Dried fruits
-
పోషకాల రారాజు.. జీడిపప్పు
సాక్షి, అమరావతి: ఒకప్పుడు ఉన్నత వర్గాలకు మాత్రమే పరిమితమైన జీడిపప్పు వినియోగం ప్రస్తుతం మధ్యతరగతి వర్గాలకు సైతం చేరువవుతున్నది. ప్రస్తుతం మార్కెట్లో చాలా డ్రైఫ్రూట్స్ ఉన్నప్పటికీ జీడిపప్పుకున్న ఆదరణ మరే ఉత్పత్తికి లేకుండాపోయింది. ప్రత్యేకించి కరోనా మహమ్మారి ప్రబలిన సమయంలో అత్యధిక పోషకాలు కలిగిన జీడి ప్రతి ఒక్కరి ఆహారంలో భాగమయ్యిందంటే అతిశయోక్తి కాదు. పండుగల సమయంలో ప్రముఖులకు, ఆత్మీయులకు స్వీట్ బాక్సులు గిఫ్ట్‌గా పంపడం ఆనవాయితీ. అలాగే కరోనా సమయంలోనూ బయట తయారు చేసే స్వీట్ల పట్ల విముఖత పెరగడంతో వాటికి బదులు పోషకాలు ఎక్కువగా ఉన్న డ్రైఫ్రూట్స్ బాక్సుల్ని బహుమతులుగా పంపి ఆత్మీయతను చాటుకుంటున్నారు. కోవిడ్ నిబంధనలను సవరించిన ప్రస్తుత తరుణంలో జీడి పప్పు వినియోగం బాగా పెరిగింది. ఒకప్పుడు ఇది ఖరీదైన వ్యవహారమనే సాధారణ ప్రజల అభిప్రాయం మారడం కూడా డ్రైఫ్రూట్స్ ప్రత్యేకించి జీడిపప్పుకు గిరాకీ పెరగడానికి కారణమైంది. వంటిళ్లలో తయారు చేసే తీపి పదార్థాల స్థానంలో జీడిపప్పును స్నాక్స్‌గా ఇచ్చే సంప్రదాయం కూడా ఇందుకు కలిసివచ్చింది. అత్యవసరమైన పోషక వస్తువుగా జీడి.. కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత ప్రజల వైఖరిలో మార్పు వచ్చింది. అత్యవసరమైన పోషక వస్తువుగా జీడిని గుర్తించారు. ఫలితంగా వినియోగం పెరిగింది. రాబోయేది పండుగల సీజన్. కరోనా ఆంక్షలు తొలగాయి. అందువల్ల ఈ ఏడాది జీడిపప్పు గిఫ్ట్ బాక్సుల వ్యాపారం బాగా సాగవచ్చునని హోల్‌సేల్ జీడిపప్పు వ్యాపారి కె.శ్రీనివాస్ చెప్పారు. కిలో రూ.450 నుంచి రూ.900 వరకు జీడిపప్పు దొరుకుతుంది. జీడిపప్పు వినియోగం ఇలా.. 2017 నుంచి 2020 వరకు సేకరించిన డేటా ప్రకారం జీడిపప్పు తలసరి వినియోగం గ్రామీణ ప్రాంతాల్లో ఏడాదికి 12 గ్రాములైతే పట్టణ ప్రాంతాల్లో 96 గ్రాములు. గతంలో పోల్చుకుంటే ఇది చాల ఎక్కువని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం కమ్యూనిటీ సైన్స్ ప్రొఫెసర్ టి.గోపీకృష్ణ చెప్పారు. అందువల్ల వ్యాపారులు ఎక్కువగా పట్టణ, నగర ప్రాంతాలలోనే జీడిపప్పు వ్యాపారం చేస్తున్నారు. జీడిపప్పు వినియోగం పెరుగుదల ఏడాదికి 5 శాతంగా అంచనా వేశారు. 60 దేశాలకు ఎగుమతులు.. మన రాష్ట్రం నుంచి దేశంలోని పలు ప్రాంతాలకే కాకుండా అమెరికా, అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, సౌదీ అరేబియా, జపాన్ సహా 60 దేశాలకు జీడిపప్పు ఎగుమతి అవుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో మామూలు పరిస్థితుల్లో ఏప్రిల్ నుంచి జూలై వరకు మార్కెట్లో ముడి జీడి దొరుకుతుంది. అయితే 2018లో వచ్చిన తిత్లీ తుపాను శ్రీకాకుళం జిల్లాలోని తోటల్ని దెబ్బతీయగా.. 2019లో వచ్చిన కరోనా దేశవ్యాప్తంగా జీడి పరిశ్రమను మరింత దెబ్బతీసింది. వేలాది మందికి ఉపాధి కల్పించే పలు పరిశ్రమలు మూత పడ్డాయి. దీంతో ఇతర దేశాలు.. ప్రత్యేకించి ఆఫ్రికా నుంచి ముడి గింజలను దిగుమతి చేసుకోవడానికి భారత్ దాదాపు 2 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు అంచనా. సాగు పద్ధతులను ఆధునీకరించి ఎక్కువ బంజరు భూములను సాగులోకి తీసుకురావడం ద్వారా అదే పరిమాణంలో దేశీయంగా ఉత్పత్తి చేయవచ్చు. ముడి గింజలకు ఇతరులపై ఆధారపడే కన్నా సమీకృత వ్యూహాలను అవలంభిస్తే మేలని నిపుణులు చెబుతున్నారు. ఉత్పత్తి, ప్రాసెసింగ్, మార్కెటింగ్ రంగాలపై దృష్టి సారించాలని కోరుతున్నారు. ఏటా రూ.300 కోట్ల వ్యాపారం మనరాష్ట్రంలోని 8 జిల్లాల్లో 4.53 లక్షల ఎకరాల్లో జీడి మామిడి సాగవుతుంది. లక్ష టన్నుల వరకు దిగుబడి వస్తుంది. జీడి ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ రెండోస్థానాన్ని కైవసం చేసుకుంది. ప్రతి రోజూ 60 వేల కిలోలకు పైగా జీడిపప్పు (గుండ్రాలు) ఉత్పత్తి అయ్యేవి. సగటున ఒక కేజీ నాణ్యమైన జీడిపప్పు (గుండ్రాలు) రావడానికి మొత్తం 3.5 కిలోల జీడిపప్పును శుద్ధి చేయాల్సి ఉంటుంది. ప్రతి ఏటా రూ.300 కోట్ల వరకు వ్యాపారం జరుగుతుంది. -
తాలిబన్ల ఎఫెక్ట్.. భారత్‌కు ఇక భారీ దెబ్బే!
తాలిబన్ల దురాక్రమణతో అఫ్గనిస్తాన్‌లో నెలకొన్న సంక్షోభం.. అంతర్జాతీయంగా అన్ని రంగాల్లో అన్ని విధాల ప్రతికూల ప్రభావాన్ని చూపెడుతోంది. ముఖ్యంగా భారత్‌తో వర్తక వ్యాపారాలపై తీవ్ర ప్రభావం చూపెట్టే అవకాశం ఉందని ఇదివరకే వర్తకవ్యాపార విశ్లేషకులు తేల్చేశారు. అయితే ఈ నష్టం వాళ్లు ఊహించిన దానికంటే భారీగానే ఉండబోతోందని ఇప్పుడు ఒక అంచనాకి వస్తున్నారు. అఫ్గన్ నుంచి భారత్‌కు రావాల్సిన ఉత్పత్తులు రోడ్డు మార్గంలో పాకిస్థాన్ మీదుగా వస్తుంటాయి. ప్రస్తుతం తాలిబన్ల ఆక్రమణ నేపథ్యంలో ఎక్కడి కార్యకలాపాలు అక్కడే నిలిచిపోయాయి. దీంతో భారత వర్తకులకు భారీ నష్టం వాటిల్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వీటికి తోడు ఇప్పటికే పూర్తైన చెల్లింపులను సైతం నిలిపివేయడంతో వ్యాపారుల్లో ఆందోళన నెలకొంది. అయితే ఇవేం తక్షణ పరిణామాలు కావని, నెలన్నర నుంచే ముందు నుంచే నడుస్తున్నా ప్రభుత్వం అప్రమత్తం చేయలేదని వ్యాపారులు వాపోతున్నారు. ఇప్పటికే చాలావరకు ఉత్పత్తుల దిగుమతి ఆగిపోగా, మధ్యవర్తులతో సంబంధాలూ తెగిపోయాయని, వాణిజ్యానికి సంబంధించిన ఒప్పందాలు రద్దు అయినట్లు చాలామంది చెబుతున్నారని కొందరు చెబుతున్నారు. మరికొందరు తమకు రావాల్సిన ట్రక్కులు నిలిచిపోవడంతో.. ఇంక వేచిచూడడమే మార్గంగా భావిస్తున్నారు. ‘వర్తక వ్యాపారాలు నిరాటంకంగా కొనసాగుతాయని తాలిబన్లు హామీ ఇస్తున్నారు. కానీ, అంతకు ముందు పూర్తి ఆర్థిక వ్యవస్థను సమీక్షించాలని వాళ్లు నిర్ణయించుకున్నారు. కాబట్టి, వర్తక వ్యాపారాల క్లియరెన్స్‌కు ఎంత సమయం పడుతుందనేది కచ్చితంగా చెప్పలేం. కానీ, భారత్ నుంచి వెళ్లే గూడ్స్ నార్త్-సౌత్ ట్రేడ్ కారిడార్ మార్గంలో లేదంటే దుబాయ్ నుంచి అక్కడికి చేరుకునే అవకాశాలు మాత్రం ఉన్నాయి. చాబహర్ పోర్ట్ నుంచి ముంబైకి రవాణా కొనసాగే ఛాన్స్ ఉంది. కానీ, అన్నింటి కంటే ముందు తాలిబన్ల అనుమతులు అవసరం పడొచ్చు’ - ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్ సీఈవో, డైరెక్టర్ జనరల్ అజయ్ షా హాట్ న్యూస్: అఫ్గన్ పరిణామాలు.. తాలిబన్లు తెచ్చిన తంటాలు దిగుమతులు ఇవే పాక్(48 శాతం) తర్వాత అఫ్గన్ నుంచి ఎక్కువ దిగుమతులు చేసుకునే దేశంగా భారత్(19) ఉంది. ఆ తర్వాతి ప్లేసులో రష్యా, ఇరాన్, ఇరాక్, టర్కీలు ఉన్నాయి. 2020-2021కిగానూ భారత్-అఫ్గన్ల మధ్య ద్వైపాక్షిక్ష వాణిజ్య ఒప్పందాల విలువ 1.4 బిలియన్ డాలర్లుగా ఉంది(2019-20తో పోలిస్తే తక్కువే). ఇందులో భారత్ దిగుమతుల విలువ 826 మిలియన్ డాలర్లు, ఎండు ద్రాక్ష, వాల్నట్, ఆల్మండ్, అంజీర్, పైన్, పిస్తా, ఎండు ఆప్రికాట్ బిజినెస్ కోట్లలో నడుస్తుంది. వీటితో పాటు తాజా ఆప్రికాట్, చెర్రీ, వాటర్ మిలన్, మూలికలు తదితరాలను దిగుమతి చేసుకుంటాయి. ఎగుమతుల మీదా.. దిగుమతుల మీదే కాదు.. అఫ్గన్‌కు భారత్ నుంచి ఎగుమతి అయ్యే వర్తకం మీదా ప్రతికూల ప్రభావం పడనుంది. భారత్ నుంచి సుమారు 509 మిలియన్ డాలర్ల విలువ చేసే వర్తకంపై తీవ్ర ప్రభావం పడింది. టీ, కాఫీ, మిరియాలు, కాటన్, బొమ్మలు, చెప్పులు, ఇతరతత్రా ఉత్పత్తుల ఎగుమతులు ఎక్కడికక్కడే నిలిచిపోయినట్లు తెలుస్తోంది. అయితే వ్యాపారుల్లో నెలకొన్న ఆర్థిక భయాన్ని తొలగించాల్సిన అవసరం ఉందని సీఏఐటీ కార్యదర్శి ప్రవీణ్ ఖండెల్వాల్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. అఫ్గన్ జీడీపీపై ప్రభావం వ్యవసాయం, పశు పోషణ అఫ్గన్ల జీవనాధారంగా. తొలినాళ్లలో వ్యక్తిగత సాగు, వలస పశు పోషణ మీదే వాళ్లు ఎక్కువగా దృష్టి సారిస్తూ.. విదేశాలకు ఎగుమతిపైనా తక్కువగా దృష్టిపెట్టేవాళ్లు. అయితే తర్వాతి కాలంలో ఎగుమతుల మీద ఆసక్తి మొదలుపెట్టారు. డ్రైడ్ ఫ్రూట్స్, నట్స్, కార్పెట్స్, ఉన్ని ఎగుమతులు సాగాయి. ఇక విదేశాల నుంచి వాహనాలను, పెట్రోలియం ప్రొడక్టులను, చక్కెర, దుస్తులు, ప్రాసెస్ట్ యానిమల్-వెజిటెబుల్ ఆయిల్, టీను దిగుమతి చేసుకుంటాయి. ఇక ఎగుమతులే అఫ్గన్ ఆర్థిక వ్యవస్థలో 20 శాతం జీడీపీని శాసిస్తున్నాయి. -
ఆ నాలుగు డ్రైఫ్రూట్స్ మధుమేహులకూ ఓకే!
ఆహారం విషయంలో మధుమేహులకు భలే చిక్కు. ఏం తింటే చక్కెర శాతం పెరుగుతుందో స్పష్టంగా తెలియకపోవడం వల్ల అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు వీరు. మిగిలిన వాటి మాటెలా ఉన్నా.. నాలుగు రకాల డ్రైఫ్రూట్స్ మాత్రం చాలా నెమ్మదిగా చక్కెరలను శరీరంలోకి విడుదల చేస్తాయని తేల్చారు కెనెడాలోని మైకేల్స్ హాస్పిటల్ శాస్త్రవేత్తలు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. గోధుమ బ్రెడ్ కంటే.. ఖర్జూరాలు, ఆప్రికాట్స్, ఎండు ద్రాక్ష, సుల్తానాస్లు చాలా నెమ్మదిగా చక్కెరలను విడుదల చేస్తాయి కాబట్టి.. మధుమేహులు వీటిని నిక్షేపంగా తినవచ్చు. తియ్యటి పండ్లను తీసుకునే విషయంలోనూ మధుమేహులు చాలా సందిగ్ధంలో ఉంటారని.. కాకపోతే పండ్ల ద్వారా అందే చక్కెరలు దుష్ప్రభావం చూపవని... వీటి గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా తక్కువని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త జాన్ సైవిన్పైపర్ అంటున్నారు. ఆహార పదార్థాల తయారీలో తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న డ్రైఫ్రూట్స్‌ను వాడేందుకు తమ పరిశోధన ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. మరింత విస్తృత స్థాయిలో పరిశోధనలు చేసి ఈ ఫలితాలను నిర్ధారించుకోవాలని సూచించారు. పరిశోధన ఫలితాలు న్యూట్రిషన్ అండ్ డయాబెటిక్స్ పరిశోధన జర్నల్ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి. -
మేడ మీద ము‘నగ’!
హైదరాబాద్ గుడిమల్కాపూర్ ఎస్.బి.ఐ. కాలనీలో రెండంతస్థుల సొంత భవనంలో నివాసం ఉంటున్న అర్చన, ఫార్మా ఉద్యోగి అరవింద్‌కుమార్ దంపతులు గత ఐదారేళ్లుగా సేంద్రియ ఇంటిపంటలు సాగు చేసుకుంటున్నారు. ఉద్యాన శాఖ నుంచి సబ్సిడీపై సిల్పాలిన్ బెడ్స్ తీసుకొని టమాటా, వంకాయలు, అల్లంతోపాటు మునగ, బొప్పాయి చెట్లను పెంచుతున్నారు. పార్స్లీ, ఆరెగానో, తులసి, లెమన్‌గ్రాస్, కలబంద తదితర ఔషధ మొక్కలను సాగు చేస్తున్నారు. పెద్ద సిల్పాలిన్ బెడ్లో నాలుగేళ్లుగా ఎత్తుగా పెరిగిన మునగ చెట్టు వీరి కిచెన్ గార్డెన్‌కు తలమానికంగా నిలిచింది. మునగ కాయలతోపాటు ఆకులను కూడా కూరవండుకుంటున్నామని అర్చన తెలిపారు. ఉల్లి, వెల్లుల్లి వాడకుండా పార్స్లీ, ఆరెగానో తదితర ఆకులను ఉపయోగించి ఇంట్లోనే పిజ్జాలు తయారుచేసుకొని తింటుండడం విశేషం. 30 ఏళ్ల నాటి ఈ రెండంతస్థుల భవనానికి పిల్లర్లు వేయలేదు. గోడలపైనే నిర్మించారు. అందువల్ల గోడలపైనే 8 సిల్పాలిన్ బెడ్స్, కుండీలను ఏర్పాటు చేసుకొని ఐదారేళ్లుగా ఇంటిపంటలను సాగు చేసుకుంటున్నారు. 15 రోజులకోసారి జీవామృతం మొక్కలకు మట్టి ద్వారా, పిచికారీ ద్వారా కూడా ఇస్తున్నారు. రోజూ దేశీ ఆవుపాలు సరఫరా చేసే వ్యక్తే జీవామృతాన్ని సైతం ఇంటికి తెచ్చి ఇస్తున్నారు. మేడపైనే ఒక సిల్పాలిన్ బెడ్‌ను కంపోస్టు తయారీకి వాడుతున్నారు. టెర్రస్‌పైన ఇంటిపంటలు, షేడ్‌నెట్, ఇంటి చుట్టూ వెదురు తదితర మొక్కలు ఉండటం వల్ల తమ ఇంట్లో వేసవిలోనూ ఉష్ణోగ్రత 3–4 డిగ్రీల మేరకు సాధారణం కన్నా తక్కువగా ఉంటున్నదని అర్చన(98663 63723) సంతోషంగా చెప్పారు. అంటే.. ఇంటిపంటల కోసం శ్రద్ధతీసుకుంటే.. ఆరోగ్యంతోపాటు ఇంటి ఏసీ ఖర్చులు కూడా తగ్గాయన్నమాట! మునగాకు చిన్న – పోషకాలలో మిన్న మునగను తింటే అనేక పోషకాలను పుష్కలంగా తిన్నట్టే లెక్క. ఇదీ మునగ ఆకులో నిక్షిప్తమై ఉన్న పోషకాల జాబితా.. విటమిన్–సి: కమలాల్లో కన్నా 7 రెట్లు ఎక్కువ విటమిన్–ఎ: క్యారెట్లలో కన్నా 4 రెట్లు ఎక్కువ కాల్షియం: పాలలో కన్నా 4 రెట్లు ఎక్కువ పొటాషియం: అరటి పండ్లలో కన్నా 3 రెట్లు ఎక్కువ విటమిన్–ఇ: పాలకూరలో కన్నా 3 రెట్లు ఎక్కువ మాంసకృత్తులు: పెరుగులో కంటే 2 రెట్లు ఎక్కువ మునగాకును పప్పులో, సాంబారులో వేసి వండవచ్చు. మునగాకు వేపుడు చేయవచ్చు. మునగకాయలో కంటే ఆకుల్లో పోషకాలు ఎక్కువ మునగ పొడి చేసేదెలా? ► తయారు చేయటం తేలిక – వాడటం తేలిక ► లేత మునగాకును కడిగి, నీడలో ఆరబెట్టాలి ► గలగలలాడేలా ఆరిన మునగాకును పొడి చెయ్యాలి ► పొయ్యి మీద నుంచి దించిన తరువాత కూరలు, చారు వంటి వాటిల్లో వేయచ్చు. మునగలో ఉపయోగపడని భాగం లేదు ఆకులు – కూర, పోషకాల గని గింజ – మందు, నూనె, నీటి శుద్ధి కాయ – కూర పువ్వు – మందు, చట్నీ బెరడు – మందు బంక – మందు వేరు – మందు పెరటిలో మునగ చెట్టు ఉండగ – విటమిన్లు, టానిక్కులు కొనటం దండగ. మునగ చెట్లు పెంచుదాం – మునగాకు వాడకం పెంచుదాం. వివరాలకు.. కేరింగ్ సిటిజెన్స్ కలెక్టివ్(040–27610963) ఫొటోలు: ఇసుకపట్ల దేవేంద్ర, సాక్షి ఫొటో జర్నలిస్టు -
వెజ్ మీట్
కూరగాయల్లో కండ ఉండదా? పప్పులో పస ఉండదా? గింజల్లో గుజ్జు ఉండదా? డ్రైఫ్రూట్స్‌లో దమ్ము ఉండదా? చెట్టు ఆకుల్లో చేవ ఉండదా? ఇక మాంసమే ఎందుకండీ? వెజిటబుల్స్‌లో కావల్సినంత మీట్ ఉంటుంది. కూరగాయల్లో కావల్సినంత ప్రోటీన్ ఉంటుంది. గింజలు (సీడ్స్) ద్వారా ప్రోటీన్లను ఇచ్చేవి జనుము గింజలు (హెంప్ సీడ్స్) : వీటిని మనం ఆహారంగా వాడటానికి పెద్దగా ఇష్టపడకపోయినా... జనుము గింజల్లో (హెంప్ సీడ్స్) ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. 30 గ్రాముల జనుము గింజల్లో 22 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అంతేకాదు... ఇందులో మానవ జీవక్రియలకు అవసరమైన 10 అత్యవసరమైన అమైనోఆసిడ్స్ ఉన్నాయి. చాలాకాలం యౌవనంగా కనిపించేలా చేసే ఒమెగా 3–ఫ్యాటీ ఆసిడ్స్ కూడా ఉన్నాయి. సబ్జా గింజలు (చియా సీడ్స్) : సబ్జా గింజలలో ప్రోటీన్లతో పాటు వ్యాధులను దూరంగా ఉంచడంతో పాటు దీర్ఘకాలం యౌవనంగా కనిపించేలా చేసే యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. పైగా ఇవి రక్తంలోని చక్కెరను నియంత్రణలో ఉంచుతాయి కాబట్టి అటు ప్రోటీన్లను సమకూరుస్తూనే ఇటు చక్కెరను అదుపు చేస్తాయి. పైగా ఇందులో పీచు పదార్థాలూ పుష్కలంగా ఉంటాయి. అవిశె గింజలు (ఫ్లాక్స్ సీడ్స్) : 100 గ్రాముల అవిశె గింజలలో 18 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. కాబట్టి మంచి ప్రోటీన్ కోరుకునేవారికి అవిశె గింజలు ఉత్తమమైన ప్రోటీన్ వనరు. గుమ్మడి గింజలు (పంప్కిన్ సీడ్స్): 100 గ్రాముల గుమ్మడికాయ గింజల్లో 19 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇక ఇందులో ప్రోటీన్‌తో పాటు యాంటీఆక్సిడెంట్స్, ఫైటోన్యూట్రియెంట్స్ లాంటి అనేక పోషకాలు ఉంటాయి. పైగా గుమ్మడి గింజల్లో మెగ్నీషియమ్, మాంగనీస్, కాపర్, జింక్, ఐరన్ లాంటి పోషకాలూ ఉంటాయి కాబట్టి ఆరోగ్యానికి చాలా మందిది. ఇవి దీర్ఘకాలం యౌవనంగా ఉండేలా చూస్తాయి కూడా. డ్రైఫ్రూట్స్ నుంచి ప్రోటీన్లు ఎండుగా కనిపించే కొన్ని డ్రైఫ్రూట్స్‌లో ప్రోటీన్లు పుష్కలంగాఉంటాయి. వీటిని గుప్పెట్లో పట్టుకుని కూడా సులభంగా తినవచ్చు. పైగా డ్రైఫ్రూట్స్ నుంచి లభ్యమయ్యే మాంసకృత్తులతో వ్యాధి నిరోధక శక్తి కూడా సమకూరుతుంది. సాధారణంగా మాంసాహారంలోని ప్రోటీన్లతో పీచుపదార్థాలు లభ్యం కావు. కానీ ఈ డ్రైఫ్రూట్స్ ద్వారా అదనంగా పీచు కూడా దొరుకుతుంది. మాంసాహారపు ప్రోటీన్లతో మలబద్దకం వస్తే శాకాహారంతో లభ్యమయ్యే ఈ ప్రోటీన్లతో దాన్ని నివారించినట్లు కూడా అవుతుంది. పైగా శాకాహారంలో పీచుపదార్థాల వల్ల జీర్ణప్రక్రియ సజావుగానూ, సాఫీగానూ సాగుతుంది. పేగుల ఆరోగ్యం బాగుపడుతుంది. ఇక ఇందులోని మినరల్స్, విటమిన్–ఈ, ఒమెగా ఫ్యాటీ ఆసిడ్స్ వంటి పోషకాలు చాలా కాలం పాటు వ్యక్తులను దీర్ఘకాలం పాటు యౌవనంగా ఉంచడానికి తోడ్పడతాయి.జీడిపప్పు, బాదంపప్పు, పిస్తా : ప్రతి 100 గ్రాముల ఈ ఎండుఫలాల్లో (డ్రైఫ్రుట్స్) దాదాపు 20 – 22 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి. కాబట్టి ఈ డ్రైఫ్రూట్స్ ద్వారా శాకాహారులు ప్రోటీన్స్‌ను పొందవచ్చు. కూరగాయల భోజనంతో త్వరగా కడుపు నిండినట్లు అనిపించడం ఎందుకంటే భోజనంలోకి మటనో, చికెనో ఉంటే నాలుగు ముద్దలు ఎక్కువగా తినాలనిపిస్తుందని, నిజానికి అలా ఎందుకు జరుగుతుందో చాలామందికి తెలియదు. ఆకుకూరల భోజనంలో పీచుపదార్థాలు చాలా ఎక్కువగా ఉంటాయి. దాంతోపాటు ప్రొటీన్లూ ఎక్కువే. మన జీవక్రియలకు ఎంత ఆహారం కావాలో మెదడుకు తెలుసు. అందుకే మనం ఎంతో తినాలనుకున్నా అలా తినలేం. మనకు సరిపోయినంత కడుపులో పడిందని భావించాక కడుపునకు మెదడు ఒక సంకేతం పంపిస్తుంది. ఆ సంకేతం తర్వాత పూర్తి సంతృప్తి పొందిన ఫీలింగ్ కలుగుతుంది. ఇంగ్లిష్‌లో దీన్నే సేషియేషన్ అంటారు. ఇలా పీచులూ–ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం కొద్దిగా తీసుకోగానే అది చాలని భావించిన మెదడు సంతృప్తసంకేతం పంపిస్తుంది. దాంతో కడుపునిండిపోయినట్లవుతుంది. అంటే మనం తీసుకున్న ఆ ఆహారం మనకు చాలన్నమాట. అదే పీచులు లోపించి మాంసం తిన్నామనుకోండి. అందులోని పీచులు మన జీవక్రియలకు సరిపోకపోవడం వల్ల కడుపులో ఉండాల్సిన దాని కన్నా ఎక్కువే ఆహారం ఉన్నప్పటికీ ‘మరికాస్త తినాలి, ఇంకాస్త తినాలి’ అంటూ మన మెదడు కడుపునూ, నోటినీ కోరుతుంటుంది. అంటే సంతృప్త సంకేతం ఒక పట్టాన అందదన్నమాట. అందుకే మాంసాహారం తిన్నప్పుడు మామూలు కంటే ఒక ముద్ద ఎక్కువగానే కావాలనిపిస్తుంది. మాంసకృత్తులు ఎందుకంత అవసరం? కండరాల మంచి సౌష్ఠవం కోసం ప్రోటీన్లు ఉపయోగపడతాయి. అలాగే కండరాలు దెబ్బతిన్నప్పుడు వాటిని రిపేర్ చేయడం కోసం కూడా అవి అవసరం. అందుకే గుండె ఆపరేషన్ జరిగాక కొవ్వులను తగ్గించాలనే డాక్టర్లు సైతం ఆ గాయం మానేవరకూ, అంటే ఆ రిపేర్ జరిగే వరకూ చికెన్‌లాంటివి తినమని సలహా ఇస్తుంటారు. మాంసాహారులకు ప్రోటీన్లు ఎలాగైనా అందుతాయి. మరి శాకాహారులకూ వారి జీవక్రియల కోసం మాంసకృత్తులు అవసరం కదా. వారు ఈ ప్రోటీన్లను ఎలా భర్తీ చేసుకుంటారు. అదృష్టవశాత్తు కేవలం మాంసాహారంల్లో మాత్రమే గాక... శాకాహారంలోని చాలా పదార్థాలలో మాంసకృత్తులు ఉంటాయని తెలిసింది కదా. వాటిని తీసుకుంటే శాకాహారులకూ మాంసకృత్తులు సమకూరుతాయి. ఆ ఆహారాలేమిటో తెలుసుకుంటే సౌష్ఠవంతో కూడిన శరీరం, మంచి కండర నిర్మాణం, దెబ్బతిన్న కండరాల రిపేర్లను సులభంగా చేసుకోవచ్చు. ఆరోగ్యంగా జీవించవచ్చు. పాలు పాల ఉత్పాదనలలో పాలలో రెండు రకాల ప్రోటీన్లు ఉంటాయి. మొదటి ప్రోటీన్‌ను ‘వే’ అంటారు. మరో ప్రోటీన్‌కు కేసీన్ అని పేరు. ఈ రెండింటిలోనూ అత్యుత్తమ స్థాయి అమైనోయాసిడ్స్ నిండి ఉన్నాయి. ఇక పాలతో పాటు పాల ఉత్పాదనలైన పెరుగు, చీజ్‌లలోనూ ప్రోటీన్లు ఎక్కువ. పాలు, పాల ఉత్పాదనలలలో 20 : 80 నిష్పత్తిలో లభించే వే, కేసీన్ ప్రోటీన్లు హైబీపీని నియంత్రిస్తాయి. ఇక 100 గ్రాముల చీజ్‌లో 11 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. టోఫూ : తెల్లటి ఘన (క్యూబ్) ఆకృతిలో కనిపించే ఈ టోఫూను ప్రోటీన్ల గడ్డ అనుకోవచ్చు. ఇందులో చాలా రకాలుంటాయి. కాస్త మెత్తగా ఉండేవి, ఒక మోస్తరుగా ఉండేవి. మరీ గడ్డలా ఉండేవి. చైనా, జపాన్ లాంటి తూర్పు ఆసియా దేశాలకు చెందిన ఈ ఆహార పదార్థాన్ని అనేక రకాల వంటకాలు, తీపి పదార్థాల తయారీలలో వాడతారు. ఇందులో క్యాలరీలు తక్కువ, ప్రోటీన్లు ఎక్కువ. శాకాహారంలో టోఫూ అంతగా ప్రోటీన్లు లభ్యమయ్యే ఇతర వనరులు చాలా తక్కువ. అందుకే శాకాహారులు తమ ప్రోటీన్ అవసరాల కోసం దీన్ని నిశ్చింతగా వాడుకోవచ్చు. ఎంత ప్రోటీన్ కావాలంటే ఒక వ్యక్తి ఆరోగ్యకరమైన జీవనం సాగించాలంటే ప్రతిరోజూ తన బరువులోని ప్రతి కిలోకు ఒక గ్రాము ప్రోటీన్ కావాలి. అంతే ఉదాహరణకు ఒక వ్యక్తి బరువు 60 కిలోలు అనుకుంటే అతడికి రోజులో 60 గ్రాముల ప్రోటీన్ అవసరం. ఒక రోజువారీ ఆహారం (డైట్ ప్లాన్) ద్వారా చవకగా పొందాలంటే అది ఎలా అందుతుందో వివరించేదే ఈ కింది చార్ట్ : ధాన్యపు గింజలలో : ఇక మనం సాధారణంగా ధాన్యం అని పరిగణించే వరి, బార్టీ, ఇతర తృణధాన్యాలు, ఓట్మీల్, గోధుమ.... వీటన్నింటిలోనూ కొంతమేరకు ప్రోటీన్లు కూడా ఉంటాయి. అయితే పప్పు ధాన్యాలలో ఉన్నంత కాదు. కూరగాయల భోజనంతో త్వరగా కడుపు నిండినట్లు అనిపించడం ఎందుకంటే భోజనంలోకి మటనో, చికెనో ఉంటే నాలుగు ముద్దలు ఎక్కువగా తినాలనిపిస్తుందని, నిజానికి అలా ఎందుకు జరుగుతుందో చాలామందికి తెలియదు. ఆకుకూరల భోజనంలో పీచుపదార్థాలు చాలా ఎక్కువగా ఉంటాయి. దాంతోపాటు ప్రొటీన్లూ ఎక్కువే. మన జీవక్రియలకు ఎంత ఆహారం కావాలో మెదడుకు తెలుసు. అందుకే మనం ఎంతో తినాలనుకున్నా అలా తినలేం. మనకు సరిపోయినంత కడుపులో పడిందని భావించాక కడుపునకు మెదడు ఒక సంకేతం పంపిస్తుంది. ఆ సంకేతం తర్వాత పూర్తి సంతృప్తి పొందిన ఫీలింగ్ కలుగుతుంది. ఇంగ్లిష్‌లో దీన్నే సేషియేషన్ అంటారు. ఇలా పీచులూ–ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం కొద్దిగా తీసుకోగానే అది చాలని భావించిన మెదడు సంతృప్తసంకేతం పంపిస్తుంది. దాంతో కడుపునిండిపోయినట్లవుతుంది. అంటే మనం తీసుకున్న ఆ ఆహారం మనకు చాలన్నమాట. అదే పీచులు లోపించి మాంసం తిన్నామనుకోండి. అందులోని పీచులు మన జీవక్రియలకు సరిపోకపోవడం వల్ల కడుపులో ఉండాల్సిన దాని కన్నా ఎక్కువే ఆహారం ఉన్నప్పటికీ ‘మరికాస్త తినాలి, ఇంకాస్త తినాలి’ అంటూ మన మెదడు కడుపునూ, నోటినీ కోరుతుంటుంది. అంటే సంతృప్త సంకేతం ఒక పట్టాన అందదన్నమాట. అందుకే మాంసాహారం తిన్నప్పుడు మామూలు కంటే ఒక ముద్ద ఎక్కువగానే కావాలనిపిస్తుంది. కూరగాయలు, పప్పులలో... సోయాబీన్స్‌లో : సోయా ఉత్పాదనల్లో చాలా పుష్కలమైన ప్రోటీన్లు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేసేవి. మనకు మాంసాహారం ద్వారా లభ్యమయ్యే ప్రోటీన్లతో పోలిస్తే సోయాతో దొరికే ప్రోటీన్ కూడా అంతే నాణ్యమైనదని చెప్పవచ్చు. మంచి శెనగల్లో : మంచి శెనగల్లోనూ ప్రోటీన్లతో పాటు డయటరీ ఫైబర్, పొటాషియమ్ పుష్కలంగా దొరుకుతుంది. కాయధాన్యాలు (లెంటిల్స్‌లో) : లెంటిల్స్ అని పిలిచే కాయధాన్యాలలోనూ కొంత ప్రోటీన్ ఉంటుంది. ఇక కందిపప్పు, పెసరపప్పుతో పాటు అన్ని రకాల పప్పులలోనూ ప్రోటీన్ల పాళ్లు చాలా ఎక్కువే. అందుకే డాక్టర్లు శస్త్రచికిత్స జరిగాక ఆ గాయం త్వరగా మానేందుకు పప్పులు ఎక్కువగా తినమని సలహా ఇస్తుంటారు. అయితే పప్పు తినడం వల్ల సర్జరీ చేసిన గాయానికి చీము పడుతుందనే అపోహతో చాలామంది ఈ సూచనను పాటించరు. నిజానికి పప్పుల్లో చీము పట్టించే గుణం ఉండనే ఉండదు. పప్పులు తింటే ఏ గాయానికైనా చీము పట్టనే పట్టదు. ఇది సుమారుగా 60 కిలోల బరువున్న వ్యక్తి కోసం రూపొందించిన ఒక ఉజ్జాయింపు డైట్ చార్ట్. వేర్వేరు వ్యక్తులు తాము ఉన్న బరువును బట్టి ఆయా పదార్థాల పరిమాణంలో మార్పులు చేసుకొని తమ బరువుకు తగినన్ని ప్రోటీన్లు పొందవచ్చు. సూచన : కొన్ని రకాల ఆకుకూరలు, కూరగాయల్లోనూ ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఉదా: 100 గ్రాముల మునగాకులో 6 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇక గింజ చిక్కుళ్లు, గోరుచిక్కుళ్లలో 100 గ్రాముల్లో 4– 5 గ్రాములూ; సజ్జలు, జొన్నలు, రాగుల, కొర్రల వంటి తృణధాన్యాల్లో ప్రతి 100 గ్రా.కు 10 గ్రా. వరకు ప్రోటీన్ ఉంటుంది. వీటిని మార్చి మార్చి తీసుకోవడం వల్ల మనకు అవసరమైన ప్రోటీన్ అందుతుంది. మన ఆహారంలోని పిండిపదార్థాలు శక్తిని సమకూరుస్తాయి. కొవ్వులు కొన్ని విటమిన్లను తమలో కరిగించుకొని శరీరానికి అవసరమైన జీవక్రియలు జరిగేలా చూస్తాయి. మరి మాంసకృత్తులో? ప్రోటీన్లు అని పిలిచే ఈ మాంసకృత్తులు ప్రధానంగా మాంసాహారంలో ఎక్కువగా ఉంటాయి. అలాగని కేవలం మాంసాహారంలోనే కాదు... కొన్ని రకాల శాకాహారాల్లోనూ అవి పుష్కలం. అనేక సామాజిక నమ్మకాల కారణంగా కొంతమంది మాంసాహారాన్ని ముట్టుకోరు. వారికి ఈ మాంసకృత్తులు ప్రోటీన్లు సమకూరడానికి కొన్ని శాకాహారాల్లో పుష్కలంగా ఉండే మాంసకృత్తులు ఉపయోగపడతాయి. సుజాత స్టీఫెన్ చీఫ్ న్యూట్రిషనిస్ట్, యశోద హాస్పిటల్స్, మలక్ పేట, హైదరాబాద్ -
ఇంటిప్స్
వేడినీళ్లలో ముంచిన కత్తిని వాడితే డ్రైఫ్రూట్స్‌ని సులభంగా కట్ చేయవచ్చు. నెయ్యి ఎక్కువ కాలం తాజాగా ఉండాలంటే అందులో ఒక చిన్న బెల్లం ముక్క వేసి ఉంచాలి. వంటగదిలో చీమల దండు అధికంగా ఉంటే దోసకాయను ముక్కలుగా తరిగి చీమలు తిరిగే చోట ఉంచాలి. వంకాయ ముక్కలు నల్లబడకుండా ఉండాలంటే కూరలో చెంచాడు పాలు పోయాలి. నానబెట్టిన గోరింటాకు పొడితో వెండి వస్తువుల్ని శుభ్రం చేస్తే అవి కొత్తవాటిలా మెరుస్తాయి. -
ఓట్స్ చిక్కీ
కావలసినవి: ఓట్స్ - 1 కప్పు, బెల్లం తురుము - అరకప్పు, మైదాపిండి - 4 చెంచాలు, చాక్లెట్ పౌడర్ - 6 చెంచాలు, నీళ్లు - తగినన్ని, అన్ని రకాల డ్రైఫ్రూట్స్ - కావలసినన్ని, నెయ్యి - అవసరానికి తగినంత తయారీ: ఓట్స్‌ని నూనె లేకుండా దోరగా వేయించి పక్కన పెట్టాలి. మైదాపిండిని కూడా పచ్చి వాసన పోయేవరకూ వేయించి పెట్టాలి. డ్రైఫ్రూట్స్‌ని నేతిలో వేయించి ఉంచుకోవాలి. బెల్లం తురుములో కొద్దిగా నీళ్లు పోసి పాకం పట్టాలి. తీగపాగం అవుతుండగా ఓట్స్, డ్రైఫ్రూట్స్ వేసి కలపాలి. రెండు నిమిషాల తర్వాత మైదాపిండి కూడా వేసి కలపాలి. మిశ్రమం దగ్గరగా అవుతుండగా చాక్లెట్ పౌడర్ కూడా వేసి కలపాలి. గట్టిగా అయ్యాక దించేసి, నెయ్యి రాసిన ట్రేలో వేయాలి. చల్లారిన తర్వాత ముక్కలుగా కోసుకోవాలి.