సాక్షి ప్రతినిధి, గుంటూరు: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. జిల్లాలోని గుంటూరు, నరసరావుపేట, బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గాలతోపాటు 17 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులందరూ ప్రచారాన్ని ఉధృతం చేశారు. మిగతా పార్టీలకంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిలు జిల్లాలో ఇప్పటికే ప్రచారం పూర్తిచేశారు.
వారికి జిల్లావాసులు బ్రహ్మరథం పట్టారు. జగన్ ప్రసంగాలు వారిని ఆలోచింపజేశాయి. పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చిన తర్వాతే 2019లో ప్రజల ముందుకు వస్తామని ఆయన చేసిన ప్రకటన ప్రజల్లో విశ్వాసం నింపింది. అలాగే గుంటూరు, నరసరావుపేట, బాపట్ల పార్లమెంటు అభ్యర్థులు వల్లభనేని బాలశౌరి, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, డాక్టర్ అమృతపాణిలు ప్రచారంలో ముందున్నారు. ఆయా నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ అభ్యర్థులను సమన్వయం చేసుకుంటూ ప్రజల్లోకి వెళుతున్నారు.
టీడీపీ ప్రలోభాలతో ముందుకు... వైఎస్సార్‌సీపీకి ప్రజల్లో వస్తున్న స్పందన చూసిన టీడీపీ, కాంగ్రెస్ అభ్యర్థులు కొందరు ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ నాయకులు గ్రామాల్లోని ఇతర పార్టీలకు చెందిన కొంతమంది నాయకులను తమవైపుకు తిప్పుకోవడం, వారి ద్వారా ప్రజల్లోకి వెళ్లడం చేస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా మాకు ఓటువేయకున్నా సరే ఎన్నికల్లో ఓటింగ్‌కు దూరంగా ఉండేందుకు ఏం కావాలో చెప్పాలంటూ ప్రలోభాలకు గురిచేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.
ఇప్పటికే మద్యం పంపిణీ జోరుగా సాగుతుండగా డబ్బు, మహిళలకు చీరలు, యువతకు క్రికెట్ కిట్లు వంటి తాయిలాలు చూపుతున్నట్లు సమాచారం. నరసరావుపేట, సత్తెనపల్లి, నియోజకవర్గాల్లో ఈ తరహా ప్రలోభాలు ఎక్కువుగా ఉన్నాయి. ఇదే సమయంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో గెలుపుకోసం ఆరాటపడుతున్న ఓ నేత తన సామాజిక వర్గాల నాయకులను రంగంలోకి దింపారు. వారి ద్వారా ఓట్లు పొందేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. హోటళ్లు, ఫంక్షన్ హాల్స్‌లో తమకు అనుకూలంగా ఉన్న వారితో సభలు, సమావేశాలు ఏర్పాటు చేయిస్తున్నారు.
రంగంలోకి దిగిన పచ్చ ఎన్‌ఆర్‌ఐలు... ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ గెలుపుఖాయం కావడంతో తెలుగుదేశం పార్టీ చివరి వ్యూహాలను సిద్ధం చేస్తోంది. ఏదో ఒక విధంగా తిరుగుబాటు అభ్యర్థులను బరిలో నుంచి తప్పించిన నాయకులు ఇప్పుడు గెలుపు కోసం తెరవెనుక మంత్రాంగం చేస్తున్నారు. కొందరు అభ్యర్థులు అర్థబలం కోసం ఎన్‌ఆర్‌ఐలను ఆశ్రయిస్తున్నారు. నియోజకవర్గాల పరిధిలోని కొన్ని మండలాలను, గ్రామాలను దత్తత తీసుకోవాలని, అక్కడ గెలిపించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.
దీంతో ఇద్దరు, ముగ్గురు ఎన్‌ఆర్‌ఐలు ఒక మండలాన్ని దత్తత తీసుకొనేందుకు ముందుకు వస్తున్నట్లు సమాచారం. ఎన్నికల సంఘం నిఘా ఎక్కువగా ఉండటం, చెక్‌పోస్టుల వద్ద పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తుండటంతో అవసరమైన నిధులను మళ్లించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.