సాక్షి, హైదరాబాద్: భారత్ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్ర నుంచి బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. బీఆర్‌ఎస్‌ను జాతీయ స్థాయిలో బలోపేతం చేసేందుకు ఇది దోహదపడుతుందని ఆయన భావిస్తున్నట్టు సమాచారం. కాగా మహారాష్ట్రలోని నాందేడ్ లేదా ఔరంగాబాద్ లోక్‌సభ స్థానం నుంచి ఆయన పోటీ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.
నాలుగు దశాబ్దాలుగా క్రియాశీల రాజకీయాల్లో ఉన్న కేసీఆర్ గతంలో తెలంగాణలోని మూడు వేర్వేరు లోక్‌సభ నియోజక వర్గాల నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2004, 2006, 2008లో కరీంనగర్ నుంచి. 2009లో మహబూబ్‌నగర్ నుంచి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించారు. రాష్ట్ర అవతరణ నేపథ్యంలో 2014లో మెదక్ నుంచి లోక్‌సభకు ఎన్నికైన కేసీఆర్, సీఎం పదవిని చేపట్టడంతో ఎంపీ పదవికి రాజీనామా చేశారు.
జాతీయ రాజకీయాల్లో బలం చాటే వ్యూహం
జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్, బీజేపీల నేతృత్వంలోని కూటములకు సమదూరం పాటిస్తున్న కేసీఆర్ లోక్‌సభలో ఒంటరి పోరుకు సన్నద్ధమవుతున్నారు. మహారాష్ట్రలోని అన్ని లోక్‌సభ స్థానాల నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థులను బరిలోకి దింపేలా ఆయన వ్యూహ రచన చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మహారాష్ట్రలో 48 లోక్‌సభ నియోజకవర్గాలు ఉండగా, ఇప్పటికే 27 నియోజకవర్గాల పరిధిలో గ్రామ స్థాయి వరకు తొమ్మిదేసి పార్టీ కమిటీలు ఏర్పాటయ్యాయి.
మహారాష్ట్రలోని 15 జిల్లాల పరిధిలో పార్టీ కార్యకలాపాలు వేగం పుంజుకున్నట్లు మహారాష్ట్ర బీఆర్‌ఎస్ వర్గాలు వెల్లడించాయి. కాగా మహారాష్ట్ర నుంచి లోక్‌సభ బరిలోకి దిగడం ద్వారా జాతీయ రాజకీయాల్లో తన బలాన్ని చాటేలా కేసీఆర్ వ్యూహం సిద్ధం చేస్తున్నారని చెబుతున్నారు. అయితే ఈ ఏడాది చివర్లో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి దక్షిణాది నుంచి తొలి హ్యాట్రిక్ సీఎంగా నిలిచేందుకే కేసీఆర్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment