
15 కోట్లకు అమ్ముడుపోయారు!
సీపీఎం నేత తమ్మినేనిపై సీపీఐ నారాయణ తీవ్ర ఆరోపణలు
హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల్లో సీపీఎం వ్యవహరించిన తీరుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ నిప్పులు చెరిగారు. సీపీఐని ఓడించడమే లక్ష్యంగా ధన ప్రభావానికి తలొగ్గి అనైతిక, అవకాశవాద రాజకీయాలకు సీపీఎం పాల్పడిందని తీవ్రంగా ఆరోపించారు.ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గంలో తాను పోటీ చేస్తున్నట్టు సీపీఎంకు ముందే చెప్పి మద్దతు కోరినప్పటికీ తాము కూడా పోటీ చేస్తున్నట్టు చెప్పి.. ఆ తరువాత వైఎస్సార్‌సీపీ అభ్యర్ధి పి.శ్రీనివాసరెడ్డికి అనుకూలంగా సీపీఎం పోటీ నుంచి విరమించుకుందని విమర్శించారు. ఖమ్మంలో సీపీఐ అభ్యర్థి నారాయణను ఓడించేందుకు వైఎస్సార్సీపీ అభ్యర్థి నుంచి సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం రూ. 15 కోట్లు తీసుకున్నాడని స్థానిక ప్రజలు చెప్పుకుంటున్నారన్నారు.
నారాయణ బుధవారం మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక పరిస్థితుల్లో తెలంగాణలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నామని, అందుకు పార్టీ జాతీయ నాయకత్వం నుంచి కూడా అనుమతి తీసుకున్నామన్నారు. తమతో సర్దుబాట్లకు రమ్మని సీపీఎంను కూడా ఆహ్వానించామని, అందుకు సీపీఎం తిరస్కరిస్తూ కాంగ్రెస్‌తో పొత్తును సాకుగా చూపిందని నారాయణ గుర్తుచేశారు. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నందుకు తమను కాదన్న సీపీఎం.. తెలంగాణలో సమైక్యవాద పార్టీ వైఎస్సార్‌సీపీతో పొత్తు ఎలా పెట్టుకుంటుందని ప్రశ్నించారు.