Delhi Police Special Cell
-
చైనా నుంచి నిధులు.. ఢిల్లీలో న్యూస్‌క్లిక్ జర్నలిస్టుల నివాసాల్లో సోదాలు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో పలువురు జర్నలిస్టుల నివాసాల్లో ఢిల్లీ పోలీసులు సోదాలు నిర్వహించడం కలకలం రేపుతోంది. ప్రముఖ మీడియా పోర్టల్ ‘న్యూస్‌క్లిక్’కు సంబంధించిన జర్నలిస్టులు, ఉద్యోగుల ఇళ్లలో మంగళవారం ఉదయం నుంచి ఢిల్లీ పోలీస్ ప్రత్యేక విభాగం తనిఖీలు చేపట్టింది. ఏకకాలంలో ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్‌లోని 100 చోట్ల ఆకస్మిక దాడులు నిర్వహిస్తోంది. న్యూస్‌క్లిక్ సంస్థకు చైనా నుంచి అక్రమంగా నిధులు అందాయన్న ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు జరుపుతోంది. ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు సీజ్.. ఈ దాడుల్లో జర్నలిస్టులు, ఉగ్యోగులకు సంబంధించిన ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు సహా ఎలక్ట్రానిక్ సాక్ష్యాలను స్వాధీనం చేసుకున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అందించిన సమాచారం ఆధారంగా ఢిల్లీ పోలీసులు ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. న్యూస్‌క్లిక్ వ్యవస్థాపకుడు చీఫ్ ఎడిటర్ ప్రబీర్ పుర్కాయస్థతో సహా తమంది జర్నలిస్టులను లోధీ రోడ్‌లోని స్పెషల్ సెల్ కార్యాలయానికి తీసుకువచ్చి విచారిస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ ఎవరినీ అరెస్టు చేయలేదని అధికారులు తెలిపారు. భారీగా విదేశీ నిధులు ఇక న్యూస్ క్లిక్ సంస్థ మూడేళ్ల స్వల్ప వ్యవధిలోనే రూ. 38.05 కోట్ల విదేశీ నిధులను మోసగించినట్లు ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) ద్వారా రూ. 9.59 కోట్లు, సేవల ఎగుమతి ద్వారా రూ. 28.46 కోట్లు విదేశీ రెమిటెన్స్ వచ్చినట్లు గుర్తించినట్లు తేలింది. అలా వచ్చిన నిధులను గౌతమ్ నవ్లాఖా, హక్కుల కార్యకర్త తీస్తా సెతల్వాద్ సహా పలువురు వివాదాస్పద జర్నలిస్టులకు పంపిణీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ సొమ్మును దేశ వ్యతిరేక కార్యకలాపాలకు వినియోగించిందని ఈడీ ఆరోపించింది. సీతారాం ఏచూరి నివాసంలోనూ సోదాలు.. న్యూస్‌క్లిక్‌కు సంబంధించి సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అధికారిక నివాసంలో కూడా ఢిల్లీ పోలీసులు సోదాలు నిర్వహించారు. సీపీఎం ఉద్యోగి శ్రీనారాయణ్ ఇంటిపై తనిఖీలు చేపట్టింది. కాగా నారాయణ్ కొడుకు న్యూస్ క్లిక్‌లో పనిచేస్తున్నాడు. అయితే సీపీఎం అధికార నివాసాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పేరిట కేటాయించారు. తన నివాసంలో జరిగిన దాడులపై ఏచూరి స్పందించారు. చదవండి: 'సనాతన ధర్మం మాత్రమే మతం.. మిగిలినవన్నీ..' మీడియా నోరు నొక్కేందుకే..? పోలీసులు తన నివాసానికి వచ్చారని, అక్కడ తనతోపాటు నివసిస్తున్న సహచరుడి కుమారుడు న్యూస్‌క్లిక్‌లో పనిచేస్తున్నాడని తెలిపారు. అతడిని విచారించేందుకు పోలీసులు వచ్చినట్లు చెప్పారు. అతని ల్యాప్‌టాప్, ఫోన్‌ను తీసుకున్నారని అయితే పోలీసులు ఏ కేసులో ఈ దర్యాప్తు చేస్తున్నారో తనకు తెలియదని పేర్కొన్నారు. ఒకవేళ ఇది మీడియా నోరును నొక్కేందుకు జరుగుతున్న ప్రయత్నమైతే.. దీని వెనకున్న కారణాన్ని దేశమంతా తెలుసుకోవాలని అన్నారు. తప్పు చేస్తే దర్యాప్తు చేస్తారు: కేంద్రమంత్రి ఢిల్లీ పోలీసుల సోదాలపై కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందిస్తూ.. దీనిని సమర్థించాల్సిన అవసరం లేదన్నారు. ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే దర్యాప్తు సంస్థలు నిర్ణీత మార్గదర్శకాల ప్రకారం విచారించే స్వేచ్ఛ ఉంటుందని తెలిపారు. మరోవైపు న్యూస్‌క్లిక్‌తో సంబంధం ఉన్న జర్నలిస్టులు, ఉద్యోగుల ఇళ్లపై దాడులు చేపట్టడంపై ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. చదవండి: ప్రభుత్వ ఆసుపత్రిలో ఘోరం.. 24 గంటల్లో 24 మంది మృతి చైనా నుంచి నిధులు న్యూస్‌క్లిక్‌కు చైనా నుంచి నిధులు అందుతున్నట్టుగా ఇటీవల ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. గతంలో కూడా ఈ మీడియా సంస్థకు చెందిన కార్యాలయాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు జరిపింది. ఈ క్రమంలో న్యూస్ క్లిక్ సంస్థకు చెందిన కొంతమంది ఉద్యోగులు చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడినట్లు అనుమానిస్తూ.. చట్టవ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం(UAPA) కింద సదరు సంస్థపై ఆగస్టు 17న కేసు నమోదైంది. దీని ఆధారంగానే పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. కాగా , చైనా అనుకూల ప్రచారాన్ని వ్యాప్తి చేయడానికి అమెరికన్ బిలియనీర్ నెవిల్లే రాయ్ సింఘమ్ నుంచి నిధులను పొందిన గ్లోబల్ నెట్‌వర్క్‌లో ఈ సంస్థ కూడా భాగమని న్యూయార్క్ టైమ్స్ గతంలో పేర్కొంది. ఈ ఆరోపణలు న్యూస్‌క్లిక్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న పరిశోధనలు, చర్యలకు మరింత ఊతమిచ్చాయి. -
ముగ్గురు ఐఎస్ ఉగ్రవాదుల అరెస్ట్
శ్రీనగర్: ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర సంస్థతో సంబంధాలు కలిగిన ముగ్గురు వ్యక్తులను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తుల నుంచి పేలుడు పదార్థాలతో పాటు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. వీరిని జమ్ము కశ్మీర్‌కు చెందిన తాహిర్ ఆలీ ఖాన్, హరిస్ ముస్తక్ ఖాన్, ఆసిఫ్ సుహిల్గా గుర్తించారు. ఐఎస్ భావజాలానికి ఆకర్షితులైన వీరు.. ఆ సంస్థ కోసం పనిచేస్తున్నట్టుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఐఎస్ ఉగ్రసంస్థకు ఆయుధాలు సమకూర్చడానికి, ఆర్థికంగా చేయూత అందించడానికి ఈ ముగ్గురు వ్యక్తులు సహాకరిస్తున్నట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఢిల్లీలో ఉగ్ర కార్యకలాపాలు పెంపొందించేందుకు కూడా వీరు ప్రణాళికలు రచించారు. ఉగ్రవాదులను విచారిస్తున్న పోలీసులు.. వారి వద్ద నుంచి కీలక సమాచారం సేకరించినట్టుగా సమాచారం. దీనిపై ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ డీసీసీ మాట్లాడుతూ.. ‘సెప్టెంబర్ 6వ తేదీన ఐఎస్ ఉగ్రసంస్థ కోసం పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారు ఆయుధాలు కలిగి ఉండటంతో.. లోతైన దర్యాప్తు చేపట్టాం. వారిద్దరిని విచారించగా ఢిల్లీలో ఐఎస్ కార్యకలాపాలు సాగుతున్నాయనే విషయం అర్థమైందన్నారు. ఆ వ్యక్తుల నుంచి సేకరించిన సమాచారంతో శ్రీనగర్ చేరుకుని అక్కడి పోలీసులతో కలిసి జాయింట్ ఆపరేషన్ చేపట్టాం. ఉగ్రవాదుల నుంచి మూడు గ్రెనేడ్లు, రెండు లోడెడ్ పిస్టల్స్ స్వాధీనం చేసుకున్నాం. జమ్ము కశ్మీర్లో ఉగ్ర నిర్మూలనకు తమ బృందం పనిచేస్తుందన్నారు. వీరు కోతి బాగ్‌లో జరుగుతున్న పోలీస్ పార్టీపై గ్రెనేడ్ దాడి చేసేందుకు ప్రయత్నించినట్టు తెలిపారు. -
మరో మారణ హోమానికి ప్లాన్ చేస్తున్నారా?
న్యూఢిల్లీ: భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా లష్కరే ఈ తోయిబా, జైషే మహమ్మద్ ఉగ్రవాదులు దాడి చేయనున్నారా? 2008 ముంబై తరహా దాడులకు పథక రచన చేస్తున్నారా.. ఆగస్ట్ 15 సందర్భంగా ఢిల్లీలో మారణ హోమం సృష్టించడానికి పూనుకుంటున్నారా.. అవుననే అంటున్నారు ఢిల్లీ ప్రత్యేక విభాగం పోలీసు అధికారులు. జమ్మూ కశ్మీర్ కేంద్రంగా పనిచేస్తున్న టెర్రరిస్టులు ఆగస్ట్ 15, అంతకు ముందు దాడులు చేయడానికి ప్రయత్నిస్తున్నారని, నిఘా అధికారుల నుండి తమకు హెచ్చరికలు వచ్చినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసు వర్గాల్లో కలవరం మొదలైంది. దాంతో ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అప్రమత్తమయ్యారు. లోధి రోడ్‌లోని తమ సంస్థల కార్యాలయాల భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తున్నట్లు తెలిపారు. ఇంటిలిజెన్స్ విభాగం హెచ్చరికల ప్రకారం ఒకవైపు టెర్రరిస్టులు దాడులకు సిద్ధమవుతోంటే.. మరోవైపు ఢిల్లీ పోలీసు ఉన్నతా ధికారుల్లో మాత్రం రక్షణ సౌకర్యాల లేమిపై ఆందోళన మొదలైంది. తమ దగ్గర సరైన రక్షణ వ్యవస్థ లేదనందున తమ శ్రేణుల భద్రతకోసం మరిన్ని అధునాతన రక్షణ పరికరాలతో పాటు, సీసీ కెమెరాలు అవసరమని చెబుతున్నారు. ముఖ్యంగా ఎన్ఎస్జీ, ఎస్పీజీ,సిఐఎస్ఎఫ్, బీఎస్ఎఫ్ దళాల రక్షణకు ప్రత్యేక యూనిట్ కావాలని, ఎవరైనా వాహనంతో బలవంతంగా తమ ఆఫీసులో చొరబడితే, దాన్ని ఎదుర్కొనే శక్తి లేదనీ, మరిన్ని రక్షణ సౌకర్యాలు కల్పించాలని ఢిల్లీ సీనియర్ పోలీసు అధికారి అన్నారు. అత్యాధునిక, వాటర్ ప్రూఫ్ గేట్లు, సుమారు 20 టన్నుల భారాన్ని మోసే, మూడు సెకండ్లలో తెరుచుకునే మెటల్ గేట్స్ అవసరం చాలా ఉందన్నారు. మరోవైపు ఉగ్రదాడికి సంబంధించి ఇంటిలిటెన్స్ ఏజెన్సీ ఇప్పటికే అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో ఢిల్లీలో డ్రోన్ల వాడకాన్ని నిషేధించారు. ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన విమానాలు మినహా, మిగిలినవాటికి అనుమతి లేదని ఢిల్లీ పోలీస్ అధికారి ఒకరు స్పష్టం చేశారు. నిబంధనల్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. -
భారీ ఎత్తున అక్రమ ఆయుధాలు స్వాధీనం
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ సోమవారం సరాయ్‌కాలే ఖాన్‌లో ముగ్గురు ఆయుధ స్మగ్లర్లను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి భారీ ఎత్తున అక్రమ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. 1,800 కాట్రిడ్జ్‌లు, 9 డబుల్ బ్యారెల్ తుపాకులు, రెండు సింగిల్ బ్యారెల్ తుపాకులను స్వాధీనపరచుకున్నారు. అక్రమ ఆయుధాల గురించి సమాచారం అందడంతో ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ డీసీపీ సంజీవ్ యాదవ్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం నిందితులపై దాడి చేసింది. అక్రమ ఆయుధాల రాక గురించి అందిన సమాచారం ఆధారంగా వలపన్ని ముగ్గురిని అరెస్టు చేసినట్లు స్పెషల్ సెల్ కమిషనర్ ఎస్.ఎన్.శ్రీవాస్తవ చెప్పారు. అయితే ఈ ఆయుధాలను నిందితుల నుంచి తీసుకోవాల్సిన వారిని పోలీసులు ఇంతవరకు అరెస్టు చేయలేదు. ఆయుధాలను అందించడానికి వచ్చిన నిందితులు మాత్రమే పోలీసుల చేతికి చిక్కారు. ఈ స్థాయిలో ఆయుధాలు పోలీసులకు దొరకడం ఈ ఏడాదిలో రెండోసారి. గతంలో కూడా 900 కాట్రిడ్జ్‌లతో పాటు స్మగ్లర్లను పోలీసులు అరెస్టు చేశారు. -
నలుగురు ఐఎం ఉగ్రవాదులు అరెస్ట్
