విజయనగరం ఫోర్ట్, న్యూస్‌లైన్:
ముచ్చటగా మూడో పోరుకు తెరలేచింది. ఇప్పటికే ఇటు మున్సిపల్ ఎన్నికలు, అటు సార్వత్రిక ఎన్నికలు ముంచుకొచ్చిన తరుణంలో ఆపసోపాలు పడుతున్న అధికారుల నెత్తిపై జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు వచ్చిపడ్డాయి. వీటి కోసం జిల్లా పరిషత్ అధికారులు రిజర్వేషన్లు ఖరారు చేశారు. జిల్లా పరిషత్, మండల పరిషత్‌ల పదవీకాలం 2011 ఆగస్టుతో ముగిసింది. పదవీకాలం ముగిసి మూడున్నర ఏళ్లు అయినప్పటికీ ప్రభుత్వం ఇంతవరకు ఎన్నికలు నిర్వహించలేదు. మరో వైపు మున్సిపల్ ఎన్నికలు ఆలస్యం చేయడంపై సుప్రీంకోర్టు ప్రభుత్వానికి అక్షింతలు వేసింది. దీంతో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై కూడా సుప్రీం కోర్టు హెచ్చరిస్తుందని గ్రహించి, ముందుగానే రిజర్వేషన్లు పూర్తి చేయాలని పంచాయతీరాజ్‌శాఖ అధికారులను ఆదేశించింది. అనుకున్నట్టుగానే సుప్రీం కోర్టు శుక్రవారం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల జాప్యంపై ప్రభుత్వంపై మండిపడింది. రెండు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆదేశించింది. దీంతో అధికారులు హడావుడిగా రిజర్వేషన్లు ఖరారు చేశారు. 549 ఎంపీటీసీల్లో ఎస్టీలకు62 స్థానాలు, ఎస్సీలకు 57 స్థానాలు, బీసీలకు 277 స్థానాలు కేటాయించారు. 153 స్థానాలను అన్‌రిజర్వుడ్ చేశారు. ఎస్టీల్లో 37 స్థానాలు మహిళలకు, 25 స్థానాలు పురుషులకు కేటాయించారు. ఎస్సీల్లో 35 స్థానాలు మహిళలకు, 22 స్థానాలు పురుషులకు, బీసీల్లో 144 మహిళలకు, 133 పురుషులకు, అన్‌రిజర్వుడ్ స్థానాల్లో 86 మహిళలకు, 67 స్థానాలు పురుషులకు కేటాయించారు.
జిల్లాలో 34 జెడ్పీటీసీ స్థానాలున్నాయి. ఇందులో ఎస్టీలకు నాలుగు స్థానాలు, ఎస్టీలకు నాలుగు స్థానాలు, బీసీలకు 17 స్థానాలు, అన్‌రిజర్వుడ్ స్థానాలు 9 ఉన్నాయి.
మండల పరిషత్ అధ్యక్షులకు సంబంధించి 19 ఎంపీపీ స్థానాలను మహిళలకు కేటాయించగా, 15 పురుషులకు కేటాయించారు.
ఎస్సీ, ఎస్టీ స్థానాలకు వారి జనాభా ఆధారంగా, బీసీలకు ఓటర్ల ఆధారంగా రిజర్వేషన్లు కేటాయించారు.
జిల్లాలో 13,22,694 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1,34,000 మంది ఎస్సీ ఓటర్లు కాగా, 1,29,000 మంది ఎస్టీ ఓటర్లు, 9,66,000 మంది బీసీ ఓటర్లు, 93,694 మంది ఓసీ ఓటర్లు ఉన్నారు.
వరుస ఎన్నికలతో ఉక్కిరిబిక్కిరవుతున్న అధికారులు:
సాధారణ ఎన్నికలు అన్ని రాజకీయ పార్టీలు తలమునికలు అయిన సందర్భంలో సుప్రీం కోర్టు మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. దీంతో రాజకీయనాయకులతో పాటు, అధికారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇంతలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించడంతో ఎలా నిర్వహించాలో అర్థకం కాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు
Published Sat, Mar 8 2014 2:46 AM | Last Updated on Sat, Sep 2 2017 4:27 AM
Advertisement
Advertisement