వాషింగ్టన్: అమెరికా విదేశీ ఉగ్ర సంస్థలుగా గుర్తించిన 12 గ్రూపులు పాకిస్తాన్‌లోనే ఊపిరి పోసుకున్నాయని అమెరికా కాంగ్రెషనల్ కమిటీ తెలిపింది. వీటిలో లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ వంటి అయిదు సంస్థలు కేవలం భారత్ లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ‘టెర్రరిస్ట్ అండ్ మిలిటెంట్ గ్రూప్స్ ఇన్ పాకిస్తాన్’అంశంపై స్వతంత్ర కంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్(సీఆర్‌ఎస్) రూపొందించిన ఆ నివేదిక పేర్కొంది. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థల్లో కొన్ని 1980ల నుంచే అక్కడ ఉన్నాయని తెలిపింది.
వీటిల్లో కొన్ని ప్రపంచవ్యాప్తంగా, మరికొన్ని అఫ్గానిస్తాన్ లక్ష్యంగా, ఇంకొన్ని భారత్, కశ్మీర్ లక్ష్యంగా, కొన్ని షియా వ్యతిరేక కార్యకలాపాలు సాగిస్తున్నట్లు వివరించింది. 2008లో ముంబై దాడులకు కారణమైన లష్కరే తోయిబా 1980ల్లోనే పాకిస్తాన్‌లో అవతరించగా అమెరికా దీనిని విదేశీ ఉగ్రసంస్థ(ఎఫ్‌టీఓ)గా 2001లో గుర్తించింది. కశ్మీర్ ఉగ్రనేత మసూద్ అజార్ నేతృత్వంలో 2000లో జైషే మొహమ్మద్ ఏర్పాటైంది. భారత పార్లమెంట్‌పై దాడికి పాల్పడిన ఈ సంస్థను అమెరికా 2001లో ఎఫ్‌టీఓ గుర్తించింది.
మరో సంస్థ హర్కతుల్ జిహాద్ ఇస్లామీ 1980లో ఏర్పాటై అఫ్గాన్‌లో సోవియెట్ సైన్యానికి వ్యతిరేకంగా పోరాడింది. 1989 నుంచి ఈ గ్రూపు భారత్, బంగ్లాదేశ్, అఫ్గాన్, పాక్‌లలో కార్యకలాపాలు సాగిస్తోంది. ఈ సంస్థను అమెరికా 2010లో ఎఫ్‌టీఓగా ప్రకటించింది. 1989లో పాక్‌లో ఆవిర్భవించిన హిజ్బుల్‌ముజాహిదీన్‌ను కూడా అమెరికా 2017లో ఎఫ్‌టీఓ ప్రకటించింది. కశ్మీర్‌లో కార్యకలాపాలు సాగించే అతిపెద్ద గ్రూపు ఇదే. మరో ఉగ్ర సంస్థ అల్ ఖాయిదా కూడా పాకిస్తాన్ నుంచే కార్యకలాపాలు సాగిస్తున్నట్లు సీఆర్‌ఎస్ తెలిపింది.
ఈ సంస్థకు పాక్‌లోని అనేక గ్రూపుల నుంచి మద్దతు అందుతోందని పేర్కొంది. ఇవికాకుండా, ఇస్లామిక్ స్టేట్–ఖొరాసన్ ప్రావిన్స్(ఐఎస్‌కేపీ, ఐఎస్–కె), అఫ్గాన్ తాలిబన్, హక్కానీ నెట్‌వర్క్, తెహ్రిక్–ఇ–తాలిబన్ పాకిస్తాన్(టీటీపీ), బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, జుందల్లా, సిపాహ్ సహాబా పాకిస్తాన్, లష్కర్–ఇ–జంగ్వి వంటివి కూడా పాకిస్తాన్‌లో ఉన్నాయని వివరించింది. చుట్టుపక్కల దేశాలే లక్ష్యంగా పనిచేసే అనేక ఉగ్ర సంస్థలకు పాకిస్తాన్ నిలయంగా మారిందంటూ 2019లో విదేశాంగ శాఖ రూపొందించిన నివేదికను సీఆర్‌ఎస్ ఉటంకించింది. కాగా, సీఎస్‌ఆర్ నివేదిక అమెరికా కాంగ్రెస్ అధికార నివేదిక కాదు. దీనిని స్వతంత్ర నిపుణులు తయారు చేసి, చట్టసభల ప్రతినిధులకు అందజేస్తుంటారు.
Comments
Please login to add a commentAdd a comment