ఆరు జిల్లాల్లో జగన్, విజయమ్మ, షర్మిల ముమ్మర ప్రచారం
రేపట్నుంచి విశాఖ,
విజయనగరంలలో జగన్
నేడు ఖమ్మంలో విజయమ్మ,
రేపు కృష్ణాలో షర్మిల
వైఎస్సార్ కాంగ్రెస్ ప్రధాన ప్రచారకర్తలైన పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి, గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, షర్మిల ఆరు జిల్లాల్లో స్థానిక, సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించబోతున్నారు. వైఎస్సార్ జనభేరి పేరుతో ఇప్పటికే పలు జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్న ఈ ముగ్గురు నేతల తదుపరి ఎన్నికల ప్రచారం వివరాలను పార్టీ కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
ఈ నెల 25, 26 తేదీల్లో విశాఖపట్నం జిల్లాలో, 27న విజయనగరం జిల్లాలో జగన్ పర్యటిస్తారు. 25వ తేదీ ఉదయం పది గంటలకు పాయకరావుపేట, సాయంత్రం 5 గంటలకు నర్సీపట్నంలో జరిగే బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు. 26న ఉదయం 9గంటలకు యలమంచిలి రోడ్‌షోలోనూ, సాయంత్రం 5గంటలకు తగరపువలస బహిరంగ సభలోనూ పాల్గొంటారు. 27వ తేదీన విజయనగరంలో జరిగే రోడ్‌షోలో పాల్గొంటారు.
ఈ నెల 24, 25 తేదీల్లో ఖమ్మం, పశ్చిమగోదావరి, 26న వైఎస్సార్ జిల్లాలో విజయమ్మ పర్యటిస్తారు. 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు మధిర, సాయంత్రం 6 గంటలకు ఇల్లెందు, 25న ఉదయం 9 గంటలకు కొత్తగూడెం, సాయంత్రం 4గంటలకు సత్తుపల్లిలో జరిగే రోడ్‌షోలో పాల్గొని, సాయంత్రం 6 గంటలకు పశ్చిమగోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెం బహిరంగసభలో ప్రసంగిస్తారు. ఆమె 26వ తేదీ మధ్యాహ్నానికి వైఎస్సార్ జిల్లాకు చేరుకుని అక్కడ పర్యటిస్తారు.
ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు షర్మిల కృష్ణా జిల్లాలో పర్యటిస్తారు. 25వ తేదీ సాయంత్రం 4 గంటలకు ఉయ్యూరు, రాత్రి 7 గంటలకు పెడనలో జరిగే రోడ్‌షోలో పాల్గొంటారు. 26న ఉదయం 9గంటలకు నూజివీడు, సాయంత్రం 4గంటలకు తిరువూరులో జరిగే రోడ్‌షోలోనూ, రాత్రి 7 గంటలకు నందిగామ బహిరంగ సభలోనూ పాల్గొంటారు. 27న ఉదయం 9గంటలకు జగ్గయ్యపేట, సాయంత్రం 4గంటలకు రోడ్‌షోలో పాల్గొంటారు