కాబూల్: ఆగస్టు 2021లో తాలిబాన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇప్పటికే తాలిబాన్ ప్రభుత్వం బాలికలు హైస్కూళ్ళు, విశ్వవిద్యాలయాలకు వెళ్లకుండా నిషేధాన్ని విధించిన విషయం తెలిసిందే. దీనికి తోడు ఇటీవలే అక్కడ మహిళలు బ్యూటీ పార్లర్లు నడపడంపై నిషేధాన్ని విధించింది. దీంతో బ్యూటీ పార్లర్ నడుపుకునే మహిళలు అఫ్గాన్ ప్రభుత్వంతో తమ గోడును చెప్పుకునేందుకు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.
ఆఫ్ఘనిస్తాన్ లో అధికారం చేతులు మారి తాలిబాన్ ప్రభుత్వం చేతుల్లోకి వచ్చిన తర్వాత కొన్ని కఠిన నియమాలను అమల్లోకి తీసుకురావడం మొదలుపెట్టింది. ఇదే క్రమంలో కాలేజీల్లోనూ, హై స్కూళ్లలోనూ, విశ్వ విద్యాలయాలలోనూ విద్యార్థినులకు ప్రవేశాన్ని నిషేధించింది. పార్కులకు, ఆటవిడుపు ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు జిమ్ వంటి ప్రదేశాలకు వెళ్లేటప్పుడు నిండుగా దుస్తులు ధరించి వెళ్లాలని హుకుం జారీ చేసింది. వీటికి కొనసాగింపుగా దేశవ్యాప్తంగా ఉన్న బ్యూటీ పార్లర్లను కూడా మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది ఆఫ్ఘన్ తాలిబాన్ ప్రభుత్వం.
నిరవధికంగా నిరసన తెలుపుతున్నా ప్రభుత్వ పెద్దలు తమ గోడు వినకపోవడం దారుణమని.. ఇంతవరకు ఎవ్వరూ తమతో చర్చలు నిర్వహించే ప్రయత్నమైనా చేయలేదని నిరసనకారులు వాపోతున్నారు. ఉన్నట్టుండి మా పొట్ట కొట్టడం సరికాదని చెబుతూ ప్లకార్డులు ప్రదర్శన చేస్తూ తమ జీవనభృతిని కాపాడాలని నినాదాలు చేశారు.
ఇదిలా ఉండగా బ్యూటీ పార్లర్ల సంప్రదాయం ఇస్లాంకు వ్యతిరేకంగా ఉందని, చాలామంది అందాన్ని పెంచుకుని ఆకాశానికి నిచ్చెన వేసే క్రమంలో నిరుపేదలుగా మారుతున్నారని, సెలూన్ లో కొన్ని ట్రీట్మెంట్లు అయితే మన సంప్రదాయాలను మంటగలిపే విధంగా ఉందన్నది ప్రభుత్వం అభిప్రాయం.
ఇది కూడా చదవండి: అతడు సముద్రాన్ని జయించాడు.. 60 రోజుల పాటు ఒక్కడే..
Comments
Please login to add a commentAdd a comment