నలుగురు ఐఎం ఉగ్రవాదులు అరెస్ట్ | Four IM terrorists arrested | Sakshi
Sakshi News home page

నలుగురు ఐఎం ఉగ్రవాదులు అరెస్ట్

Published Mon, Mar 24 2014 4:08 AM | Last Updated on Sat, Sep 2 2017 5:04 AM

నలుగురు ఐఎం  ఉగ్రవాదులు అరెస్ట్

నలుగురు ఐఎం ఉగ్రవాదులు అరెస్ట్

జైపూర్‌లో ఇద్దరు, జోథ్‌పూర్‌లో ఒకరు, అజ్మీర్‌లో మరొకరు
అదుపులో మరో అనుమానితుడు  భారీగా పేలుడు పదార్థాల స్వాధీనం

 

 సార్వత్రిక ఎన్నికల ముందు ఉగ్రవాదులు పన్నిన భారీ విధ్వంస ప్రణాళికను ఢిల్లీ  స్పెషల్ సెల్ పోలీసులు విచ్ఛిన్నం చేశారు. పలు బాంబు పేలుళ్లలో కీలక నిందితుడిగా ఉన్న కరడుకట్టిన పాకిస్థాన్ ఉగ్రవాది, ఇండియన్ ముజాహిదీన్(ఐఎం) సంస్థకు చెందిన జియా ఉర్‌రెహ్మాన్ అలియాస్ వకాస్(25)ను అతడి ముగ్గురు అనుచరులను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు రాజస్థాన్‌లో అరెస్ట్ చేశారు.


వకాస్ ముంబైలోని బాంద్రా నుంచి అజ్మీర్‌కు వస్తున్నాడనే సమాచారంతో కాపు కాసి.. అజ్మీర్ రైల్వే స్టేషన్‌లో శనివారం ఉదయం పట్టుకోగలిగారు. ఇతడు దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్లలో కీలక నిందితుడు. వకాస్ అనుచరులైన మహమ్మద్ మహ్రూఫ్(21), మహమ్మద్ వకార్ అజార్ అలియాస్ హనీఫ్(21)ను జైపూర్‌లో, షకీబ్ అన్సారీ అలియాస్ ఖలీద్(25)ను జోథ్‌పూర్‌లో స్థానిక పోలీసుల సహకారంతో ఆదివారం వేకువ జామున అరెస్ట్ చేశారు. వీరితో సంబంధముందనే అనుమానంతో మరో యువకుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వీరి అరెస్టుతో పెను ప్రమాదం తప్పిపోయింది.

వీరి ఇళ్ల నుంచి పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు, డిటోనేటర్లు, ఎలక్ట్రానిక్ సర్క్యూట్లు, టైమర్లను స్వాధీనం చేసుకున్నామని ఢిల్లీ స్పెషల్ పోలీస్ సెల్ ప్రత్యేక కమిషనర్ ఎస్.ఎన్.శ్రీవాత్సవ ఆదివారమిక్కడ మీడియాకు వెల్లడించారు. భారీ ఉగ్రదాడులను నిరోధించగలిగామని ఆయన చెప్పారు.


  విచారణలో వకాస్ తాను రాజస్థాన్ రావడానికి గల కారణాన్ని బయటపెట్టాడు. తెహ్‌సీన్ అక్తర్ ఆదేశాల మేరకు భారీ దాడికి సంబంధించిన ‘రాజస్థాన్ మాడ్యూల్’ విషయంలో ముగ్గురు అనుచరుల మధ్య సమన్వయం చేయడంతోపాటు వారు నిర్వహించిన సన్నాహకాలను పరిశీలించడానికి వచ్చినట్లు వకాస్ తెలిపాడు. ఇతడిని పోలీసులు ఆదివారం ఢిల్లీలోని స్పెషల్ కోర్టు ముందు హాజరుపరిచారు. కోర్టు వకాస్‌కు 10 రోజుల పోలీస్ కస్టడీ విధించింది.
 
ఐఈడీ, ఇతర పేలుడు పదార్థాల వినియోగంలో వకాస్ సిద్ధహస్తుడు. ఐఎం సహ వ్యవస్థాపకుడైన యాసిన్ భత్కల్‌కు ముఖ్య అనుచరుడు. 2013 ఫిబ్రవరి 21 హైదరాబాద్‌లోని దిల్‌షుక్ నగర్ వరుస బాంబు పేలుళ్లలో పాల్గొన్నాడు. ఈ దాడిలో 17 మంది ప్రాణాలు కోల్పోగా, 119 మంది గాయాలపాలైన విషయం తెలిసిందే.  
 
వకాస్ అంతకుముందు 2012 ఆగస్టు1న పుణె వరుస పేలుళ్లు, 2011 జూలై 12న ముంబైలోని జవేరీబజార్‌లో జరిగిన పేలుళ్లు, 2010 సెప్టెంబర్ 19 జామా మసీదు, అదే ఏడాది డిసెంబర్ 7న వారణాసిలోని షీత్లా ఘాట్ వద్ద జరిగిన పేలుళ్లలో ఇతడి హస్తం ఉందని శ్రీవాత్సవ వెల్లడించారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీని లక్ష్యంగా చేసుకున్నారా? అన్న మీడియా ప్రతినిధుల ప్రశ్నకు... ప్రస్తుత దర్యాప్తు స్థాయిలో ఏమీ చెప్పలేమని శ్రీవాత్సవ అన్నారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఎవరైనా రాజకీయ నేత లేదా సభపై దాడికి ఉగ్రవాదులు ప్రణాళిక రచించారా? అని అడగ్గా... ఏ ముఖ్య కార్యక్రమాన్నైనా వారు లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని చెప్పారు. మహ్రూఫ్, వకార్ ఇద్దరూ జైపూర్‌లో ఇంజనీరింగ్ విద్యార్థులు కాగా, అన్సారీ డీటీపీ సెంటర్ నడుపుతున్నట్లు శ్రీవాత్సవ తెలిపారు. వీరు పాక్ ఉగ్రవాద శిబిరాల్లో శిక్షణ తీసుకొన్నారని చెప్పారు.
 

రాజస్థాన్ మాడ్యూల్ గురించి యాసిన్ భత్కల్, హద్ది విచారణ సందర్భంగా లోగడే వెల్లడించినప్పటికీ దీనిలో ఎవరెవరు ఉన్నారన్న వివరాలను వారు వెల్లడించకపోవడంతో దీన్ని పోలీసులు ఇప్పటికీ చేధించలేకపోయారు. కస్టడీలో వకాస్, అతడి అనుచరుల ద్వారా దీనికి సంబంధించి మరిన్ని వివరాలు లభిస్తాయని ఆశిస్తున్నారు.
 

జోథ్‌పూర్ పోలీస్ కమిషనర్ సచిన్ మిట్టల్ మాట్లాడుతూ... ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు స్థానికంగా బర్కతుల్లాఖాన్ కాలనీలో మహమ్మద్ షకీబ్ అన్సారీని అరెస్ట్ చేశామని చెప్పారు. అతడి ఇంటి నుంచి పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నామన్నారు. వాటిలో 6.5కేజీల అమ్మోనియం నైట్రేట్, 42కేజీల గన్ పౌడర్, 17.65 కేజీల రాతి పొడి, 1.6కేజీల ఫాస్పరస్, ఫ్యూజ్‌వైరు, 3టైమర్ స్విచ్చులు, 8 ఎలక్ట్రానిక్ స్విచ్చులు, 15 డయోడ్లు, బ్యాటరీలు, డిటోనేటర్ క్యాప్‌లు, పెన్‌డ్రైవ్‌లు, సెల్‌ఫోన్లు ఇతర వస్తువులు ఉన్నాయని తెలిపారు. ప్రాథమిక విచారణలో షకీబ్ అన్సారీ ఇద్దరు సహాయకులు బర్కత్, మహమ్మద్ ఆదిల్ పేర్లు వెల్లడించారని.. బర్కత్ పారిపోగా, ఆదిల్ పట్టుబడ్డాడని తెలిపారు. ఇతడు స్థానికంగా ఒక ఇంజనీరింగ్ కాలేజీలో బోధకుడిగా పనిచేస్తున్నట్లు మిట్టల్ చెప్పారు. బర్కత్ సివిల్ కాంట్రాక్టరని తెలిసిందని అతడిని త్వరలో పట్టుకుంటామన్నారు. వారి ప్రణాళిక ఏమిటో ఇంకా వెల్లడి కాలేదన్నారు.
 
 ‘దిల్‌సుఖ్‌నగర్’ కేసులో కీలక నిందితుడు
 
  హైదరాబాద్: తాజాగా పట్టుబడిన వకాస్‌తో దిల్‌సుఖ్‌నగర్ వరుస బాంబు పేలుళ్ల కేసులో మరో ఉగ్రవాది పట్టుబడినట్లుయింది. అసదుల్లా అక్తర్, తెహసీన్ అక్తర్‌తో కలసి వకాస్ గతేడాది ఫిబ్రవరి 21న దిల్‌సుఖ్‌నగర్‌పేలుళ్లలో పాల్గొన్నారు. ఈ కేసులో ఎన్‌ఐఏ అధికారులు రియాజ్ భత్కల్‌ను ప్రధాన నిందితుడిగా (ఏ-1)గా,  యాసీన్‌ను ఐదో నిందితుడుగా, అసదుల్లా, వఖాస్, తెహసీన్‌లను ఏ-2, ఏ-3, ఏ-4గా పేర్కొన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఢిల్లీ పోలీసు కస్టడీలో ఉన్న వకాస్‌ను పీటీ వారంట్‌పై హైదరాబాద్ తీసుకొచ్చేందుకు ఎన్‌ఐఏ సన్నాహాలు చేస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement