ఆత్మవంచన
మనిషి దూరమైతే ఆత్మీయులు పడే బాధ మాటల్లో చెప్పలేనిది. కుటుంబ సభ్యుల్లో ఒకరిగా మెలిగిన నేత ప్రాణాలు కోల్పోతే
ఆ ప్రజల క్షోభ ఊహకందనిది. నిన్న మొన్నటి వరకు రాజకీయాల్లో కలసి నడిచిన నేత లేడంటే ఎలాంటి మనసులనైనా కదిలిస్తుంది. ఈ కోవలోనే ఆళ్లగడ్డ ప్రజల గుండెల్లో కొలువైన శోభా నాగిరెడ్డి రాజకీయంగా ఉన్నత స్థితికి చేరుకుంటున్నతరుణంలో ఓ రోడ్డు ప్రమాదం పొట్టన పెట్టుకుంది. ఆమె భౌతికంగా దూరమైనా ప్రజలు ఆమెకు గెలుపుతో ఘన నివాళులర్పించేందుకు కంకణబద్ధులయ్యారు. వీరంతా ఒక వైపుంటే.. స్వార్థ రాజకీయం మరోవైపు బరితెగించింది. పార్టీల కతీతంగా చేతులు కలిపింది. కాంగ్రెస్, టీడీపీ ఒక్కటై.. మన మధ్య లేని ఓ మహిళపై గెలుపునకు వ్యూహాలు పన్నడం అదే ప్రజలను ఆలోచింపజేస్తోంది.
- ఆళ్లగడ్డలో కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు
- దివంగత శోభమ్మపై గెలుపునకు బరితెగింపు
- స్వార్థ రాజకీయాలకు పరాకాష్ట అంటున్న ప్రజలు
- గెలుపుతో నివాళులర్పించేందుకు కంకణబద్ధులైన జనం
- ఎవరెన్ని కుట్రలు పన్నినా తీర్పు
- శోభమ్మదేనంటున్న వైనం
ఆళ్లగడ్డ, న్యూస్‌లైన్ : కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు రాజకీయాలకు ఆళ్లగడ్డ అసెంబ్లీ ఎన్నిక అద్దంపడుతోంది. ఆ పార్టీల చీకటి ఒప్పందం ప్రజల్లో నవ్వుల పాలవుతోంది. మాట తప్పని.. మడమ తిప్పని రాజకీయాలకు పెట్టింది పేరైన రాయలసీమలో ఆ నేతల తీరు విమర్శల పాలవుతోంది. వరుస ఓటమిని జీర్ణించుకోలేక విలువలకు తిలోదకాలివ్వడం ఓటర్లలో చర్చనీయాంశమవుతోంది. గంగుల సోదరుల్లో ఒకరు కాంగ్రెస్‌లోనే ఉండిపోగా.. మరొకరు టీడీపీతో జతకట్టారు. ఈ స్థానం నుంచి పోటీ చేయాలనుకుంటున్న ఇరిగెల రాంపుల్లారెడ్డి ఆశలపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు నీళ్లుచల్లి.. వలస నేతను బరిలో నిలపడం ఆయన వర్గీయులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు.
ఇక రాష్ట్ర విభజన విషయంలో కలిసి డ్రామా నడిపిన కాంగ్రెస్, టీడీపీల బాటలోనే ఆ పార్టీల ఆళ్లగడ్డ నాయకులు సైతం సరికొత్త డ్రామాకు తెరతీశారు. 2004లో కాంగ్రెస్ పార్టీలో చేరిన గంగుల ప్రతాప్‌రెడ్డి ఆ సంవత్సరం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009, 2012 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి శోభా నాగిరెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కారణం కావడంతో ఆ పార్టీ తరఫున పోటీ చేసినా గెలవలేమని.. పైగా ప్రజల్లో శోభా నాగిరెడ్డి పట్ల విశేష ఆదరణ ఉండటంతో ఈ విడత బరిలో నిలిచేందుకు ఆయన వెనుకడుగు వేశారు.
అయితే ఈయన సోదరుడు ప్రభాకర్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ పార్టీ తరఫున ఆళ్లగడ్డ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ప్రతాప్‌రెడ్డి మాత్రం ఇప్పటికీ కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నారు. మూడు రోజులుగా ఆళ్లగడ్డలో మకాం వేసిన ఆయన ఆరు మండలాల టీడీపీ నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించడం ఆ రెండు పార్టీల శ్రేణులను ఆశ్చర్యపరుస్తోంది. ప్రభాకర్‌రెడ్డిని గెలిపిస్తే ఆళ్లగడ్డ అభివృద్ధికి తాను హామీ అని పేర్కొంటుండటం గందరగోళానికి తావిస్తోంది.
ఆయన గెలిస్తే.. కాంగ్రెస్ పార్టీలోని ఈయన ఎలా అభివృద్ధి చేస్తారంటూ టీడీపీ నాయకులు, కార్యకర్తలు చెవులు కొరుక్కుంటున్నారు. ఇక కాంగ్రెస్‌కు రాజీనామా చేయకుండా టీడీపీ తరఫున ప్రచారం చేయడం ఇదెక్కడి రాజకీయమంటూ ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 2012 ఎన్నికల్లో పార్టీలు మారే నాయకులను గెలిపించొద్దని పిలుపునిచ్చిన ప్రతాప్‌రెడ్డి.. తన తమ్ముడి విషయానికొచ్చే సరికి పార్టీలకు అతీతంగా ప్రచారంలో పాల్గొంటుండటం చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.