
ఆహారం విషయంలో మధుమేహులకు భలే చిక్కు. ఏం తింటే చక్కెర శాతం పెరుగుతుందో స్పష్టంగా తెలియకపోవడం వల్ల అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు వీరు. మిగిలిన వాటి మాటెలా ఉన్నా.. నాలుగు రకాల డ్రైఫ్రూట్స్ మాత్రం చాలా నెమ్మదిగా చక్కెరలను శరీరంలోకి విడుదల చేస్తాయని తేల్చారు కెనెడాలోని మైకేల్స్ హాస్పిటల్ శాస్త్రవేత్తలు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. గోధుమ బ్రెడ్ కంటే.. ఖర్జూరాలు, ఆప్రికాట్స్, ఎండు ద్రాక్ష, సుల్తానాస్‌లు చాలా నెమ్మదిగా చక్కెరలను విడుదల చేస్తాయి కాబట్టి.. మధుమేహులు వీటిని నిక్షేపంగా తినవచ్చు.
తియ్యటి పండ్లను తీసుకునే విషయంలోనూ మధుమేహులు చాలా సందిగ్ధంలో ఉంటారని.. కాకపోతే పండ్ల ద్వారా అందే చక్కెరలు దుష్ప్రభావం చూపవని... వీటి గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా తక్కువని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త జాన్ సైవిన్‌పైపర్ అంటున్నారు. ఆహార పదార్థాల తయారీలో తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న డ్రైఫ్రూట్స్‌ను వాడేందుకు తమ పరిశోధన ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. మరింత విస్తృత స్థాయిలో పరిశోధనలు చేసి ఈ ఫలితాలను నిర్ధారించుకోవాలని సూచించారు. పరిశోధన ఫలితాలు న్యూట్రిషన్ అండ్ డయాబెటిక్స్ పరిశోధన జర్నల్ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment