న్యూఢిల్లీ: మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. మహారాష్ట్రకు ఒకే దశలో నవంబర్ 20న, జార్ఖండ్‌కు రెండు విడతల్లో నవంబర్ 13న, 20న పోలింగ్ జరగనుంది. ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఎగ్జిట్ పోల్స్, ఈవీఎంల ట్యాంపరింగ్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు
ఎగ్జిట్స్ పోల్స్‌తో తమకు ఎలాంటి సంబంధం ఉండదని, వాటికి ఎలాంటి శాస్త్రీయత లేనప్పటికీ భారీ అంచనాలనే సృష్టిస్తాయని చెప్పారు. ఇందువల్ల ప్రజల్లో గంగరగోళం ఏర్పడుతోందని, ఈ విషయంలో మీడియా సహా భాగస్వామ్య పక్షాలు ఆత్మపరిశీలన చేసుకోవాల్సి అవసరం ఉందని, స్వీయ నియంత్రణ అవసరమని అన్నారు.
అయితే ఈ ఎగ్జిట్ పోల్స్‌కు శాంపిల్ సైజ్ ఏంటి.,? సర్వేలు ఎక్కడ జరిగాయి. అంచనాలకు అనుగుణంగా ఫలితాలు రాకుంటే మన బాధ్యత ఎంతవరకు? అనే విషయంలో ఎగ్జిట్ పోల్స్ సంస్థలు ఆలోచించుకోవాలని పేర్కొన్నారు. ఎగ్జిట్ పోల్స్‌లో వచ్చిన ఫలితాలు.. తుది ఫలితాలకు మధ్య ఉండే తేడా.. పార్టీలకు, అభ్యర్థులకు, చివరకు ప్రజల్లో కూడా తీవ్ర నిరాశకు దారితీస్తోందని రాజీవ్ కుమార్ వెల్లడించారు.
ఇటీవల హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ సంస్థలు.. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా తీర్పు ఇవ్వగా.. తుది ఫలితాలు మాత్రం అందుకు భిన్నంగా బీజేపీకి పట్టం కట్టిన నేపథ్యంలో ఎగ్జిట్‌పోల్స్ గురించి ఎన్నికల కమిషనర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇక హర్యానా ఎన్నికల ఫలితాల సందర్భంగా ఈవీఎంలపై కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలపైనా కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్.. స్పష్టతనిచ్చారు. మూడంచెల భద్రత నడుమ ఈవీఎంలు ఉంటాయని,ఆరు నెలల ముందే ఈవీఎంలను పరిశీలించి ఎన్నికల నిర్వహణలో ఉపయోగిస్తామని తెలిపారు. నచ్చని ఫలితాలు వచ్చినప్పుడే ఈవీఎంలపై ఆరోపణలు చేస్తున్నారు కానీ ఈవీఎంల ట్యాంపరింగ్ అసాధ్యమని పేర్కొన్నారు.
ఈవీఎంలపై వచ్చిన 20 ఫిర్యాదులకు వాస్తవాలతో కూడిన వివరణ ఇస్తామని స్పష్టం చేశారు. ఇక ఓట్ల లెక్కింపు మొదలైన అరగంటలోపే మీడియాల్లో.. ఎన్నికల ఫలితాలపై విశ్లేషణలు చేయడాన్ని ఈ సందర్భంగా రాజీవ్ కుమార్ ప్రశ్నించారు. అంత తొందర్లోనే ఫలితాల గురించి ఒక అంచనాకు ఎలా వస్తారని ప్రశ్నించారు. ఉదయం 9:30 గంటల కంటే ముందు ఇచ్చే ఫలితాలు అంతా బోగస్ అని కొట్టిపారేశారు.
Comments
Please login to add a commentAdd a comment