ఒపీనియన్ పోల్స్ ఫలితాలపై ఆంక్షలు
మే 12 దాకా వెల్లడించవద్దని మీడియాకు ఈసీ ఆదేశాలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసేదాకా ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలను వెల్లడించరాదని మీడియాకు ఎన్నికల సంఘం (ఈసీ) బుధవారం ఆంక్షలు విధించింది. వచ్చే నెల 12న తుది విడత ఎన్నికలు ముగిసిన అరగంట వరకూ ఒపీనియన్, ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రచురణ, ప్రసారాలను నిలిపేయాలని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలను ఆదేశించింది. సార్వత్రిక ఎన్నికలకు ఈనెల 7న పోలింగ్ ప్రారంభం కాగా.. మొత్తం 9 విడతల్లో మే 12న ముగియనుంది.
ఎన్నికల నేపథ్యంలో ఈసీ ఇంతకుముందు ఏప్రిల్ 7 నుంచి మే 12 వరకూ ఎగ్జిట్‌పోల్స్ ఫలితాల వెల్లడిని నిషేధించింది. అలాగే ఆయా ప్రాంతాల్లో పోలింగ్‌కు 48 గంటల్లోపు ఒపీనియన్ పోల్స్ కూడా వెల్లడించరాదని స్పష్టం చేసింది. అయితే ఏప్రిల్ 14న పోలింగ్ జరిగిన 111 లోక్‌సభ స్థానాలకు సంబంధించి ఓ టీవీ చానెల్ (ఎన్‌డీ టీవీ) ఒపీనియన్ పోల్స్ ఫలితాలు ప్రసారం చేసిందని, ఓటింగ్‌ను ప్రభావితం చేసే ఇలాంటి చర్యలు ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 126ఏను ఉల్లంఘించడమేనని ఈసీ పేర్కొంది.
ఆ పార్టీల నుంచి పూర్తి పన్ను వసూలుచేయండి: సేకరించిన విరాళాల వ్యయానికి సంబంధించి నివేదికలు సమర్పించని పార్టీలకు పన్ను ప్రయోజనాలను రద్దు చేయాలని కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ)ని ఈసీ కోరింది. విరాళాల వ్యయంపై చాలా పార్టీలు ఇంతవరకూ నివేదికలు సమర్పించలేదని, అందువల్ల ఆ పార్టీలు స్వీకరించిన విరాళాలపై పూర్తి పన్నును వసూలు చేయాలని ఈసీ పేర్కొంది.