తిరువనంతపురం: రెండేళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లి ఇస్లామిక్ స్టేట్‌లో చేరిన ఓ ముస్లిం యువకుడు మరణించినట్లు వారి కుటుంబానికి ఓ సందేశం వచ్చింది. ఎదిగివచ్చిన కొడుకు కంటికి కానరానంత దూరం వెళ్లడంతో ఆ తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగి పోయారు. వివరాలు.. మలప్పురం జిల్లా ఇడప్పల్‌కు చెందిన మహ్మద్ ముహాసిన్ 2017, అక్టోబర్‌లో ఇంటి నుంచి వెళ్లి పోయాడు. దాంతో అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంజనీరింగ్ చదువుతున్న ముహాసిన్.. అఫ్గానిస్తాన్ వెళ్లి.. ఇస్లామిక్ స్టేట్‌లో చేరినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం ముహాసిన్ కుటుంబ సభ్యులకు వాట్సాప్‌లో ఓ సందేశం వచ్చింది.
మలయాళంలో ఉన్న సందేశంలో ‘అల్లా సేవలో తరించాలనే మీ సోదరుని కోరిక నెరవేరింది. పది రోజుల క్రితం మీ సోదరుడు అమరుడయ్యాడు. ఈ విషయాన్ని పోలీసులకు చెబితే.. మీకే ప్రమాదం’ అని హెచ్చరిస్తూ ఓ సందేశం వచ్చింది. దాంతో పాటు ముహాసిన్ మృతదేహం ఫోటో కూడా వచ్చింది. ఈ విషయం గురించి పోలీసులు మాట్లాడుతూ.. ‘కుటుంబ సభ్యులు వాట్సాప్‌లో వచ్చిన ఫోటోను ముహాసిన్‌దిగానే భావిస్తున్నారు. ఇంతకు మించి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. వాట్సాప్ సందేశం మలయాళంలో వచ్చింది. దీన్ని బట్టి.. ముహాసిన్‌తో పాటు కేరళకు చెందిన మరో వ్యక్తి కూడా అక్కడ ఉన్నట్లు భావిస్తున్నాం. అయితే సందేశం పంపిన వ్యక్తి ఎవరనేది తెలియాల్సి ఉంది’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment