నేడే రెండో విడత పోలింగ్ | today second fase section election | Sakshi
Sakshi News home page

నేడే రెండో విడత పోలింగ్

Published Wed, Apr 9 2014 1:47 AM | Last Updated on Sat, Sep 2 2017 5:45 AM

సార్వత్రిక ఎన్నికల రెండో విడతలో భాగంగా.. నాలుగు ఈశాన్య రాష్ట్రాల్లోని ఆరు లోక్‌సభ స్థానాలకు, అరుణాచల్‌ప్రదేశ్‌లోని 49 అసెంబ్లీ స్థానాలకు బుధవారం ఎన్నికలు జరగనున్నాయి.

6 లోక్‌సభ స్థానాలు, అరుణాచల్‌లో 49 అసెంబ్లీ సీట్లకు...  మూడో విడతకు ముగిసిన ప్రచారం

సార్వత్రిక ఎన్నికల రెండో విడతలో భాగంగా.. నాలుగు ఈశాన్య రాష్ట్రాల్లోని ఆరు లోక్‌సభ స్థానాలకు, అరుణాచల్‌ప్రదేశ్‌లోని 49 అసెంబ్లీ స్థానాలకు బుధవారం ఎన్నికలు జరగనున్నాయి. అరుణాచల్‌ప్రదేశ్, మేఘాలయల్లో రెండేసి సీట్లకు, నాగాలాండ్, మణిపూర్‌లలో ఒక్కో స్థానానికి లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. మిజోరంలోని ఏకైక లోక్‌సభ స్థానంలో కూడా రెండో విడతలోనే ఎన్నికలు జరగాల్సి ఉన్నా.. మిజో విద్యార్థి సంఘాలు బంద్‌కు పిలుపునివ్వడంతో పోలింగ్‌ను 11వ తేదీకి వాయిదా వేశారు. త్రిపురలోని శరణార్థుల శిబిరాల్లో తలదాచుకుంటున్న మిజోరం రాష్ట్రానికి చెందిన బ్రూ తెగ ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేసే అవకాశం కల్పించాలన్న ఈసీ నిర్ణయాన్ని నిరసిస్తూ మిజో విద్యార్థి సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో మిజోరంలోని ఏకైక లోక్‌సభ స్థానంతోపాటు అక్కడి హ్రాంగ్‌టుర్జో అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నికను ఈసీ 11వ తేదీకి వాయిదా వేసింది.
 
నాగాలాండ్‌లోని ఏకైక లోక్‌సభ స్థానానికి ఆ రాష్ట్ర సీఎం నేప్యూ రియోతో సహా ముగ్గురు అభ్యర్థులు పోటీపడుతున్నారు.
మణిపూర్‌లోని ఔటర్ మణిపూర్ స్థానంలో ప్రధాన పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు కలిపి పది మంది బరిలో ఉన్నారు.
ఇక అరుణాచల్‌లోని పశ్చిమ, తూర్పు స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీ, ఎన్సీపీ, పీపీఏల మధ్య బహుముఖ పోరు నెలకొంది.
మేఘాలయలోని రెండు లోక్‌సభ స్థానాల్లో పది మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఎన్‌పీపీ చీఫ్ పీఏ సంగ్మా సహా పలువురు సీనియర్లు ఇక్కడ పోటీలో ఉన్నారు.
 
మరోవైపు మూడో విడత ఎన్నికల ప్రచారానికి మంగళవారం తో తెర పడింది. 11 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 92 సీట్లకు గురువారం ఎన్నికలు జరగనున్నాయి. లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్, కేంద్ర మంత్రులు సిబల్, కమల్‌నాథ్, శశి థరూర్, ఆర్మీ మాజీ చీఫ్ వి.కె.సింగ్‌లు మూడో దశ బరిలో ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement