
కాబూల్: అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ ముఠా వ్యవస్థాపకుడైన ముల్లా మొహమ్మద్ ఒమర్ అమెరికాలో జరిగిన సెప్టెంబర్ 11 దాడుల అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. 2013లో మరణించాడు. ఈ విషయం రెండేళ్ల తర్వాత అతడి కుమారుడు స్వయంగా ప్రకటించడంతో బయటి ప్రపంచానికి తెలిసింది. ఒమర్ మరణం తర్వాత తాలిబన్లలో ఆరుగురు వ్యక్తులు కీలక నాయకులుగా ఎదిగారు. ప్రస్తుతం ఆ ఆరుగురే తాలిబన్లకు మార్దనిర్దేశం చేస్తూ ముందుకు నడిపిస్తున్నారు. వారు ఎవరంటే..
హైబతుల్లా అఖుంజాదా
దాదాపు 60 ఏళ్ల వయసున్న హైబతుల్లా అఖుంజాదా మతం పట్ల నిష్ట కలిగిన నాయకుడిగా గుర్తింపు పొందాడు. తాలిబన్ రాజకీయ, మత, సైనిక వ్యవహారాలపై పూర్తి పట్టు సాధించాడు. ఇస్లామిక్ న్యాయ నిపుణుడైన హైబతుల్లాను తాలిబన్ సుప్రీం లీడర్‌గా పరిగణిస్తుంటారు. 2016లో అఫ్గాన్–పాకిస్తాన్ సరిహద్దులో అమెరికా డ్రోన్ దాడిలో హతమైన అఖ్తర్ మన్సూర్ నుంచి అతడు ఈ బాధ్యతలు స్వీకరించాడు. అంతకు ముందు పాకిస్తాలోని కుచ్లాక్‌లో ఓ మసీదులో మత గురువుగా పనిచేశాడు. ప్రస్తుతం ఎక్కడున్నాడో తాలిబన్లకు తప్ప ఎవరికీ తెలియదు.
ముల్లా మొహమ్మద్ యాకూబ్
తాలిబన్ వ్యవస్థాపకుడు ముల్లా మొహమ్మద్ ఒమర్ కుమారుడే ఈ యాకూబ్. తాలిబన్ మిలటరీ ఆపరేషన్లను పర్యవేక్షిస్తుంటాడు. ప్రస్తుతం అఫ్గాన్‌లోనే ఉన్నాడు. 2016లో తాలిబన్లకు సుప్రీం లీడర్ కావాల్సిన యాకూబ్ తాను ఇంకా కుర్రాడినేని, తగిన అనుభవం లేదన్న కారణంతో వెనక్కి తగ్గాడు. ప్రస్తుతం అతడికి దాదాపు 30 ఏళ్ల వయసుంటుందని సమాచారం.
సిరాజుద్దీన్ హక్కానీ
ముజాహిదీన్ కమాండర్ జలాలుద్దీన్ హక్కానీ కుమారుడు సిరాజుద్దీన్ హక్కానీ. అఫ్గాన్‌లో హక్కానీ నెట్‌వర్క్‌కు లీడర్‌గా చెలామణి అవుతున్నాడు. పాకిస్తాన్–అఫ్గానిస్తాన్ సరిహద్దు ప్రాంతాన్ని తన కార్యక్షేత్రంగా మార్చుకున్నాడు. తాలిబన్ ఆర్థిక, సైనిక వ్యవహారాలు, నిధుల సేకరణ, పంపిణీ వంటివి ఇతడి కనుసన్నల్లోనే సాగుతుంటాయి. ఆత్మాహుతి దాడులు చేయడంలో హక్కానీలు దిట్టలు. సిరాజుద్దీన్ వయసు 40 నుంచి 50 ఏళ్ల మధ్య ఉంటుంది. ప్రస్తుతం అతడి జాడ తెలియదు. ముల్లా అబ్దుల్ గనీ బరాదర్, షేర్ మహమ్మద్ అబ్బాస్, అబ్దుల్ హకీం హక్కానీ సైతం తాలిబన్ బృందంలో కీలకమైన నేతలుగా గుర్తింపు పొందారు.
Comments
Please login to add a commentAdd a comment