సాక్షి ప్రతినిధి, ఖమ్మం: సార్వత్రిక ఎన్నికలలో వైఎస్సార్‌సీపీ, సీపీఎం తరఫున పోటీచేస్తున్న అభ్యర్థులను గెలిపించాలని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా ప్రజలను కోరారు. జిల్లాలో మధిర, కొత్తగూడెం, సత్తుపల్లి, వైరా నియోజకవర్గాల్లో రెండురోజుల పాటు ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన చేసిన ప్రసంగాలు ప్రజలను ఆలోచింపచేశాయి. ఆదివారం సత్తుపల్లి బస్టాండ్‌సెంటర్‌లో జరిగిన భారీ సభలో ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ... విశ్వసనీయతకు, నిజాయితీకి పట్టం కట్టే నాయకులను ఎన్నుకోవాలని కోరారు.
పేదల మనసెరిగిన నాయకులకు, వారి గుండెచప్పుడు తెలిసిన నాయకులకు, చనిపోయిన తర్వాత పేదల గుండెల్లో నిలిచిపోవాలన్న ఆరాటం ఉన్న నాయకులకు ఓట్లేయాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు ఆల్‌ఫ్రీ అంటున్న చంద్రబాబు ఆయన పాలించిన తొమ్మిదేళ్లలో పేదల గురించి ఎందుకు ఆలోచించలేదని ప్రశ్నించారు. ఏరోజూ పేదల జీవితాలు పట్టని చంద్రబాబు రాజకీయాలను దిగజార్చి ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రోజుకోమాట, పూటకో అబద్ధం చెప్పి పట్టపగలే ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. వైఎస్ మరణం తర్వాత గత ఐదేళ్లలో పేదలకు ఒక్క కొత్త రేషన్‌కార్డు, కొత్త ఇల్లు, కొత్త పింఛన్ ఇవ్వలేని కాంగ్రెస్‌కు ఓటేయవద్దనికోరారు. ఈ రెండు పార్టీల నేతలు ఓట్ల కోసం వస్తే మీకు ఓటెందుకు వేయాలని ప్రశ్నించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
జిల్లాలోని పలు చోట్ల జరిగిన రోడ్‌షోల్లో జగన్ ప్రసంగం ఇలా సాగింది...
‘‘మిట్టమధ్యాహ్నం... మండుతున్న ఎండలో... ఇంటికిపోవడానికి ఏ ఒక్కరూ కూడా కారణాలు వెతుక్కోవడం లేదు. నడిరోడ్డయినా, ఎండాకాలమనే సంగతి తెలిసినా, కార్యక్రమం ఆలస్యమవుతున్నా ఏ ఒక్కరి ముఖంలో కూడా చికాకు అనేది కూడా కనిపించడం లేదు. కష్టమనిపించినా, నడిరోడ్డుపై నిలబడి, ఎండ తీక్షణంగా ఉన్నా చిక్కటి చిరునవ్వుతో ఇంతటి ఆప్యాయతలు చూపెడుతున్నారు. ప్రేమానురాగాలు కురిపిస్తున్నారు. మీ అందరి ఆప్యాయతలకు, ప్రేమానురాగాలకు ప్రతి అక్కకు, ప్రతి చెల్లికీ, ప్రతి అవ్వకు, తాతకు, ప్రతి సోదరునికి, ప్రతి సన్నిహితుడికి చేతులు జోడించి శిరస్సు వంచి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా.
రెండు రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలలో ఎంపీ, ఎమ్మెల్యేల కోసం మీరు వేసే ఓటు చాలా కీలకమైనది. మీ తలరాతను మార్చే ఎన్నికలు ఇవి. వేసే ప్రతి ఓటు ఎటువంటి పార్టీకి వేస్తున్నారు... ఎటువంటి నాయకత్వానికి వేస్తున్నారనేది ప్రతి ఒక్కరూ ఓటేసే ముందు ప్రశ్నించుకోవాలి. ఏ నాయకుడు పేదవాడి గుండె చప్పుడు తె లుసుకుంటాడో, వారి మనసెరుగుతాడో, చనిపోయిన తర్వాత కూడా వారి గుండెల్లో ఉండాలని ఆరాటపడతాడో అలాంటి నేతలకే ఓట్లేయాలి.
అలాంటి పార్టీనే అధికారంలోకి తెచ్చుకోవాలి. అప్పుడే మన తలరాతలు మంచిగా ఉంటాయి. ఒక్కటయితే చెపుతున్నా నాయకత్వం అంటే ఎలా ఉండాలి... సీఎం అంటే ఎలా ఉండాలి అనేదానికి వైఎస్‌ను చూడాలి. ఆ దివంగత నేత, ప్రియతమ నాయకుడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మన మధ్యలోంచి వెళ్లిపోయి ఐదేళ్లు గడుస్తున్నా మన హృదయాల్లోనే ఉన్నాడు. ఆయనకన్నా ముందు, ఆయన తర్వాత చాలా మంది సీఎంలను మనం చూశాం. కానీ సీఎం అంటే ఇలా ఉండాలని రాష్ట్రానికే కాదు దేశానికే చాటి చెప్పిన వ్యక్తి వైఎస్సార్. ఒక్క మాటలో చెప్పాలంటే నేను రామరాజ్యమైతే చూడలేదు కాానీ రాజశేఖరుని సువర్ణయుగాన్ని మాత్రం చూశాను. చాలా మంది సీఎంలు చేయలేనిది వైఎస్ చేశారు. ఇవ్వలేనివి ఇచ్చారు. ప్రతి పేదవాడి గుండెలో నిలిచిపోయారు.
పేదల గురించి ఆలోచించని బాబు...
వైఎస్ కన్నా ముందు పాలన సాగించిన చంద్రబాబునాయుడు ఏ రోజూ పేదల పరిస్థితి గురించి ఆలోచించలేదు. పేదవిద్యార్థుల గురించి ఆలోచించలేదు. వృద్ధులకు పింఛన్‌ను ఏదో ముష్టివేసినట్టు రూ.70 ఇచ్చేవారు. గ్రామంలో మూడు, నాలుగు వందల మంది పింఛన్‌కు అర్హులైన వారుంటే పదిమందికో, పదిహేనుమందికో ఇచ్చేవారు. మిగిలిన పింఛన్ల గురించి ఆర్డీవోను అడిగితే ఇప్పుడు ఇచ్చే 15 మందిలో ఎవరో ఒకరు చనిపోతేనే ఇంకో పింఛన్ ఇస్తామని చెప్పిన మాటలు నా చెవుల్లో మార్మోగుతున్నాయి. గ్రామాల్లో పేదలకు ఇళ్లు కట్టించే క్రమంలో మూడు, నాలుగు వందల ఇళ్లు అవసరం అయితే 10మందికి ఇచ్చేవారు.
ఇళ్లకోసం గ్రామస్తులు ఆర్డీవో దగ్గరకు వెళితే నియోజకవర్గానికి 500 ఇళ్లు మాత్రమే ఇచ్చారని, నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు సర్దుబాటు చేయాలంటే 5 ఇళ్లకంటే ఎక్కువ ఇవ్వలేమనే మాటలు నాకు గుర్తొస్తున్నాయి. చంద్రబాబు పాలన చేస్తున్న రోజుల్లో విశ్వసనీయత, నిజాయితీకి అర్థం లేదు. ఆయన ఎన్నికలకు ముందు ఓ మాట, ఎన్నికల తర్వాత ప్రజలతో నాకేం పనిలే అన్నట్టు మరో మాట చెప్తారు. ఇప్పుడు కూడా ఎన్నికలొస్తున్నాయికదా అని సాధ్యం కాని హామీలిస్తున్నాడు. రోజుకో అబద్ధం చెపుతున్నాడు. ఒకరోజు టీవీలు ఉచితంగా ఇస్తానంటాడు. మరోరోజు సెల్‌ఫోన్‌లు ఫ్రీ అంటాడు. రుణమాఫీ అంటాడు. డ్వాక్రా రుణాల మాఫీ అంటాడు. బుట్ట తీసుకుని మీ ఇంటికే వచ్చి అన్నీ ఫ్రీగా ఇస్తానంటాడు. పట్టపగలే ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్న బాబును చూస్తే నిజంగా రాజకీయాలు ఇంతగా దిగజారాయా అనిపిస్తుంది. ఇంతటి విశ్వసనీయత లేని వ్యక్తి చంద్రబాబునాయుడు.
ఇప్పుడు కాంగ్రెస్ పాలన కూడా అంతే. గత ఐదేళ్లలో ఒక్క రేషన్‌కార్డయినా ఇచ్చారా? ఒక్క పింఛన్ అయినా ఇచ్చారా? ఒక్క ఇల్లయినా కట్టించారా అని ఓటడిగేందుకు వచ్చే కాంగ్రెస్ నేతలను ప్రశ్నించండి. చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలో విశ్వసనీయత, నిజాయితీ అనే పదానికి అర్థం తేవాలి. నాయకుడు మాట ఇస్తే మడమ తిప్పడనే సంకేతాలివ్వాలి. నేను ఒకటే చెపుతున్నా. సీమాంధ్రకు సీఎంగా నేను ప్రమాణం చేస్తా. అయినా తెలంగాణను మాత్రం విడిచిపెట్టేది లేదు. వైఎస్ ప్రతి గుండెల్లో ఉన్నాడు.
ఇంతపెద్ద కుటుంబాన్ని నాకిచ్చి వెళ్లాడు. నేను ఒకటయితే చెపుతున్నా అక్కడ చేసే 11 కార్యక్రమాలు ఇక్కడ కూడా అమలుచేస్తాం. నా సోదరి షర్మిల త్వరలోనే తెలంగాణలో ఓదార్పు యాత్ర చేస్తుంది. ఓదార్పు యాత్ర ఎందుకంటే... మంచి నాయకుడు కావాలంటే ఎవరూ చూడని గ్రామాలను చూడాలి. ఎవరూ వెళ్లని పూరి గుడిసెల్లోకి వెళ్లాలి. అక్కడ అక్కచెల్లెళ్లు ఎలా బతుకుతున్నారో గమనించాలి. ఒకటి కాదు రెండు కాదు... నేను 800 ఇళ్లు తిరిగాను. ఓదార్పు యాత్ర నిర్వహించాను. రాష్ట్రంలో ఏ రాజకీయ నాయకుడికి తెలియని విషయాలు, పేదలగురించిన విషయాలు నాకు మాత్రమే తెలుసు. పేదల కష్టాలు తెలుసుకుంటేనే మంచి రాజకీయ నాయకుడవుతారు. ఏదిఏమైనా ఈ ఎన్నికలలో కలిసికట్టుగా ఒక్కటై దివంగత నేత, ప్రియతమ నాయకుడు వైఎస్ కలలు కన్న సువర్ణయుగాన్ని తీసుకువద్దాం. ఈ ఎన్నికల్లో ఒకవైపు నిజాయితీ, విశ్వసనీయత.., మరోవైపు కుట్రలు, కుతంత్రాల మధ్య పోటీ జరుగుతోంది. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు ఇచ్చి ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని కోరుతున్నా.’
కొత్తపార్టీ.. ఫ్యాన్ గుర్తు
జగన్ సభల్లో మాట్లాడుతూ....‘మీకు ఒకమాట చెపుతున్నా..... మన పార్టీ కొత్త పార్టీ. గుర్తు కొత్త గుర్తు. మన గుర్తు తెలియని వ్యక్తులు కూడా ఉంటారు. అందుకే చెపుతున్నా మన ఫ్యాన్ గుర్తు తెలిసిన వారు తెలియనివారికి చెప్పాలి. మీలో ఎంత మందికి ఫ్యాన్ గుర్తు తెలుసో చేతులు లేపండి’ అన్నప్పుడు ఆయా సభలకు హాజరైన వారిలో 99 శాతం మంది చేతులు లేపారు. దీంతో ఇంతమందికి గుర్తు తెలిసినందుకు చాలా ఆనందంగా ఉందని, అ యినా ఒక్కసారి మన ఫ్యాన్ గుర్తు చూపిస్తానని, చూడవలసిందిగా జగన్ విజ్ఞప్తి చేశారు. సభ నలువైపులా గుర్తు చూపిస్తూ అన్నా ఫ్యాన్.. తల్లీ ఫ్యాన్... అవ్వా ఫ్యాన్..అంటూ ఫ్యాన్ గుర్తుకు ఓట్లేయాల్సిందిగా అభ్యర్థించారు.
మీ చల్లని దీవెనలు కావాలి
Published Mon, Apr 28 2014 2:11 AM | Last Updated on Tue, Aug 14 2018 4:21 PM
Advertisement
Advertisement