Islamic State (IS)
-
ఆరుగురు అలీగఢ్ వర్సిటీ విద్యార్థుల అరెస్ట్
లక్నో: ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐసిస్) తరఫున పనిచేస్తున్నారనే ఆరోపణలపై యూపీ పోలీసులు అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి చెందిన ఆరుగురు విద్యార్థులను అరెస్ట్ చేశారు. నిందితులందరికీ అలీగఢ్ యూనివర్సిటీ విద్యార్థుల సంఘమైన స్టూడెంట్స్ ఆఫ్ అలీగఢ్ యూనివర్సిటీ(సము)తో సంబంధాలున్నట్లు పోలీసులు తెలిపారు. వీరు తరచుగా సమావేశాలు నిర్వహిస్తూ, ఐసిస్‌లోకి కొత్త వారిని చేర్చుకుంటున్నారని ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రర్ స్క్వాడ్(ఏటీఎస్) విభాగం తెలిపింది. దేశంలో భారీ ఉగ్రదాడికి వీరు కుట్ర పన్నుతున్నారని వెల్లడించింది. అరెస్టయిన వారిలో రకీమ్ ఇనామ్, నవీద్ సిద్దిఖి, మహ్మద్ నొమాన్, మహ్మద్ నజీమ్ అనే నలుగురిని గుర్తించింది. వీరందరినీ రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో అరెస్ట్ చేసినట్లు వివరించింది. ఇప్పటికే ఈ విద్యార్థి సంఘం కార్యకలాపాలపై కేంద్ర నిఘా వర్గాలు ఓ కన్నేసి ఉంచాయని కూడా పేర్కొంది. -
‘ఇస్లామిక్ స్టేట్’కు కొత్త చీఫ్
న్యూఢిల్లీ: ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) తమ అధినేత అబు హుస్సేన్ అల్ హుస్సెయినీ అల్ ఖురేషి మృతి చెందినట్లు ధ్రువీకరించింది. ఈ మేరకు టెలిగ్రామ్ చానల్ ద్వారా ఆ సంస్థ ప్రకటించింది. ఆ ప్రకటన ఏ తేదీన విడుదలైందీ తెలియరాలేదు. అతడు ఎప్పుడు, ఎలా మృతి చెందాడనే విషయం కూడా అందులో పేర్కొనలేదు. ఐఎస్ కొత్త అధిపతిగా అబు హఫ్స్ అల్ హషిమి అల్ ఖురేషి పగ్గాలు చేపట్టనున్నారని సంస్థ ప్రతినిధి తెలిపారు. -
కర్ణాటకలో ఇద్దరు ఐఎస్ ఉగ్రవాదులు అరెస్ట్
శివమొగ్గ: నిషేధిత ఉగ్ర సంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) కదలికలపై కర్ణాటక పోలీసులు నిఘా వేశారు. ఇస్లామిక్ స్టేట్‌తో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో మంగళవారం ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. మరో టెర్రరిస్ట్ పరారీలో ఉన్నట్లు చెప్పారు. నిందితుల వద్ద పేలుడు పదార్థాలు లభించినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో పేలుళ్లకు కుట్ర పన్నారని ఆరోపించారు. ఇద్దరు నిందితులను కోర్టులో హాజరుపరచగా.. వారిని కోర్టు ఏడు రోజుల కస్టడీకి అనుమతించినట్లు తెలిపారు. -
కాబూల్ ఆత్మాహుతి బాంబర్ భారత్ అప్పగించిన వ్యక్తి
కాబూల్: అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్ విమానాశ్రయంపై ఆత్మాహుతి దాడి చేసిన బాంబర్ అయిదేళ్ల క్రితం భారత్ అప్పగించినవాడేనని ఇస్లామిక్ స్టేట్‌తో లింకులున్న ఒక మ్యాగజైన్ వెల్లడించింది. ఆ ఆత్మాహుతి బాంబర్‌ని అబ్దుర్ రెహ్మాన్ అల్ లోగ్రిగా గుర్తించింది. గత నెల 26న కాబూల్ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకొని జరిగిన ఆత్మాహుతి దాడిలో 13 మంది అమెరికా సైనికులు సహా 180 మంది వరకు మరణించిన విషయం తెలిసిందే. ఈ దాడికి పాల్పడిన వ్యక్తిని భారత ప్రభుత్వం అయిదేళ్ల క్రితం అఫ్గానిస్తాన్‌కు అప్పగించిందని ఇస్లామిక్ స్టేట్ భావజాలాన్ని వ్యాప్తి చేసే స్వాత్–అల్–హింద్ మ్యాగజైన్ ఒక కథనాన్ని ప్రచురించింది. ఆ కథనం ప్రకారం కశ్మీర్‌పై భారత్ వైఖరికి ప్రతీకారంగా హిందువులపై ఆత్మాహుతి దాడుల్ని జరపడానికి అయిదేళ్ల క్రితం ఢిల్లీకి వెళ్లిన అల్–లోగ్రిని ఢిల్లీలో పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. ఆ తర్వాత అమెరికా సంప్రదింపులు జరపగా భారత ప్రభుత్వం లోగ్రిని అఫ్గాన్‌కు అప్పగించింది. ఇప్పుడు కాబూల్ ఆత్మాహుతి దాడి అతనే జరిపాడంటూ ఆ మ్యాగజైన్ అల్–లోగ్రిని కీర్తించింది. ‘‘మన సహోదరుడు భారత్ జైల్లో మగ్గిపోయాడు. ఆ తర్వాత అఫ్గాన్‌కు అప్పగించారు. అయినా అతను తన ఇంటికి వెళ్లలేదు. తన ఆపరేషన్ని కాబూల్‌లో నిర్వహించాడు. అఫ్గాన్ అధికారులు, వారి కుటుంబసభ్యులు శత్రువులతో చేతులు కలిపి దేశం విడిచి పారిపోతున్నందుకే లోగ్రి ఈ దాడి చేశాడు’’అని స్వాత్–అల్–హింద్ పేర్కొంది. ఢిల్లీలోని లజ్‌పత్ నగర్లో నివాసం ఉంటున్న ఒక అఫ్గాన్ జాతీయుడిని 2017లో నిఘా వర్గాలు పట్టుకున్నాయి. ఇస్లామిక్ స్టేట్‌తో అతనికి సంబంధాలు ఉన్నాయని వెల్లడి కావడంతో అఫ్గాన్‌కు అప్పగించాయి. -
ఐఎస్‌తో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్
బెంగళూరు: జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ఇస్లామిక్ స్టేట్ మాడ్యూల్‌ని ఒకదాన్ని చేధించి.. దానితో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులను గురువారం అరెస్ట్ చేసింది. నిందితులను బెంగళూరుకు చెందిన అహ్మద్ అబ్దుల్(40), ఇర్ఫాన్ నజీర్(33)గా గుర్తించింది. అంతేకాక 2013-14 మధ్య కాలంలో 13-14 మంది వ్యక్తులు బెంగళూరు నుంచి సిరియా వెళ్లినట్లు ఏజెన్సీ గుర్తించింది. వీరిలో ఇద్దరు సిరియాలో హత్యకు గురి కాగా.. కొందరు 2014 లో నిశ్శబ్దంగా తిరిగి వచ్చారని.. చాలామంది ఇప్పటికీ పరారీలో ఉన్నారని ఎన్ఐఏ అధికారులు తెలిపారు. 2014 లో ఇరాక్, సిరియాలను ఐఎస్ అధిగమించింది. ఇరాక్ 2017 లో ఈ టెర్రర్ గ్రూపుపై విజయం సాధించినట్లు ప్రకటించింది. 2019 మార్చిలో సిరియాలో అమెరికా మద్దతు ఉన్న దళాలు ఈ బృందాన్ని ఓడించాయని, ఈ గ్రూపు ప్రాదేశిక నియంత్రణకు ముగింపు పలికాయని వెల్లడించింది. ఇక నేడు చేధించిన మాడ్యూల్‌లోని సభ్యులందరినీ ఎన్ఐఏ గుర్తించింది. వీరు సన్నిహితంగా ఉన్నవారి గురించి అలానే వీరి కార్యకలాపాల గురించి తెలుసుకోవడానికి ఎన్ఐఏ దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపింది. ఒక బ్యాంకు వ్యాపార విశ్లేషకుడు కాడర్, కుటుంబ వ్యాపారాన్ని నడుపుతున్న నాసిర్, మాడ్యూల్లో చాలా మంది సభ్యులను సమూలంగా మార్చారని కనీసం ఐదుగురు సభ్యుల ప్రయాణానికి ఆర్థిక సాయం చేశారని ఎన్ఐఏ తెలిపింది. జహన్‌జైబ్ సామి, హినా బషీర్ బేగ్ కేసుకు సంబంధించి ఆగస్టులో బెంగళూరు నుంచి అరెస్టయిన నేత్ర వైద్య నిపుణుడు అబ్దుల్ రెహ్మాన్‌ను ప్రశ్నించగా బెంగళూరు మాడ్యూల్ గురించి ఎన్ఐఏ ఏజెన్సీ అధికారులకు తెలిసింది. దాంతో వారు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ క్రమంలో కాడర్, నాసిర్‌లను గుర్తించారు. వీరు హిజ్బ్ ఉత్ తహ్రీర్(హుట్)లో సభ్యులు. వీరు ఖురాన్ సర్కిల్ అనే మాడ్యూల్‌ని ఏర్పాటు చేసి బెంగళూరులోని వ్యక్తులను ప్రలోభాలకు గురి చేశారు. అంతేకాక వీరు నిధులు సేకరించి సిరయా పర్యటనలకు, ఐఎస్‌కు సహాయం చేడానికి, దాని భావజాల వ్యాప్తికి ఈ నిధులను వినియోగించారు. కాడర్ హుట్ నుంచి నిధులు సేకరించి తన బ్యాంక్ ఖాతా ద్వారా సిరియాకు పంపించాడని అధికారులు తెలిపారు. నేత్ర వైద్య నిపుణుడు ఐఎస్‌లో చేరడానికి బెంగళూరు నుంచి సిరియాకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. కాడర్, నాజిర్ నిధులు సమకూర్చారు. (చదవండి: ‘వాయిస్ ఆఫ్ హింద్’ బాసిత్ సృష్టే!’) కేరళలోని కాసరగోడ్, పాలక్కాడ్ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున దాదాపు 22 మంది సభ్యుల మాడ్యూల్ 2016 లో ఇరాక్, సిరియాకు ప్రయాణించింది. భారతదేశం నుంచి ఈ ప్రాంతానికి ప్రయాణించిన అతిపెద్ద సమూహం ఇదే అని ఎన్ఐఏ తెలిపింది.ఇరాక్, సిరియా,ఆఫ్ఘనిస్తాన్లలో ఐఎస్ ఆధీనంలో ఉన్న భూభాగాలకు 2014 నుంచి అనేక మంది కార్యకర్తలు ప్రయాణించారని, అయితే వారంతా చిన్న సమూహాలలో లేదా వ్యక్తిగతంగా వెళ్లారని అధికారులు తెలిపారు. కాసరగోడ్ మాడ్యూల్ అతిపెద్ద మాడ్యూల్ దాని తర్వాత ఇప్పుడు 13-14 మంది కలిసి వెళ్లిన ఈ తాజా బెంగళూరు మాడ్యూల్ పెద్దదిగా ఉంది" అని ఒక అధికారి తెలిపారు. -
ఎప్పుడో చంపేయాల్సింది
వాషింగ్టన్/బాగ్దాద్/టెహ్రాన్: ఇరాన్లో అత్యంత శక్తిమంతమైన నాయకుడు, ఆ దేశ రివల్యూషనరీ గార్డ్ కమాండర్ జనరల్ ఖాసీం సులేమాని అమెరికా జరిపిన దాడుల్లో మృతి చెందారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు బాగ్దాద్ విమానాశ్రయం సమీపంలో శుక్రవారం తెల్లవారు జామున సులేమాని ప్రయాణిస్తున్న కాన్వాయ్‌పై గగనతలం నుంచి డ్రోన్ల సాయంతో క్షిపణి దాడులు జరిగాయి. ఈ దాడుల్లో సులేమానితోపాటు ఇరాక్‌కు చెందిన హషద్ అల్ షాబి పారామిలటరీ బలగాల డిప్యూటీ చీఫ్, ఇరాన్‌కు మద్దతుగా వ్యవహరించే కొందరు స్థానిక మిలిమెంట్లు మరణించినట్టు బాగ్దాద్ మీడియా వెల్లడించింది. లెబనాన్ లేదంటే సిరియా నుంచి బాగ్దాద్‌కు వచ్చినట్టుగా భావిస్తున్న సులేమాని విమానాశ్రయం నుంచి బయటకు వచ్చి రెండు కార్లలో తన సన్నిహితులతో కలిసి ప్రయాణిస్తుండగా ఈ దాడి జరిగింది. ఇరాక్‌లో అమెరికా సిబ్బంది రక్షణ కోసమే తాము వైమానిక దాడులకు దిగామని పెంటగాన్ ప్రకటించింది. ఈ దాడుల్లో సులేమాని మరణించారని ధ్రువీకరించింది. ఎప్పుడో చంపేయాల్సింది: ట్రంప్ విదేశాల్లో నిఘా కార్యకలాపాలు నిర్వహించే ఇరాన్ అల్ ఖుద్స్ చీఫ్ జనరల్ సులేమానిని కొన్నేళ్ల క్రితమే చంపేయాల్సి ఉండేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాక్‌తో పాటు మధ్యప్రాచ్యంలోని ఇతర దేశాల్లో అమెరికా దౌత్య కార్యాలయాలపై దాడులకి, వేలాది మంది అమెరికన్ సిబ్బంది మృతికి సులేమాని కారకుడని ధ్వజమెత్తారు. ఈ మధ్యకాలంలో ఇరాక్‌లో అమెరికా దౌత్యకార్యాలయం దగ్గర జరిగిన దాడుల వెనుక సులేమాని హస్తం ఉందని అన్నారు. అమెరికా రాయబారులు ఇతర అధికారులు, సైనికులపై మరిన్ని దాడులకు సులేమాని వ్యూహాలు పన్నుతున్నారని ఆరోపించారు. సులేమాని మృతి వార్త తెలిసిన వెంటనే అధ్యక్షుడు ట్రంప్ అమెరికా జాతీయ జెండా ఇమేజ్‌ని తన ట్విట్టర్ ఖాతాలో ఉంచారు. కొద్ది గంటల తర్వాత మరో ట్వీట్లో ‘‘ఇరాన్ ఎప్పుడూ యుద్ధం గెలవలేదు. అలాగే సంప్రదింపుల్ని ఎప్పుడూ వదులుకోలేదు’’అని పేర్కొన్నారు. 2018లో అమెరికా ఇరాన్‌తో అణు ఒప్పందాన్ని రద్దు చేసుకున్నప్పట్నుంచి ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ దాడితో మధ్యప్రాచ్యంలో మరింత ఉద్రిక్తతలు చెలరేగాయి. అమెరికాలో ట్రంప్‌పై అవిశ్వాసం ప్రబలుతోన్న సందర్భంలో ప్రజల దృష్టిని మళ్ళించేందుకు ఈ దాడులకి దిగారన్న విమర్శలు ఉన్నాయి. ఇరాక్ నుంచి వెనక్కి రండి ఇరాక్‌లో ఉన్న అమెరికా పౌరులు వెంటనే వెనక్కి తిరిగి రావాలని అమెరికా విదేశాంగ శాఖ పిలుపునిచ్చింది. ఇరాన్ మద్దతున్న మిలిటెంట్లు అమెరికా దౌత్యకార్యాలయం దగ్గర జరిపిన దాడులతో ఎంబసీలో కార్యకలాపాలు నిలిపివేశామని, పౌరులెవరూ అక్కడికి వెళ్లవద్దని ట్వీట్ చేసింది. ఈ పరిణామాలతో మధ్య ప్రాచ్యానికి అమెరికా మరో 3,500 మంది బలగాలను తరలించింది. ఇరాకీల సంబరాలు బాగ్దాద్‌లో జరిగిన దాడుల్లో జనరల్ సులేమాని మృతి చెందడంతో ఇరాక్‌లో ప్రభుత్వ వ్యతిరేకులు సంబరాలు చేసుకున్నారు. మరో యుద్ధం భరించలేం: ఐరాస గల్ఫ్‌లో మరో యుద్ధాన్ని ప్రపంచం భరించలేదని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటొనియొ గ్యుటెరస్ వ్యాఖ్యానించారు. సులేమాని మృతి చెందడంతో అమెరికా, ఇరాన్‌ల మధ్య తలెత్తిన ఉద్రిక్తతల నేపథ్యంలో గ్యుటెరస్ పై విధంగా స్పందించారు. ఎవరీ ఖాసీం సులేమాని? 1955లో ఇరాన్లో ఒక నిరుపేద రైతు కుటుంబంలో సులేమాని జన్మించారు. మొదట్లో భవన నిర్మాణ కార్మికుడిగా పని చేశారు. 1979లోఇరాన్ విప్లవం సమయంలో రివ్యల్యూషనరీ గార్డ్‌లో చేరారు. 1980లో ఇరాన్, ఇరాక్ యుద్ధంలో పాల్గొని ధైర్యసాహసాలు కలిగిన కమాండర్‌గా పేరు తెచ్చుకున్నారు. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్‌లో కీలకమైన నిఘా విభాగం అయిన ఖుద్స్ ఫోర్స్‌కి 1998 సంవత్సరం నుంచి సులేమాని మేజర్ జనరల్‌గా ఉన్నారు. మధ్యప్రాచ్యంలో ఇరాన్ ప్రాబల్యాన్ని పెంచడానికి, దానిని బలమైన దేశంగా నిలపడానికి చాలా ఏళ్లుగా శ్రమిస్తున్నారు. సులేమాని విదేశాల్లో కోవర్ట్ ఆపరేషన్లు నిర్వహించడంలో దిట్ట. సమయానుకూలంగా మిత్రపక్షాల్ని మార్చేయడంలోనూ, చుట్టుపక్కల ముస్లిం దేశాల్లో షియా అనుకూల ప్రభుత్వ ఏర్పాట్లలోనూ కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇరాక్‌లో ఇస్లామిక్ స్టేట్‌పై పోరాటంలోనూ సులేమాని ప్రధాన పాత్ర పోషించారు. ఇరాన్ సరిహద్దులు దాటి జరిగే దాడులన్నింటి వెనుక వ్యూహ ప్రతివ్యూహాలు ఆయనే రచిస్తారు. ఇరాన్ సుప్రీం నాయకుడు అయోతల్లా ఖామినేయీ తర్వాత దేశంలో అంతటి శక్తిమంతుడిగా అల్–ఖుద్స్ బలగాల చీఫ్ అయిన జనరల్ సులేమానికి పేరుంది. ఇరాన్ ప్రజలు ఆయనని ఆరాధ్య దైవంగా కొలుస్తారు. 2017లో టైమ్ మ్యాగజైన్ ఆయనని అత్యంత ప్రభావశీలుర జాబితాలో చేర్చింది.జేమ్స్ బాండ్, ఎర్విన్ రోమెల్, లేడీ గాగా ఒక రూపంలోకి వస్తే అదే సులేమాని అంటూ కీర్తించింది. అయితే ఎన్నో దేశాల్లో మిలటరీ దాడుల వ్యూహకర్త అయిన సులేమానిని అమెరికా ఉగ్రవాదిగా ప్రకటించింది. ప్రతీకారం తీర్చుకుంటాం: ఇరాన్ సులేమాని చంపేసినందుకు అమెరికాపై తాము ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ సుప్రీం లీడర్ అయోతొల్లా అలీ ఖమేనియా హెచ్చరించారు. ఇస్మాయిల్ ఖానీని సులేమాని స్థానంలో ఖుద్స్ బలగాల చీఫ్‌గా నియమిస్తున్నట్టు ప్రకటించారు. ఇరాన్ గుండెకు గాయం చేసిన వారిని విడిచిపెట్టమని తమకు సహకరించే దేశాలతో కలిసి బదులు తీర్చుకుంటామని అధ్యక్షుడు హసన్ రౌహని హెచ్చరించారు. -
‘మీ సోదరుడు అల్లా కోసం అమరుడయ్యాడు’
తిరువనంతపురం: రెండేళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లి ఇస్లామిక్ స్టేట్‌లో చేరిన ఓ ముస్లిం యువకుడు మరణించినట్లు వారి కుటుంబానికి ఓ సందేశం వచ్చింది. ఎదిగివచ్చిన కొడుకు కంటికి కానరానంత దూరం వెళ్లడంతో ఆ తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగి పోయారు. వివరాలు.. మలప్పురం జిల్లా ఇడప్పల్‌కు చెందిన మహ్మద్ ముహాసిన్ 2017, అక్టోబర్‌లో ఇంటి నుంచి వెళ్లి పోయాడు. దాంతో అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంజనీరింగ్ చదువుతున్న ముహాసిన్.. అఫ్గానిస్తాన్ వెళ్లి.. ఇస్లామిక్ స్టేట్‌లో చేరినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం ముహాసిన్ కుటుంబ సభ్యులకు వాట్సాప్‌లో ఓ సందేశం వచ్చింది. మలయాళంలో ఉన్న సందేశంలో ‘అల్లా సేవలో తరించాలనే మీ సోదరుని కోరిక నెరవేరింది. పది రోజుల క్రితం మీ సోదరుడు అమరుడయ్యాడు. ఈ విషయాన్ని పోలీసులకు చెబితే.. మీకే ప్రమాదం’ అని హెచ్చరిస్తూ ఓ సందేశం వచ్చింది. దాంతో పాటు ముహాసిన్ మృతదేహం ఫోటో కూడా వచ్చింది. ఈ విషయం గురించి పోలీసులు మాట్లాడుతూ.. ‘కుటుంబ సభ్యులు వాట్సాప్‌లో వచ్చిన ఫోటోను ముహాసిన్‌దిగానే భావిస్తున్నారు. ఇంతకు మించి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. వాట్సాప్ సందేశం మలయాళంలో వచ్చింది. దీన్ని బట్టి.. ముహాసిన్‌తో పాటు కేరళకు చెందిన మరో వ్యక్తి కూడా అక్కడ ఉన్నట్లు భావిస్తున్నాం. అయితే సందేశం పంపిన వ్యక్తి ఎవరనేది తెలియాల్సి ఉంది’ అని పేర్కొన్నారు. -
భారత్‌లో దాడులకు జైషే, ఐఎస్‌ల భారీ కుట్ర
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో జైషే మహ్మద్, ఐఎస్ ఉగ్రవాద సంస్థలు మూకుమ్మడిగా తాజా దాడులతో విరుచుకుపడవచ్చని నిఘా సంస్థలు హెచ్చరించాయి. ఈ రెండు ఉగ్రసంస్ధలతో పాక్‌కు చెందిన ఐఎస్ఐ టచ్‌లో ఉందని నిఘా సంస్థలు హోంమంత్రిత్వ శాఖకు పంపిన నివేదికలో స్పష్టం చేశాయి. ఆప్ఘనిస్తాన్‌లో జైషే, ఐఎస్ సభ్యుల మధ్య ఐఎస్ఐ రహస్య సమావేశాన్ని ఏర్పాటు చేసిందని, భారత్‌లో మరిన్ని పుల్వామా తరహా దాడులను ఐఎస్ఐ ప్రోత్సహిస్తోందని ఈ నివేదికలో నిఘా సంస్ధలు పేర్కొన్నాయి. కాగా జైషే మహ్మద్, తాలిబాన్ టెర్రరిస్టులు దీర్ఘకాలంగా ఆప్ఘనిస్తాన్‌లో నాటో సైనిక దళాలతో తలపడుతున్నారని, తాము ఈ పరిణామాలను చాలాకాలంగా గమనిస్తున్నామని హోం మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు. ఐఎస్, జైషే మహ్మద్ ఉగ్రవాదులను కలపడం ద్వారా భారత్‌లో భారీ కుట్రకు ఐఎస్ఐ ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు కనిపిస్తోందని అన్నారు. మరోవైపు బాలాకోట్ వైమానిక దాడులతో భంగపడ్డ జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ మరోసారి చురుకుగా మారినట్టు నిఘా వర్గాలు హెచ్చరించాయి. భారత్‌లో మెరుపు దాడులు చేపట్టేందుకు సుశిక్షితులైన ఉగ్రవాదులనే ఎంచుకోవాలని అజర్ జైషే టాప్ కమాండర్లకు సూచించినట్టు నిఘా వర్గాలు వెల్లడించాయి. జైషే టాప్ కమాండర్లతో భేటీ సందర్భంగా భారత్‌లో మరిన్ని పుల్వామా తరహా దాడులు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని కోరినట్టు తెలిపాయి. -
ముగ్గురు ఐఎస్ ఉగ్రవాదుల అరెస్ట్
శ్రీనగర్: ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర సంస్థతో సంబంధాలు కలిగిన ముగ్గురు వ్యక్తులను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తుల నుంచి పేలుడు పదార్థాలతో పాటు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. వీరిని జమ్ము కశ్మీర్‌కు చెందిన తాహిర్ ఆలీ ఖాన్, హరిస్ ముస్తక్ ఖాన్, ఆసిఫ్ సుహిల్గా గుర్తించారు. ఐఎస్ భావజాలానికి ఆకర్షితులైన వీరు.. ఆ సంస్థ కోసం పనిచేస్తున్నట్టుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఐఎస్ ఉగ్రసంస్థకు ఆయుధాలు సమకూర్చడానికి, ఆర్థికంగా చేయూత అందించడానికి ఈ ముగ్గురు వ్యక్తులు సహాకరిస్తున్నట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఢిల్లీలో ఉగ్ర కార్యకలాపాలు పెంపొందించేందుకు కూడా వీరు ప్రణాళికలు రచించారు. ఉగ్రవాదులను విచారిస్తున్న పోలీసులు.. వారి వద్ద నుంచి కీలక సమాచారం సేకరించినట్టుగా సమాచారం. దీనిపై ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ డీసీసీ మాట్లాడుతూ.. ‘సెప్టెంబర్ 6వ తేదీన ఐఎస్ ఉగ్రసంస్థ కోసం పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారు ఆయుధాలు కలిగి ఉండటంతో.. లోతైన దర్యాప్తు చేపట్టాం. వారిద్దరిని విచారించగా ఢిల్లీలో ఐఎస్ కార్యకలాపాలు సాగుతున్నాయనే విషయం అర్థమైందన్నారు. ఆ వ్యక్తుల నుంచి సేకరించిన సమాచారంతో శ్రీనగర్ చేరుకుని అక్కడి పోలీసులతో కలిసి జాయింట్ ఆపరేషన్ చేపట్టాం. ఉగ్రవాదుల నుంచి మూడు గ్రెనేడ్లు, రెండు లోడెడ్ పిస్టల్స్ స్వాధీనం చేసుకున్నాం. జమ్ము కశ్మీర్లో ఉగ్ర నిర్మూలనకు తమ బృందం పనిచేస్తుందన్నారు. వీరు కోతి బాగ్‌లో జరుగుతున్న పోలీస్ పార్టీపై గ్రెనేడ్ దాడి చేసేందుకు ప్రయత్నించినట్టు తెలిపారు. -
బుల్లి యువరాజు హత్యకు కుట్ర..
లండన్: బ్రిటన్ యువరాజు ప్రిన్స్ విలియమ్స్, కేట్ మిడిల్డన్ ముద్దుల కొడుకు ప్రిన్స్ జార్జ్ హత్యకు జరిగిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థకు చెంది రషీద్ అనే ఉగ్రవాది ఈ హత్యకు కుట్ర చేశాడు. దీంతో రషీదును అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. తాను బుల్లి యువరాజు జార్జ్ హత్యకు కుట్ర చేసినట్టు రషీదు కోర్టులో అంగీకరించాడు. దీంతో అతనికి 25 ఏళ్ల శిక్షను విధించారు. లండన్‌లోని వూల్విచ్ క్రౌన్ కోర్టు న్యాయమూర్తులు ఈ తీర్పును వెలవరించారు. టెలిగ్రామ్ ద్వారా ప్రిన్స్ జార్జ్‌ను చంపేందుకు కుట్ర చేసినట్టు తెలుస్తోంది. తన ప్లాన్ విజయవంతం అయితే ఐఎస్ కార్యాకలాపాల్లో పాల్గొనేందుకు సిరియాకు పారిపోవాలనే ప్లాన్ తనకు ఉందని విచారణ సమయంలో రషీద్ కోర్టుకు తెలిపారు. కాగా, జార్జ్‌ను హత్య చేస్తామంటూ గత అక్టోబర్‌లో ఇస్లామిక్ స్టేట్ గ్రూపు సభ్యులు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో బ్రిటన్‌లో ఒక్కసారిగా కలకలం రేగింది. జార్జ్ ఫొటోతో సహా మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఉగ్రవాదులు, చంపేస్తామని హెచ్చరించారు. అరబిక్ భాషలో రాసిన ఈ పోస్టులో ‘యుద్ధమనేది వస్తే తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటాం’ అని తెలిపారు. యువరాజు వెళ్తున్న స్కూల్ వద్ద భద్రత అంత కట్టుదిట్టంగా లేదని నిఘా వర్గాలు గతంలో పేర్కొన్న విషయం తెలిసిందే. -
కాబూల్‌లో మళ్లీ ఆత్మాహుతి దాడి
కాబూల్: ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఆత్మాహుతి దాడితో అఫ్గానిస్తాన్ మరోసారి ఉలిక్కి పడింది. ఆ దేశ రాజధాని కాబూల్‌లోని ఓ ఓటరు నమోదు కేంద్రం వద్ద జరిగిన ఆత్మాహుతి దాడిలో 57 మంది ప్రాణాలు కోల్పోయారు. 112 మంది తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల్లో అధికశాతం మహిళలు, పిల్లలే ఉన్నారు. ఈ దాడికి పాల్పడింది తామేనని ఐఎస్ స్పష్టం చేసింది. దాడితో ఘటనాస్థలంలో భీతావహ వాతావరణం చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న రెండంతస్తుల భవనంతోపాటు అక్కడ ఉన్న పలు కార్లు ధ్వంసమయ్యాయి ఓటరు నమోదు కార్యాలయం ప్రధాన ద్వారం వద్దే ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడినట్టు కాబూల్ పోలీస్ చీఫ్ దావూద్ అమీన్ తెలిపారు. ఈ దాడిని అంతర్జాతీయ సమాజం తీవ్రంగా ఖండించింది. బాంబు దాడిని నాటో ఖండించింది. ‘ఈ హింస అఫ్గానిస్తాన్‌లో ప్రజాస్వామ్య ప్రక్రియను వ్యతిరేకించే శక్తుల అమానుషత్వాన్ని, పిరికితనాన్ని తేటతెల్లం చేస్తుంది’ అని అమెరికా అంబాసిడర్ జాన్ బాస్ ట్వీటర్లో పేర్కొన్నారు. మరోచోట ఆరుగురు దుర్మరణం కాబూల్‌లోని బగ్లాన్ ప్రావిన్స్‌లో రోడ్డు పక్కన జరిగిన మరో బాంబు దాడిలో ఆరుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. ఇందులో ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ఈ రెండు దాడులను తీవ్రంగా ఖండించారు. వరుస దాడులు అక్టోబరు 20న జరగనున్న పార్లమెంటరీ ఎన్నికలకు సంబంధించి అఫ్గాన్ ప్రభుత్వం ఈ నెల 14 నుంచి దేశవ్యాప్తంగా ఓటరు నమోదు కార్యక్రమం చేపట్టింది. ఈ నేపథ్యంలో ఈ మధ్య కాలంలో కాబూల్‌లో ఇటువంటి దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. పోలింగ్ కేంద్రాలకు రక్షణ కల్పించడం అఫ్గాన్ పోలీసులకు సమస్యగా తయారైంది. -
కంచె నిలబడటంలేదు
బతుకు పోరాటంలో నిలువెత్తు ఇనుప కంచెలు నిలబడటంలేదు. 2011లో సిరియాలో మొదలైన అంతర్యుద్ధం 2015నాటికి తీవ్రరూపం దాల్చింది. ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) తీవ్రవాదులకు ప్రభుత్వ మద్దతుదారులకు మధ్య జరుగుతున్న పోరులో సామాన్య ప్రజలు నలిగిపోతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సరిహద్దు దేశమైన టర్కీకి వలస వెళుతున్నారు. ప్రారంభంలో స్వేచ్ఛగా వలసదారులను దేశంలోకి రానిచ్చిన టర్కీ ఆ తర్వాత సరిహద్దును మూసివేసింది. అయినా ప్రజలు సరిహద్దు కంచెను బద్దలుకొట్టుకుని టర్కీతోపాటు ఇతర దేశాలకు నిత్యం వెళుతూనే ఉన్నారు. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంస్థ నివేదిక ప్రకారం వలస వెళ్లే వారిలో 70 శాతం పిల్లలు, మహిళలే ఉన్నారు. -
ఐఎస్ ఆత్మరక్షణలో పడింది: ఒబామా
వాషింగ్టన్: ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాద సంస్థ ప్రస్తుతం ఇరాక్, సిరియాల్లో ఆత్మరక్షణలో పడిందని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వ్యాఖ్యానించారు. గురువారం సీఐఏ హెడ్ క్వార్టర్స్‌లో భద్రతాధికారులతో సమావేశ మైన అనంతరం ఆయన మాట్లాడుతూ మిత్రదేశాలతో కలిసి ఐఎస్ నెట్‌వర్క్‌ను తుదముట్టిస్తామన్నారు. అరబ్ దేశాలతో సహా 66 దేశాలు సభ్యులుగా ఉన్న సంకీర్ణ కూటమి ఐఎస్ మూలాలు నాశనం చేయడానికి కృషి చేస్తోందన్నారు. ఇటీవల కాలంలో అమాయక ప్రజల్ని, చిన్నపిల్లల్ని లక్ష్యంగా చేసుకొని ఐఎస్ దాడులు జరిపిందని, దీంతో ఆ తీవ్రవాద సంస్థపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందన్నారు. దాడుల ద్వారా ఐఎస్ తనంతట తానే బలహీన పడుతోందని చెప్పారు. ఇరాక్, సిరియాల్లో ఆ తీవ్రవాద సంస్థ నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పటికి గత వేసవి నుంచి ఇంత వరకు ఒక్క దాడిలోనూ విజయవంతం కాలేదన్నారు. కొన్ని నెలలుగా మిత్రదేశాలతో కలిసి అమెరికా జరిపిన దాడుల్లో ఐఎస్ తన కీలక నేతల్ని కోల్పోయిందన్నారు. ఐఎస్ ఆర్థికమూలాల్ని దిగ్బంధించడాన్ని ఇక ముందు కూడా కొనసాగిస్తామన్నారు. చమురు ద్వారా వారికి వచ్చే రాబడిని ఇప్పటికే గణనీయంగా తగ్గించామన్నారు. సిరియా సంక్షోభానికి ముగింపు పలకాలంటే ఐఎస్ అంతం కావడమొక్కటే మార్గమని ఒబామా పేర్కొన్నారు. దీనికోసం దౌత్య మార్గాల ద్వారా అమెరికా తమ ప్రయత్నాలను కొనసాగిస్తుందని చెప్పారు. -
వైమానిక దాడులు.. 71 మంది మృతి
బాగ్దాద్: ఇరాక్ సైన్యం ఉగ్రవాదులపై పంజా విసిరింది. అనూహ్య దాడులు చేసి వారిని మట్టుబెట్టింది. అమెరికాకు చెందిన యుద్ధ విమానాల సాయంతో ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్‌కు చెందిన వాహనాలపై వరుసగా బాంబు దాడులు చేసింది. ఈ క్రమంలో 71 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలామంది గాయాలపాలయ్యారు. వీరిలో ఎక్కువమంది ఉగ్రవాదులు ఉండగా కొందరు సైనికులు, మరికొందరు పౌరులు కూడా ఉన్నారు. అన్బార్, నినేవ్, సలాహుదీన్ ప్రావిన్స్‌ల్లో ఈ పరస్పర దాడులు జరిగాయి. ఉగ్రవాదులు రెండు ఫ్యూయెల్ ట్యాంకులను తీసుకెళ్తుండగా వాటిని సైన్యం ధ్వంసం చేసింది. దీంతోపాటు పలు ఆయుధ స్థావరాలపై బాంబుల వర్షం కురిపించింది. ప్రభుత్వ బలగాలు దాడులు పసిగట్టి తిప్పికొట్టే ప్రయత్నం ఉగ్రవాదులు చేసినప్పటికీ సైన్యం ధీటుగా వారిని ఎదుర్కొంది. ఇరాక్‌లో ఉగ్రవాదులను అణిచివేసేందుకు అమెరికా సహాయం చేస్తోంది. ఇందులో భాగంగా, యుద్ధ విమానాలను పంపిస్తోంది.