జైపూర్‌లో ఇద్దరు, జోథ్‌పూర్‌లో ఒకరు, అజ్మీర్‌లో మరొకరు అదుపులో మరో అనుమానితుడు భారీగా పేలుడు పదార్థాల స్వాధీనం సార్వత్రిక ఎన్నికల ముందు ఉగ్రవాదులు పన్నిన భారీ విధ్వంస ప్రణాళికను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు విచ్ఛిన్నం చేశారు. పలు బాంబు పేలుళ్లలో కీలక నిందితుడిగా ఉన్న కరడుకట్టిన పాకిస్థాన్ ఉగ్రవాది, ఇండియన్ ముజాహిదీన్(ఐఎం) సంస్థకు చెందిన జియా ఉర్రెహ్మాన్ అలియాస్ వకాస్(25)ను అతడి ముగ్గురు అనుచరులను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు రాజస్థాన్‌లో అరెస్ట్ చేశారు. వకాస్ ముంబైలోని బాంద్రా నుంచి అజ్మీర్‌కు వస్తున్నాడనే సమాచారంతో కాపు కాసి.. అజ్మీర్ రైల్వే స్టేషన్లో శనివారం ఉదయం పట్టుకోగలిగారు. ఇతడు దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్లలో కీలక నిందితుడు. వకాస్ అనుచరులైన మహమ్మద్ మహ్రూఫ్(21), మహమ్మద్ వకార్ అజార్ అలియాస్ హనీఫ్(21)ను జైపూర్‌లో, షకీబ్ అన్సారీ అలియాస్ ఖలీద్(25)ను జోథ్‌పూర్‌లో స్థానిక పోలీసుల సహకారంతో ఆదివారం వేకువ జామున అరెస్ట్ చేశారు. వీరితో సంబంధముందనే అనుమానంతో మరో యువకుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వీరి అరెస్టుతో పెను ప్రమాదం తప్పిపోయింది. వీరి ఇళ్ల నుంచి పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు, డిటోనేటర్లు, ఎలక్ట్రానిక్ సర్క్యూట్లు, టైమర్లను స్వాధీనం చేసుకున్నామని ఢిల్లీ స్పెషల్ పోలీస్ సెల్ ప్రత్యేక కమిషనర్ ఎస్.ఎన్.శ్రీవాత్సవ ఆదివారమిక్కడ మీడియాకు వెల్లడించారు. భారీ ఉగ్రదాడులను నిరోధించగలిగామని ఆయన చెప్పారు. విచారణలో వకాస్ తాను రాజస్థాన్ రావడానికి గల కారణాన్ని బయటపెట్టాడు. తెహ్సీన్ అక్తర్ ఆదేశాల మేరకు భారీ దాడికి సంబంధించిన ‘రాజస్థాన్ మాడ్యూల్’ విషయంలో ముగ్గురు అనుచరుల మధ్య సమన్వయం చేయడంతోపాటు వారు నిర్వహించిన సన్నాహకాలను పరిశీలించడానికి వచ్చినట్లు వకాస్ తెలిపాడు. ఇతడిని పోలీసులు ఆదివారం ఢిల్లీలోని స్పెషల్ కోర్టు ముందు హాజరుపరిచారు. కోర్టు వకాస్‌కు 10 రోజుల పోలీస్ కస్టడీ విధించింది. ఐఈడీ, ఇతర పేలుడు పదార్థాల వినియోగంలో వకాస్ సిద్ధహస్తుడు. ఐఎం సహ వ్యవస్థాపకుడైన యాసిన్ భత్కల్‌కు ముఖ్య అనుచరుడు. 2013 ఫిబ్రవరి 21 హైదరాబాద్‌లోని దిల్షుక్ నగర్ వరుస బాంబు పేలుళ్లలో పాల్గొన్నాడు. ఈ దాడిలో 17 మంది ప్రాణాలు కోల్పోగా, 119 మంది గాయాలపాలైన విషయం తెలిసిందే. వకాస్ అంతకుముందు 2012 ఆగస్టు1న పుణె వరుస పేలుళ్లు, 2011 జూలై 12న ముంబైలోని జవేరీబజార్లో జరిగిన పేలుళ్లు, 2010 సెప్టెంబర్ 19 జామా మసీదు, అదే ఏడాది డిసెంబర్ 7న వారణాసిలోని షీత్లా ఘాట్ వద్ద జరిగిన పేలుళ్లలో ఇతడి హస్తం ఉందని శ్రీవాత్సవ వెల్లడించారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీని లక్ష్యంగా చేసుకున్నారా? అన్న మీడియా ప్రతినిధుల ప్రశ్నకు... ప్రస్తుత దర్యాప్తు స్థాయిలో ఏమీ చెప్పలేమని శ్రీవాత్సవ అన్నారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఎవరైనా రాజకీయ నేత లేదా సభపై దాడికి ఉగ్రవాదులు ప్రణాళిక రచించారా? అని అడగ్గా... ఏ ముఖ్య కార్యక్రమాన్నైనా వారు లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని చెప్పారు. మహ్రూఫ్, వకార్ ఇద్దరూ జైపూర్‌లో ఇంజనీరింగ్ విద్యార్థులు కాగా, అన్సారీ డీటీపీ సెంటర్ నడుపుతున్నట్లు శ్రీవాత్సవ తెలిపారు. వీరు పాక్ ఉగ్రవాద శిబిరాల్లో శిక్షణ తీసుకొన్నారని చెప్పారు. రాజస్థాన్ మాడ్యూల్ గురించి యాసిన్ భత్కల్, హద్ది విచారణ సందర్భంగా లోగడే వెల్లడించినప్పటికీ దీనిలో ఎవరెవరు ఉన్నారన్న వివరాలను వారు వెల్లడించకపోవడంతో దీన్ని పోలీసులు ఇప్పటికీ చేధించలేకపోయారు. కస్టడీలో వకాస్, అతడి అనుచరుల ద్వారా దీనికి సంబంధించి మరిన్ని వివరాలు లభిస్తాయని ఆశిస్తున్నారు. జోథ్‌పూర్ పోలీస్ కమిషనర్ సచిన్ మిట్టల్ మాట్లాడుతూ... ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు స్థానికంగా బర్కతుల్లాఖాన్ కాలనీలో మహమ్మద్ షకీబ్ అన్సారీని అరెస్ట్ చేశామని చెప్పారు. అతడి ఇంటి నుంచి పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నామన్నారు. వాటిలో 6.5కేజీల అమ్మోనియం నైట్రేట్, 42కేజీల గన్ పౌడర్, 17.65 కేజీల రాతి పొడి, 1.6కేజీల ఫాస్పరస్, ఫ్యూజ్‌వైరు, 3టైమర్ స్విచ్చులు, 8 ఎలక్ట్రానిక్ స్విచ్చులు, 15 డయోడ్లు, బ్యాటరీలు, డిటోనేటర్ క్యాప్‌లు, పెన్‌డ్రైవ్‌లు, సెల్ఫోన్లు ఇతర వస్తువులు ఉన్నాయని తెలిపారు. ప్రాథమిక విచారణలో షకీబ్ అన్సారీ ఇద్దరు సహాయకులు బర్కత్, మహమ్మద్ ఆదిల్ పేర్లు వెల్లడించారని.. బర్కత్ పారిపోగా, ఆదిల్ పట్టుబడ్డాడని తెలిపారు. ఇతడు స్థానికంగా ఒక ఇంజనీరింగ్ కాలేజీలో బోధకుడిగా పనిచేస్తున్నట్లు మిట్టల్ చెప్పారు. బర్కత్ సివిల్ కాంట్రాక్టరని తెలిసిందని అతడిని త్వరలో పట్టుకుంటామన్నారు. వారి ప్రణాళిక ఏమిటో ఇంకా వెల్లడి కాలేదన్నారు. ‘దిల్సుఖ్నగర్’ కేసులో కీలక నిందితుడు హైదరాబాద్: తాజాగా పట్టుబడిన వకాస్‌తో దిల్సుఖ్నగర్ వరుస బాంబు పేలుళ్ల కేసులో మరో ఉగ్రవాది పట్టుబడినట్లుయింది. అసదుల్లా అక్తర్, తెహసీన్ అక్తర్‌తో కలసి వకాస్ గతేడాది ఫిబ్రవరి 21న దిల్సుఖ్నగర్పేలుళ్లలో పాల్గొన్నారు. ఈ కేసులో ఎన్ఐఏ అధికారులు రియాజ్ భత్కల్ను ప్రధాన నిందితుడిగా (ఏ-1)గా, యాసీన్‌ను ఐదో నిందితుడుగా, అసదుల్లా, వఖాస్, తెహసీన్లను ఏ-2, ఏ-3, ఏ-4గా పేర్కొన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఢిల్లీ పోలీసు కస్టడీలో ఉన్న వకాస్‌ను పీటీ వారంట్‌పై హైదరాబాద్ తీసుకొచ్చేందుకు ఎన్ఐఏ సన్నాహాలు చేస్తోంది.