ నేతలు రూపొందించనున్నారు.
రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఎన్నడూలేని విధంగా కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై దృష్టి సారించి పునరుత్తేజానికి చర్యలు తీసుకోవాలన్న ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ ఆదేశాలతో విజయవాడలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించాలని వారం కిందటే నేతలు నిర్ణయించారు. ఈ సమావేశానికి ఏపీ పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సహా 13 జిల్లాల నుంచి డీసీసీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు, ఏపీ పీసీసీ కార్యవర్గ సభ్యులు, సీనియర్ నాయకులు హాజరుకానున్నారని రుద్రరాజు పద్మరాజు తెలిపారు.
ఎందుకు ఓడిపోయాం?
Published Mon, Jun 16 2014 1:42 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement