తాహిర్ ఆలీ ఖాన్, హరిస్ ముస్తక్ ఖాన్, ఆసిఫ్ సుహిల్
శ్రీనగర్: ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర సంస్థతో సంబంధాలు కలిగిన ముగ్గురు వ్యక్తులను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తుల నుంచి పేలుడు పదార్థాలతో పాటు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. వీరిని జమ్ము కశ్మీర్‌కు చెందిన తాహిర్ ఆలీ ఖాన్, హరిస్ ముస్తక్ ఖాన్, ఆసిఫ్ సుహిల్‌గా గుర్తించారు. ఐఎస్ భావజాలానికి ఆకర్షితులైన వీరు.. ఆ సంస్థ కోసం పనిచేస్తున్నట్టుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఐఎస్ ఉగ్రసంస్థకు ఆయుధాలు సమకూర్చడానికి, ఆర్థికంగా చేయూత అందించడానికి ఈ ముగ్గురు వ్యక్తులు సహాకరిస్తున్నట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఢిల్లీలో ఉగ్ర కార్యకలాపాలు పెంపొందించేందుకు కూడా వీరు ప్రణాళికలు రచించారు. ఉగ్రవాదులను విచారిస్తున్న పోలీసులు.. వారి వద్ద నుంచి కీలక సమాచారం సేకరించినట్టుగా సమాచారం.
దీనిపై ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ డీసీసీ మాట్లాడుతూ.. ‘సెప్టెంబర్ 6వ తేదీన ఐఎస్ ఉగ్రసంస్థ కోసం పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారు ఆయుధాలు కలిగి ఉండటంతో.. లోతైన దర్యాప్తు చేపట్టాం. వారిద్దరిని విచారించగా ఢిల్లీలో ఐఎస్ కార్యకలాపాలు సాగుతున్నాయనే విషయం అర్థమైందన్నారు. ఆ వ్యక్తుల నుంచి సేకరించిన సమాచారంతో శ్రీనగర్ చేరుకుని అక్కడి పోలీసులతో కలిసి జాయింట్ ఆపరేషన్ చేపట్టాం. ఉగ్రవాదుల నుంచి మూడు గ్రెనేడ్‌లు, రెండు లోడెడ్ పిస్టల్స్ స్వాధీనం చేసుకున్నాం. జమ్ము కశ్మీర్‌లో ఉగ్ర నిర్మూలనకు తమ బృందం పనిచేస్తుందన్నారు. వీరు కోతి బాగ్‌లో జరుగుతున్న పోలీస్ పార్టీపై గ్రెనేడ్ దాడి చేసేందుకు ప్రయత్నించినట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment