కాసు మహేష్‌రెడ్డికి నోటీసులు ఇస్తున్న పోలీసులు
పల్నాడులోని నడికుడి, కేశానుపల్లి, దాచేపల్లి ప్రాంతాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యే సాగించిన మైనింగ్ దందాలో నిజానిజాలను నిర్ధారించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన చలో దాచేపల్లి కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. టీడీపీ నాయకులు చేపట్టిన ర్యాలీకి అనుమతించిన పోలీసులు ప్రతిపక్ష వైఎస్సార్ సీపీకి మాత్రం ఆటంకాలు కల్పిస్తున్నారు. సభకు అనుమతి లేదని, క్వారీల్లోకి వెళ్లొద్దని పేర్కొంటూ పార్టీ నాయకులు, కార్యకర్తలకు నోటీసులు జారీ చేశారు. అధికార పార్టీ కనుసన్నల్లో పోలీసులు నడుస్తూ తమను అడ్డుకుంటున్నారని వైఎస్సార్ సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి.
సాక్షి, గుంటూరు : ప్రజాస్వామ్యంలో ప్రజల హక్కులు కాపాడాల్సిన పోలీసులు అధికార పార్టీ నేతల కనుసన్నల్లో పనిచేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పల్నాడు ప్రాంతంలో వారు అనుసరిస్తున్న తీరు ఇందుకు బలాన్నిస్తోంది. పల్నాడు ప్రాంతంలోకి నడికుడి, కేశానుపల్లి, దాచేపల్లి ప్రాంతాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ అక్రమ మైనింగ్‌కు
పాల్పడి వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని, ప్రకృతి వనరులను దోచుకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తడం, హైకోర్టు సైతం విచారణ జరపాలని ఆదేశించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో
ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ ఎమ్మెల్యే అక్రమ మైనింగ్ బాగోతాన్ని ప్రజల ముందు పెట్టేందుకు నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. అక్రమంగా తెల్ల రాయి తవ్వకాలు జరిగిన క్వారీలను సందర్శించి, దాచేపల్లి పట్టణంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి అక్రమ మైనింగ్ దోపిడీని ప్రజలకు తెలపాలని ‘చలో దాచేపల్లి’ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిజనిర్ధారణ కమిటీ అక్రమ మైనింగ్ ప్రాంతాల్లో సందర్శించి నిజాలు ఎక్కడ బయట పెడుతుందోనని భయపడిన అధికార పార్టీ నాయకులు పోలీసులపై ఒత్తిళ్లు తీసుకొచ్చారు. దీంతో నిజనిర్ధారణ కమిటీకి క్వారీల సందర్శన, బహిరంగ సభ ఏర్పాటుకు అనుమతులు లేవంటూ పోలీసులు ప్రకటించారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొనొద్దంటూ పార్టీ ముఖ్యనేతలకు పోలీసులు ముందస్తు నోటీసులు జారీచేశారు.
టీడీపీ నేతలు ఏం చేసినా ఓకే
ఇటీవల టీడీపీ నాయకులు పిడుగురాళ్ల, దాచేపల్లి పట్టణాల్లో నిరసనలు, ఆందోళనలు నిర్వహిస్తూ రోడ్లపై హల్‌చల్ చేసినా పోలీసులు పట్టించుకోలేదు. ఎమ్మెల్యే అక్రమ మైనింగ్ వ్యవహారాన్ని ఎండగడుతున్న ‘సాక్షి’ పత్రిక ప్రతులను రోడ్లపై దగ్ధం చేసినా చోద్యం చూశారే తప్ప అడ్డుకునే ప్రయత్నాలు కూడా చేయలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుచేస్తున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే అక్రమాలను బయటపెట్టేందుకు తాము శాంతి యుతంగా బహిరంగ సభ ఏర్పాటు చేసుకుంటున్న తరుణంలో శాంతి భద్రతలు గుర్తు వచ్చాయా అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీసు అధికారులను ప్రశ్నించినా స్పందించలేదు.
వైఎస్సార్‌సీపీ ముఖ్యనేతలకు నోటీసులు
టీడీపీ ఎమ్మెల్యే అక్రమ క్వారీయింగ్ జరిపిన ప్రాంతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిజనిర్ధాణ కమిటీ సందర్శన, దాచేపల్లిలో బహిరంగ సభ నిర్వహించనున్న నేపథ్యంలో పార్టీ నేతలకు పోలీసులు ఆదివారం ముందస్తు నోటీసులు జారీ చేశారు. గురజాల నియోజకవర్గ సమన్వయకర్త కాసు మహేష్‌రెడ్డి, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పార్టీ బీసీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి, మాజీ ఎమ్మెల్సీ టి.జి.వి.కృష్ణారెడ్డి, వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి, గురజాల నియోజకవర్గ నాయుకుడు ఎనుమల మురళీధర్‌రెడ్డి, జెడ్పిటీసీ సభ్యులు వీరభధ్రుని రామిరెడ్డి, మూలగుండ్ల ప్రకాష్‌రెడ్డి, రేపాల శ్రీనివాస్, రామారావు, జాకీర్‌హుస్సేన్, సిద్ధారపు గాంధీ, చల్లా పిచ్చిరెడ్డి, కొమ్మినేని వెంకటేశ్వర్లు, వీరారెడ్డి అమరారెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. మాచర్ల, గురజాల నియోజకవర్గాల్లోని అన్ని మండలాల్లోనూ 30 నుంచి 40 మంది వైఎస్సార్ సీపీ నాయకులకు పోలీసులకు నోటీసులు జారీ చేశారు.
సమాధానం కరువు
తమ పర్యటన, సభకు పోలీసులు నిరాకరించడం, నోటీసులు ఇవ్వడంపై స్పందిచిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇటీవల టీడీపీ కార్యకర్తల ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమాలకు ఏవిధంగా అనుమతులు మంజూరు చేశారని పోలీసులను నిలదీశారు. టీడీపీ కార్యకర్తలకు కూడా నోటీసులు మంజూరు చేశారా అని ప్రశ్నించారు. అయితే వారి నుంచి మౌనమే సమాధానమైంది. ఎవరు అడ్డుకునే ప్రయత్నం చేసినా పల్నాడు ప్రాంతంలోని అక్రమంగా తవ్వకాలు జరిగిన క్వారీలను వైఎస్సార్ సీపీ నిజనిర్ధారణ కమిటీ సందర్శిస్తుందని, దాచేపల్లి భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment