మరో మారణ హోమానికి ప్లాన్ చేస్తున్నారా?
న్యూఢిల్లీ: భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా లష్కరే ఈ తోయిబా, జైషే మహమ్మద్ ఉగ్రవాదులు దాడి చేయనున్నారా? 2008 ముంబై తరహా దాడులకు పథక రచన చేస్తున్నారా.. ఆగస్ట్ 15 సందర్భంగా ఢిల్లీలో మారణ హోమం సృష్టించడానికి పూనుకుంటున్నారా.. అవుననే అంటున్నారు ఢిల్లీ ప్రత్యేక విభాగం పోలీసు అధికారులు.
జమ్మూ కశ్మీర్ కేంద్రంగా పనిచేస్తున్న టెర్రరిస్టులు ఆగస్ట్ 15, అంతకు ముందు దాడులు చేయడానికి ప్రయత్నిస్తున్నారని, నిఘా అధికారుల నుండి తమకు హెచ్చరికలు వచ్చినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసు వర్గాల్లో కలవరం మొదలైంది. దాంతో ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అప్రమత్తమయ్యారు. లోధి రోడ్లోని తమ సంస్థల కార్యాలయాల భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తున్నట్లు తెలిపారు.
ఇంటిలిజెన్స్ విభాగం హెచ్చరికల ప్రకారం ఒకవైపు టెర్రరిస్టులు దాడులకు సిద్ధమవుతోంటే.. మరోవైపు ఢిల్లీ పోలీసు ఉన్నతా ధికారుల్లో మాత్రం రక్షణ సౌకర్యాల లేమిపై ఆందోళన మొదలైంది. తమ దగ్గర సరైన రక్షణ వ్యవస్థ లేదనందున తమ శ్రేణుల భద్రతకోసం మరిన్ని అధునాతన రక్షణ పరికరాలతో పాటు, సీసీ కెమెరాలు అవసరమని చెబుతున్నారు.
ముఖ్యంగా ఎన్ఎస్జీ, ఎస్పీజీ,సిఐఎస్ఎఫ్, బీఎస్ఎఫ్ దళాల రక్షణకు ప్రత్యేక యూనిట్ కావాలని, ఎవరైనా వాహనంతో బలవంతంగా తమ ఆఫీసులో చొరబడితే, దాన్ని ఎదుర్కొనే శక్తి లేదనీ, మరిన్ని రక్షణ సౌకర్యాలు కల్పించాలని ఢిల్లీ సీనియర్ పోలీసు అధికారి అన్నారు. అత్యాధునిక, వాటర్ ప్రూఫ్ గేట్లు, సుమారు 20 టన్నుల భారాన్ని మోసే, మూడు సెకండ్లలో తెరుచుకునే మెటల్ గేట్స్ అవసరం చాలా ఉందన్నారు.
మరోవైపు ఉగ్రదాడికి సంబంధించి ఇంటిలిటెన్స్ ఏజెన్సీ ఇప్పటికే అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో ఢిల్లీలో డ్రోన్ల వాడకాన్ని నిషేధించారు. ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన విమానాలు మినహా, మిగిలినవాటికి అనుమతి లేదని ఢిల్లీ పోలీస్ అధికారి ఒకరు స్పష్టం చేశారు. నిబంధనల్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.