
క్యాష్‌తో వెళ్తున్నారా..తస్మాత్ జాగ్రత్త!
వ్యాపార నిమిత్తమో.. శుభకార్యం కోసమో..మరేదైనా అవసరార్థమో.. పెద్ద మొత్తంలో డబ్బు వెంట తీసుకెళ్తున్నారా.. అయితే మీరు కాస్త అప్రమత్తంగా ఉండాల్సిందే. సాధారణ ఎన్నికల దృష్ట్యా ప్రస్తుతం ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున నగదు రవాణాలో కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిందే.
ఎంతటి వారైనా ఈ విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే తలనొప్పి తప్పదు. ఎట్టిపరిస్థితుల్లోనైనా రూ. 50వేలకు మించి నగదు వెంట తీసుకెళ్లకపోవడం మంచిది. ఒకవేళ తీసుకెళ్లాల్సి వచ్చినా దానికి సంబంధించిన పూర్తి వివరాలు, ధ్రువీకరణ పత్రాలను దగ్గరే ఉంచుకోవాలి. సరైన డాక్యుమెంట్లు లేని డబ్బును సీజ్ చేస్తామని, సొత్తుకు సంబంధించి పూర్తి ధ్రువపత్రాలను అందజేస్తే తప్ప నగదు తిరిగి ఇవ్వబోమని అధికారులు ఖరాకండిగా చెప్తున్నారు. ఎన్నికల వేళ డబ్బుతో ఓటర్లను కొనుగోలు చేసేందుకు పార్టీలు చేస్తున్న పన్నాగాలకు అడ్డుకట్ట వేసేందుకు ఎన్నికల సంఘం ఈ కట్టుదిట్టమైన నిబంధనలు విధించింది.
జిల్లా వ్యాప్తంగా ప్రతి చెక్‌పోస్టు వద్ద పోలీసులు నిఘా వేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేక మొబైల్ టీంలు కూడా సంచరిస్తూ ఎక్కడిక్కడ తనిఖీలు చేస్తున్నాయి. ఇప్పటివరకూ జిల్లాలో రూ. 1.90 కోట్లకు పైగా సరైన ధృవపత్రాలు లేని నగదును పోలీసులు సీజ్ చేశారు. శనివారం ఒక్కరోజే సుమారు రూ. 70 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ సొత్తుపై విచారణ జరిపేందుకు ఐటీ శాఖకు చెందిన ఉన్నతాధికారిని కూడా నియమించారు. నగదు తోపాటు బంగారం, వెండి వంటి విలువైన ఆభరణాల తరలింపులో తగుజాగ్రత్తలు పాటించాలి. బ్యాంకు లావాదేవీలపైనా రిటర్నింగ్ అధికారులు నిఘావేశారు.
రూ. లక్షకు మించి ఎలాంటి లావాదేవీ జరిగినా తమ దృష్టికి తేవాల్సిందిగా అన్ని బ్యాంకుల యాజమాన్యానికి కలెక్టర్ శనివారం ఆదేశాలు జారీచేశారు. అయితే నిత్యం వ్యాపార నిమిత్తం అధిక మొత్తంలో నగదుతో సంచరించే వ్యాపారులు పోలీసుల తనిఖీల పట్ల ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకు నుంచి నగదు డ్రా చేసుకుని వెళ్తుంటే రెండు, మూడు చోట్ల పోలీసులు ఆపుతున్నారని, వారడిగిన డాక్యుమెంట్లు చూపాలంటే రెండు,మూడు సార్లు ఇంటికి వెళ్లి రావాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అసలే ఆర్థిక సంవత్సరం ముగింపు రోజులు.. ఆపై ఎన్నికల అధికారుల నిబంధనలతో పని ఒత్తిడి పెరిగిపోయిందని బ్యాంకర్లు వాపోతున్నారు. నగదు రవాణా నిబంధనల వల్ల కాస్త ఇబ్బంది ఉన్నప్పటికీ అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రజలు సహకరించాలని పోలీసులు కోరుతున్నారు.
సొంత డబ్బే అంటే కుదరదు
సొంత డబ్బే కదా.. ఏమవుతుందని పెద్ద మొత్తంలో వెంట తీసుకెళ్తే చిక్కుల్లో పడక తప్పదు. బ్యాంకులో జమ చేసేందుకు రూ.50వేలు మించి డబ్బు తీసుకువెళ్లే వారు బ్యాంక్ పాస్‌బుక్, పాన్‌కార్డు వంటివి తీసుకెళ్లాలి. ఇక లక్షల్లో తీసుకెళ్లాల్సి వస్తే ఆదాయపు పన్ను చెల్లింపు వివరాల పత్రాలు విధిగా ఉండాలి. ముఖ్యంగా వ్యాపారులు, వివాహాలకు దుస్తులు, బంగారం కొనుగోలు చేసేందుకు వెళ్లే వారు ఇతరత్రా అవసరాలకు నగదు వెంట తీసుకెళ్లేవారు జాగ్రత్త వహించాలి.
నగదుపైనే కాదు..
పోలీసులు నగదు రవాణాపైనే కాకుండా ఓటర్లను ప్రభావితం చేసే ఇతర వస్తువులపైనా నిఘా పెట్టారు. నగదుతోపాటే ఓటర్లను ఆకట్టుకోవడానికి అభ్యర్థులు రకరకాల నజరానాలు ప్రకటిస్తుంటారు. మహిళా ఓటర్లు అయితే చీరెలు, పెద్దలకు మద్యం సీసాలు, యువకులకు క్రికెట్ కిట్లు, వాలీబాల్, ఫుట్‌బాల్, క్యారమ్ బోర్డులు గంపగుత్తగా నజరానాగా ఇవ్వడం ఆనవాయితీ. పోలీసులు వీటిపైనా దృష్టి కేంద్రీకరించారు. పైన పేర్కొన్నవి పెద్ద మొత్తంలో రవాణా చేస్తున్న సమయంలో పోలీసుల తనిఖీల్లో దొరికితే అంతే సంగతులు. వాటిని ఎక్కడ కొన్నారు? ఎందుకు కొన్నారు? వ్యాపారం కోసమా? అనే పోలీసుల ప్రశ్నలకు ఆధారాలతో సహా జవాబులివ్వాల్సి ఉంటుంది. జవాబు రాని పక్షంలో వాటిని జప్తు చేయడమే కాకుండా కేసు కూడా నమోదు చేస్తారు. అలాగే ఎన్నికల సందర్భంగా మద్యం ఏరులై పారకుండా పోలీసులు దాడులు ముమ్మరం చేశారు. గుడుంబా స్థావరాలపై దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నారు. విస్కీ, బ్రాందీ నిల్వలు లేకుండా నిఘా పెంచారు.