ఉగ్ర దాడిలో రక్తసిక్తమైన ఓటరు నమోదు కేంద్రం
కాబూల్: ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఆత్మాహుతి దాడితో అఫ్గానిస్తాన్ మరోసారి ఉలిక్కి పడింది. ఆ దేశ రాజధాని కాబూల్‌లోని ఓ ఓటరు నమోదు కేంద్రం వద్ద జరిగిన ఆత్మాహుతి దాడిలో 57 మంది ప్రాణాలు కోల్పోయారు. 112 మంది తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల్లో అధికశాతం మహిళలు, పిల్లలే ఉన్నారు. ఈ దాడికి పాల్పడింది తామేనని ఐఎస్ స్పష్టం చేసింది. దాడితో ఘటనాస్థలంలో భీతావహ వాతావరణం చోటుచేసుకుంది.
స్థానికంగా ఉన్న రెండంతస్తుల భవనంతోపాటు అక్కడ ఉన్న పలు కార్లు ధ్వంసమయ్యాయి ఓటరు నమోదు కార్యాలయం ప్రధాన ద్వారం వద్దే ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడినట్టు కాబూల్ పోలీస్ చీఫ్ దావూద్ అమీన్ తెలిపారు. ఈ దాడిని అంతర్జాతీయ సమాజం తీవ్రంగా ఖండించింది. బాంబు దాడిని నాటో ఖండించింది. ‘ఈ హింస అఫ్గానిస్తాన్‌లో ప్రజాస్వామ్య ప్రక్రియను వ్యతిరేకించే శక్తుల అమానుషత్వాన్ని, పిరికితనాన్ని తేటతెల్లం చేస్తుంది’ అని అమెరికా అంబాసిడర్ జాన్ బాస్ ట్వీటర్‌లో పేర్కొన్నారు.
మరోచోట ఆరుగురు దుర్మరణం
కాబూల్‌లోని బగ్లాన్ ప్రావిన్స్‌లో రోడ్డు పక్కన జరిగిన మరో బాంబు దాడిలో ఆరుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. ఇందులో ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ఈ రెండు దాడులను తీవ్రంగా ఖండించారు.
వరుస దాడులు
అక్టోబరు 20న జరగనున్న పార్లమెంటరీ ఎన్నికలకు సంబంధించి అఫ్గాన్ ప్రభుత్వం ఈ నెల 14 నుంచి దేశవ్యాప్తంగా ఓటరు నమోదు కార్యక్రమం చేపట్టింది. ఈ నేపథ్యంలో ఈ మధ్య కాలంలో కాబూల్‌లో ఇటువంటి దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. పోలింగ్ కేంద్రాలకు రక్షణ కల్పించడం అఫ్గాన్ పోలీసులకు సమస్యగా తయారైంది.
Comments
Please login to add a commentAdd a comment