ఐఎస్ ఆత్మరక్షణలో పడింది: ఒబామా
వాషింగ్టన్: ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాద సంస్థ ప్రస్తుతం ఇరాక్, సిరియాల్లో ఆత్మరక్షణలో పడిందని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వ్యాఖ్యానించారు. గురువారం సీఐఏ హెడ్ క్వార్టర్స్‌లో భద్రతాధికారులతో సమావేశ మైన అనంతరం ఆయన మాట్లాడుతూ మిత్రదేశాలతో కలిసి ఐఎస్ నెట్‌వర్క్‌ను తుదముట్టిస్తామన్నారు. అరబ్ దేశాలతో సహా 66 దేశాలు సభ్యులుగా ఉన్న సంకీర్ణ కూటమి ఐఎస్ మూలాలు నాశనం చేయడానికి కృషి చేస్తోందన్నారు. ఇటీవల కాలంలో అమాయక ప్రజల్ని, చిన్నపిల్లల్ని లక్ష్యంగా చేసుకొని ఐఎస్ దాడులు జరిపిందని, దీంతో ఆ తీవ్రవాద సంస్థపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందన్నారు.
దాడుల ద్వారా ఐఎస్ తనంతట తానే బలహీన పడుతోందని చెప్పారు. ఇరాక్, సిరియాల్లో ఆ తీవ్రవాద సంస్థ నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పటికి గత వేసవి నుంచి ఇంత వరకు ఒక్క దాడిలోనూ విజయవంతం కాలేదన్నారు. కొన్ని నెలలుగా మిత్రదేశాలతో కలిసి అమెరికా జరిపిన దాడుల్లో ఐఎస్ తన కీలక నేతల్ని కోల్పోయిందన్నారు. ఐఎస్ ఆర్థికమూలాల్ని దిగ్బంధించడాన్ని ఇక ముందు కూడా కొనసాగిస్తామన్నారు. చమురు ద్వారా వారికి వచ్చే రాబడిని ఇప్పటికే గణనీయంగా తగ్గించామన్నారు. సిరియా సంక్షోభానికి ముగింపు పలకాలంటే ఐఎస్ అంతం కావడమొక్కటే మార్గమని ఒబామా పేర్కొన్నారు. దీనికోసం దౌత్య మార్గాల ద్వారా అమెరికా తమ ప్రయత్నాలను కొనసాగిస్తుందని చెప్పారు.