హమ్మయ్యా.. ఎట్టకేలకు ఈవీఎంల ట్యాంపరింగ్‌పై ఎన్నికల కమిషన్ నోరు విప్పింది. అయితే ఈ వివరణ మొత్తం ఏదో బుకాయిస్తున్నట్లు మాత్రమే ఉంది. ఏమాత్రం సంతృప్తికరంగా లేదు. మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ప్రకటన సందర్భంగా ఒక పత్రిక విలేఖరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఈవీఎంల మ్యానిప్యులేషన్‌పై ఎన్నో ప్రశ్నలు వచ్చాయి.
అయితే ముఖ్య ఎన్నికల కమిషనర్, ఇతర కమిషనర్లు కానీ ఈ అనుమానాలను సంతృప్తికరమైన సమాధానం ఇచ్చినట్లు కనిపించలేదు. పైగా ప్రశ్నలు వేసినవాళ్లు అధికులు ఉత్తరాది వారు కావడం వల్లనేమో లేక సమాచారం లేమి కారణంగానో తెలియదు కానీ.. ఇటీవలి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జరిగిన తంతుపై ఎక్కువ ప్రశ్నలు రాలేదు. హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్‌కు భిన్నంగా ఉండటంపైనే ప్రశ్నలు కొనసాగాయి. అలాగే ఒక కాంగ్రెస్ ఎంపీ ఈవీఎంలను హిజ్బొల్లా వాడిన పేజర్లతో పోల్చి.. ఇజ్రాయెల్ సైన్యం వాటిని పేల్చివేసిన వైనం గురించి ప్రస్తావించిన సంగతిని కోట్ చేసి అడిగారు. సహజంగానే ఈ ప్రశ్నలకు ఎన్నికల కమిషనర్లు ఎగ్జిట్ పోల్స్ శాస్త్రీయతపై అనుమానాలు రేకెత్తించేలా సమాధానమిచ్చారు.
మొదటి గంటలోనే ఫలితాలు ఎలా వస్తాయని ఈసీ ప్రశ్నించింది. అయితే ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ కాదు సమస్య. హరియాణాలో దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ దే అధికారం అన్న అంచనాకు వచ్చాయి. కొన్నిసార్లు ఈ అంచనాలు తప్పవచ్చు కానీ.. అన్ని సర్వేలూ తప్పు కావడం ఇదే మొదటిసారి కావచ్చు. అలాగే పోస్టల్ బ్యాలెట్ల ఫలితాలకు భిన్నంగా ఈవీఎం ఓట్ల లెక్కలు ఉండటం సహజంగానే అనుమానాలకు తావిస్తుంది. భారత్ వాడే ఈవీఎంలు హిజ్బొల్లా వాడే పేజర్ల కన్నా సమర్థమైనవని, ఎవరూ హ్యాక్ చేయలేరని ఈసీ అన్నప్పటికీ, దానిని సహేతుకంగా నిరూపిస్తామని చెప్పలేకపోవడం గమనార్హం. ఈవీఎంల బాటరీ ఛార్జింగ్ పోలింగ్ నాటి కన్నా, కౌంటింగ్ నాటికి ఎలా పెరుగుతుందన్న దానికి వీరు సమాధానం ఇవ్వకుండా వెళ్లిపోవడం గమనార్హం.
ఇజ్రాయిల్ హ్యాకింగ్ దిట్ట అని పేరు. పెగసస్ గూఢచర్య పరికరాలు, సాఫ్ట్‌వేర్లు అక్కడ తయారవుతున్నాయి. హిజ్బొల్లా వాడిన పేజర్లను తయారు చేసే తైవాన్ కంపెనీనే మేనేజ్ చేసి టాంపరింగ్ చేసి, వాటిని పేల్చివేయగలిగిందని వార్తలు వచ్చాయి. అలాంటి ఇజ్రాయిల్ నుంచి ఈవీఎం టాంపరింగ్ పరిజ్ఞానాన్ని ఎవరైనా ఇండియాకు తెచ్చారా అన్న సంశయం కొందరిలో ఉంది. దీన్ని మనం నిర్ధారించలేము కానీ ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికలు, వెల్లడైన ఫలితాలు, ఆ తర్వాత ఈసీ అధికారులు ప్రవర్తించిన తీరులను గమనిస్తే పలు సందేహాలు రాక మానవు. ప్రముఖ సర్వే నిపుణుడు ఆరా మస్తాన్ కొద్ది రోజుల క్రితం చాలా స్పష్టంగా ఈవీఎంలను హాక్ చేయవచ్చని, ఈ విషయాన్ని పలుమార్లు నిపుణులు రుజువు చేశారని అన్నారు. ఎలాన్ మస్క్ వంటివారు ఈ విషయం చెప్పిన తర్వాత కూడా భారత ఎన్నికల సంఘం సరైన తీరులో స్పందించకపోవడం సందేహాలకు తావిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఏపీలో అత్యధిక సర్వే సంస్థలు పోటాపోటీగా ఎన్నికలు జరుగుతున్నాయని, ఫలితాలు కూడా అలాగే ఉంటాయని, ఇరుపక్షాల మధ్య తేడా ఉంటే ఐదు లేదా పది సీట్లు ఉండవచ్చని అంచనా వేశాయి. కానీ అందరిని ఆశ్చర్యపరుస్తూ వైఎస్సార్‌సీపీకి కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చాయి. ఆ వెంటనే మాజీ ముఖ్యమంత్రి జగన్ మోసం జరిగిందని స్పష్టం చేశారు. కాకపోతే ఆధారాలు లేవని అన్నారు. కానీ ఆ తర్వాత పలు ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. ఆరా మస్తాన్ వంటివారు మొత్తం స్టడీ చేసి ఈవీఎంల మానిప్యులేషన్ జరిగిందన్న భావనకు వచ్చారు. అన్నిటిని మించి ఎన్నికల కమిషన్ ఎన్ని అరోపణలు వచ్చినా, నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడమే మోసం జరిగిందన్న దానికి పెద్ద ఎవిడెన్స్ అన్న భావన ఉంది. ఎన్నికల నాటికి, కౌంటింగ్ నాటికి మధ్య ఓట్ల శాతం ఎలా పెరిగిందన్న ప్రశ్నకు ఈసీ నుంచి జవాబు లేదు. ఏపీలో సుమారు 49 లక్షల ఓట్లు అదనంగా ఎలా వచ్చాయని ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం చేసిన ఆరోపణపై సరైన సమాధానం రాలేదు.
ఒంగోలు, విజయనగరంలలో వీవీప్యాట్ స్లిప్ లను లెక్కించాలని, ఈవీఎంలతో పోల్చాలని చేసిన అభ్యర్థనను పక్కదారి పట్టించడం, సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నా, దానిని అమలు చేయకపోవడం మరో డౌటు. ఈ ఒక్క విషయాన్ని ఎన్నికల సంఘం క్లియర్ చేసి ఉంటే ఈవీఎంలపై సందేహాలు వచ్చే అవకాశం ఉండదు. అలా చేయకపోవడంతో ఈవీఎంలను మేనేజ్ చేశారని అందువల్లే ఏపీలో జగన్ ప్రభుత్వం ఓటమికి గురైందని ప్రజలు అనుకునే పరిస్థితి వచ్చింది. వీవీప్యాట్ స్లిప్ లను పది రోజులలోనే దగ్ధం చేయాలని అప్పటి ఎన్నికల ముఖ్య అధికారి జిల్లా అధికారులకు ఎందుకు ఆదేశాలు ఇచ్చారన్నది ఇంతవరకు తేలలేదు. వీటన్నిటిపై అప్పటి వైసీపీ అభ్యర్ధి బాలినేని శ్రీనివాసరెడ్డి హైకోర్టుకు వెళితే, రెండు నెలలు దాటినా తీర్పు రాకపోవడం మరో చిత్రంగా భావిస్తున్నారు.
ఇక ఫారం 20లో ఆయా పార్టీలు, అభ్యర్థులకు వచ్చిన ఓట్ల వివరాలు నమోదు చేసి వెబ్‌సైట్ లో అప్‌లోడ్ చేయాల్సి ఉన్నా, ఏపీలో 108 రోజుల సమయం ఎందుకు తీసుకున్నారు? వాటిని పరిశీలిస్తే అనేక ప్రశ్నలు తలెత్తాయి. కొన్ని నియోజకవర్గాలలోని పోలింగ్ బూత్‌లలో వైసీపీకి ఒక్క ఓటు మాత్రమే రావడమేమిటో అర్థం కాదు. పైగా అసలు అంతగా ఉనికిలో లేని కాంగ్రెస్‌కు అదే బూత్ లో 470 ఓట్లు వచ్చాయని నమోదు కావడం మరో వింతగా చెబుతున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత, వీటిపై ఎన్నికల సంఘం ప్రజల ముందుకు వచ్చి ఈ అనుమానాలను నివృత్తి చేయకపోవడంపై అంతా విస్తుపోతున్నారు. మీడియా సమావేశంలో ఇలాంటి ప్రశ్నలకు జవాబు ఇవ్వకపోవడం ద్వారా ప్రజాస్వామ్య రక్షణకు గొడుగుగా ఉండవలసిన ఈ సంస్థకు ఏదో అయిందన్న అభిప్రాయం కలుగుతుంది.
పోనీ ఏపీ, ఒడిషా, హరియాణలలో గెలిచిన టీడీపీ, జనసేన, బీజేపీ పక్షాలైనా ఈవీఎంలపై విపక్షాలు వ్యక్తం చేస్తున్న డౌట్ల ను క్లియర్ చేయాలని ఎన్నికల సంఘానికి సూచించకపోవడం మరో సంశయంగా ఉంది. ఎందుకంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వంటివారు ఎన్నికలలో ఈవీఎంలను ఎలా టాంపర్ చేయవచ్చో, పలుమార్లు వివరించారు. ప్రస్తుతం ఆయన గెలిచారు కనుక ఆ అంశాల జోలికి వెళ్లడం లేదు. ఏపీలో కూటమి ఏర్పడినప్పటి నుంచి కేంద్ర ఎన్నికల సంఘం తీరు అంతా ఏకపక్షంగానే సాగిందన్నది బహిరంగ రహస్యం. ఈ నేపథ్యంలో దేశ ప్రజల కర్తవ్యం ఏమిటి? అయితే ఎన్నికల సంఘం స్పష్టత ఇవ్వాలి. అలా చేయకపోతే ప్రజాబాహుళ్యం నుంచి ఒత్తిడి మొదలు కావాలి. అది ఉద్యమ రూపం దాల్చాలి. ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదంగా మారిన ఈవీఎంల వ్యవస్థను తొలగించే వరకు అంతా ఉద్యమించాలి. దీనిపై దేశ వ్యాప్తంగా కదలిక రాకపోతే భవిష్యత్తులో ఇది మరింత అపాయంగా మారుతుంది. ఎవరికి వీలైతే వారు ఈవీఎం లను హాక్ చేసే అవకాశం ఉంటుంది. అందువల్ల వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ దీనిపై ప్రజా ఉద్యమం తీసుకురావడానికి పూనుకోవాలని అంతా భావిస్తున్నారు.
ముందుగా ఆయా సర్వే నిపుణులు, సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ప్రముఖులతో సమావేశం జరిపి, దేశ స్థాయిలో వివిధ ప్రాంతాలలో సెమినార్లు కండక్ట్ చేసి అందరిలోను ఒక కదలిక తీసుకు రాగలిగితే ఆయన దేశానికి ఒక మార్గదర్శకుడు అవుతారు. ఆయన ఎవరికి భయపడే వ్యక్తి కాదని, ఒకసారి నిర్ణయం తీసుకుంటే వెనుకడుగు వేయరని ఎక్కువమంది నమ్ముతారు. తొలుత ఆయన పార్టీ పరంగా తనకు ఆయా నియోజకవర్గాల నుంచి వచ్చిన సమాచారాన్ని క్రోడికరించి ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయాలి. వారు స్పందిస్తారా? లేదా? అన్నది అప్పుడే చెప్పలేం.
ఈవీఎంలపై అందరిని సంతృప్తిపరిచేలా ఈసీ జవాబు ఇవ్వగలిగితే ఓకే. అలా కాకుండా జగన్ గతంలోనే చెప్పినట్లు పేపర్ బాలెట్ ద్వారానే ఎన్నికలు జరిగేలా ఈ నాలుగేళ్లు ఉద్యమం చేపట్టడం అవసరం అనిపిస్తుంది. జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ హరియాణ ఎన్నికల ఫలితాల ద్వారా ఈసీకి పలు ఫిర్యాదులు చేసింది. వాటిలో వీవీప్యాట్ స్లిప్‌ల లెక్కింపు కూడా ఉంది. దీనిపై ఈసీ ఎలా స్పందిస్తుందో చూడాలి. కాగా ఈవీఎంల వ్యవహారంపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. దానికి కేంద్రం, ఈసీ ఎటూ అంగీకరించవు. కాబట్టి.. ప్రజా ఉద్యమమే ఈ సమస్య పరిష్కారానికి మేలైన మార్గం కాగలదు!
కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.
Comments
Please login to add a commentAdd a comment