కాబూల్: అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్ విమానాశ్రయంపై ఆత్మాహుతి దాడి చేసిన బాంబర్ అయిదేళ్ల క్రితం భారత్ అప్పగించినవాడేనని ఇస్లామిక్ స్టేట్‌తో లింకులున్న ఒక మ్యాగజైన్ వెల్లడించింది. ఆ ఆత్మాహుతి బాంబర్‌ని అబ్దుర్ రెహ్మాన్ అల్ లోగ్రిగా గుర్తించింది. గత నెల 26న కాబూల్ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకొని జరిగిన ఆత్మాహుతి దాడిలో 13 మంది అమెరికా సైనికులు సహా 180 మంది వరకు మరణించిన విషయం తెలిసిందే. ఈ దాడికి పాల్పడిన వ్యక్తిని భారత ప్రభుత్వం అయిదేళ్ల క్రితం అఫ్గానిస్తాన్‌కు అప్పగించిందని ఇస్లామిక్ స్టేట్ భావజాలాన్ని వ్యాప్తి చేసే స్వాత్–అల్–హింద్ మ్యాగజైన్ ఒక కథనాన్ని ప్రచురించింది.
ఆ కథనం ప్రకారం కశ్మీర్‌పై భారత్ వైఖరికి ప్రతీకారంగా హిందువులపై ఆత్మాహుతి దాడుల్ని జరపడానికి అయిదేళ్ల క్రితం ఢిల్లీకి వెళ్లిన అల్–లోగ్రిని ఢిల్లీలో పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. ఆ తర్వాత అమెరికా సంప్రదింపులు జరపగా భారత ప్రభుత్వం లోగ్రిని అఫ్గాన్‌కు అప్పగించింది. ఇప్పుడు కాబూల్ ఆత్మాహుతి దాడి అతనే జరిపాడంటూ ఆ మ్యాగజైన్ అల్–లోగ్రిని కీర్తించింది. ‘‘మన సహోదరుడు భారత్ జైల్లో మగ్గిపోయాడు.
ఆ తర్వాత అఫ్గాన్‌కు అప్పగించారు. అయినా అతను తన ఇంటికి వెళ్లలేదు. తన ఆపరేషన్‌ని కాబూల్‌లో నిర్వహించాడు. అఫ్గాన్ అధికారులు, వారి కుటుంబసభ్యులు శత్రువులతో చేతులు కలిపి దేశం విడిచి పారిపోతున్నందుకే లోగ్రి ఈ దాడి చేశాడు’’అని స్వాత్–అల్–హింద్ పేర్కొంది. ఢిల్లీలోని లజ్‌పత్ నగర్‌లో నివాసం ఉంటున్న ఒక అఫ్గాన్ జాతీయుడిని 2017లో నిఘా వర్గాలు పట్టుకున్నాయి. ఇస్లామిక్ స్టేట్‌తో అతనికి సంబంధాలు ఉన్నాయని వెల్లడి కావడంతో అఫ్గాన్‌కు అప్పగించాయి.
కాబూల్ ఆత్మాహుతి బాంబర్ భారత్ అప్పగించిన వ్యక్తి
Published Mon, Sep 20 2021 2:44 AM | Last Updated on Mon, Sep 20 2021 2:44 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment