How Afghanistan Situation Impacting Trade With India | Read More - Sakshi
Sakshi News home page

Afghanistan Trade: తాలిబన్ల ఎఫెక్ట్‌.. భారత్‌కు ఇక భారీ దెబ్బే!

Published Thu, Aug 19 2021 10:07 AM | Last Updated on Thu, Aug 19 2021 2:33 PM

Afghanistan Crisis Severely Effected On Indian Trade - Sakshi

తాలిబన్ల దురాక్రమణతో అఫ్గనిస్తాన్‌లో నెలకొన్న సంక్షోభం.. అంతర్జాతీయంగా అన్ని రంగాల్లో అన్ని విధాల ప్రతికూల ప్రభావాన్ని చూపెడుతోంది. ముఖ్యంగా భారత్‌తో వర్తక వ్యాపారాలపై తీవ్ర ప్రభావం చూపెట్టే అవకాశం ఉందని ఇదివరకే వర్తకవ్యాపార విశ్లేషకులు తేల్చేశారు. అయితే ఈ నష్టం వాళ్లు ఊహించిన దానికంటే భారీగానే ఉండబోతోందని ఇప్పుడు ఒక అంచనాకి వస్తున్నారు. 

అఫ్గన్‌ నుంచి భారత్‌కు రావాల్సిన ఉత్పత్తులు రోడ్డు మార్గంలో పాకిస్థాన్‌ మీదుగా వస్తుంటాయి. ప్రస్తుతం తాలిబన్ల ఆక్రమణ నేపథ్యంలో ఎక్కడి కార్యకలాపాలు అక్కడే నిలిచిపోయాయి. దీంతో భారత వర్తకులకు భారీ నష్టం వాటిల్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వీటికి తోడు ఇప్పటికే పూర్తైన చెల్లింపులను సైతం నిలిపివేయడంతో వ్యాపారుల్లో ఆందోళన నెలకొంది. అయితే ఇవేం తక్షణ పరిణామాలు కావని, నెలన్నర నుంచే ముందు నుంచే నడుస్తున్నా ప్రభుత్వం అప్రమత్తం చేయలేదని వ్యాపారులు వాపోతున్నారు. ఇప్పటికే చాలావరకు ఉత్పత్తుల దిగుమతి ఆగిపోగా, మధ్యవర్తులతో సంబంధాలూ తెగిపోయాయని, వాణిజ్యానికి సంబంధించిన ఒప్పందాలు రద్దు అయినట్లు చాలామంది చెబుతున్నారని కొందరు చెబుతున్నారు. మరికొందరు తమకు రావాల్సిన ట్రక్కులు నిలిచిపోవడంతో.. ఇంక వేచిచూడడమే మార్గంగా భావిస్తున్నారు.
  

‘వర్తక వ్యాపారాలు నిరాటంకంగా కొనసాగుతాయని తాలిబన్లు హామీ ఇస్తున్నారు. కానీ, అంతకు ముందు పూర్తి ఆర్థిక వ్యవస్థను సమీక్షించాలని వాళ్లు నిర్ణయించుకున్నారు. కాబట్టి, వర్తక వ్యాపారాల క్లియరెన్స్‌కు ఎంత సమయం పడుతుందనేది కచ్చితంగా చెప్పలేం. కానీ, భారత్‌ నుంచి వెళ్లే గూడ్స్‌ నార్త్‌-సౌత్‌ ట్రేడ్‌ కారిడార్‌ మార్గంలో లేదంటే దుబాయ్‌ నుంచి అక్కడికి చేరుకునే అవకాశాలు మాత్రం ఉన్నాయి. చాబహర్‌ పోర్ట్‌ నుంచి ముంబైకి రవాణా కొనసాగే ఛాన్స్‌ ఉంది. కానీ, అన్నింటి కంటే ముందు తాలిబన్ల అనుమతులు అవసరం పడొచ్చు’ - ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఎక్స్‌పోర్ట్‌ ఆర్గనైజేషన్స్‌ సీఈవో, డైరెక్టర్‌ జనరల్‌ అజయ్‌ షా 

హాట్‌ న్యూస్‌: అఫ్గన్‌ పరిణామాలు.. తాలిబన్లు తెచ్చిన తంటాలు

దిగుమతులు ఇవే  
పాక్‌(48 శాతం) తర్వాత అఫ్గన్‌ నుంచి ఎక్కువ దిగుమతులు చేసుకునే దేశంగా భారత్‌(19) ఉంది. ఆ తర్వాతి ప్లేసులో రష్యా, ఇరాన్‌, ఇరాక్‌, టర్కీలు ఉన్నాయి. 2020-2021కిగానూ భారత్‌-అఫ్గన్‌ల మధ్య ద్వైపాక్షిక్ష వాణిజ్య ఒప్పందాల విలువ 1.4 బిలియన్‌ డాలర్లుగా ఉంది(2019-20తో పోలిస్తే తక్కువే). ఇందులో భారత్‌ దిగుమతుల విలువ 826 మిలియన్‌ డాలర్లు, ఎండు ద్రాక్ష, వాల్‌నట్‌, ఆల్మండ్‌, అంజీర్‌, పైన్‌, పిస్తా, ఎండు ఆప్రికాట్ బిజినెస్‌ కోట్లలో నడుస్తుంది. వీటితో పాటు తాజా ఆప్రికాట్‌, చెర్రీ, వాటర్‌ మిలన్‌, మూలికలు తదితరాలను దిగుమతి చేసుకుంటాయి.
 

ఎగుమతుల మీదా..
దిగుమతుల మీదే కాదు.. అఫ్గన్‌కు భారత్‌ నుంచి ఎగుమతి అయ్యే వర్తకం మీదా ప్రతికూల ప్రభావం పడనుంది. భారత్‌ నుంచి సుమారు 509 మిలియన్‌ డాలర్ల విలువ చేసే వర్తకంపై తీవ్ర ప్రభావం పడింది. టీ, కాఫీ, మిరియాలు, కాటన్‌, బొమ్మలు, చెప్పులు, ఇతరతత్రా ఉత్పత్తుల ఎగుమతులు ఎక్కడికక్కడే నిలిచిపోయినట్లు తెలుస్తోంది. అయితే వ్యాపారుల్లో నెలకొన్న ఆర్థిక భయాన్ని తొలగించాల్సిన అవసరం ఉందని సీఏఐటీ కార్యదర్శి ప్రవీణ్‌ ఖండెల్‌వాల్‌  ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
 

అఫ్గన్‌ జీడీపీపై ప్రభావం
వ్యవసాయం, పశు పోషణ అఫ్గన్‌ల జీవనాధారంగా. తొలినాళ్లలో వ్యక్తిగత సాగు, వలస పశు పోషణ మీదే వాళ్లు ఎక్కువగా దృష్టి సారిస్తూ.. విదేశాలకు ఎగుమతిపైనా తక్కువగా దృష్టిపెట్టేవాళ్లు. అయితే తర్వాతి కాలంలో ఎగుమతుల మీద ఆసక్తి మొదలుపెట్టారు. డ్రైడ్‌ ఫ్రూట్స్‌, నట్స్‌, కార్పెట్స్‌, ఉన్ని ఎగుమతులు సాగాయి. ఇక విదేశాల నుంచి వాహనాలను, పెట్రోలియం ప్రొడక్టులను, చక్కెర, దుస్తులు, ప్రాసెస్ట్‌ యానిమల్‌-వెజిటెబుల్‌ ఆయిల్‌, టీను దిగుమతి చేసుకుంటాయి. ఇక ఎగుమతులే అఫ్గన్‌ ఆర్థిక వ్యవస్థలో 20 శాతం జీడీపీని శాసిస్తున్నాయి.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement