ఖాకీ సర్కార్‌ | Police Officials Stops Chalo Dachepalli In Guntur | Sakshi
Sakshi News home page

ఖాకీ సర్కార్‌

Published Tue, Aug 14 2018 12:51 PM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM

Police Officials Stops Chalo Dachepalli In Guntur - Sakshi

నారాయణపురం ఆర్‌అండ్‌బీ బంగ్లా సెంటర్‌లో కవాతు చేస్తున్న స్పెషల్‌ పార్టీ పోలీసులు

అడుగడుగునా భారీగా మోహరించిన పోలీసులు.. అర్ధరాత్రి నుంచే ముఖ్యనాయకుల గృహనిర్బంధాలు.. ఆపై నాయకులు, కార్యకర్తల అడ్డగింతలు.. అదేమని ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు.. ఇవీ అక్రమ మైనింగ్‌ జరిగిన క్వారీలను సందర్శిం చేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తలపెట్టిన చలో దాచేపల్లి కార్యక్ర మాన్ని భగ్నం చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు. టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అక్రమ మైనిం గ్‌ ద్వారా ఎంత మొత్తం దోచుకున్నారు, ఎన్ని వందల ఎకరాల్లో ప్రకృతి సంపద కనుమరుగైందో తేల్చేందుకు వైఎస్సార్‌ సీపీ నిజనిర్ధారణ కమిటీ దాచేపల్లి వెళ్లకుండా పోలీసులు అష్టదిగ్బంధం విధించారు. నాయకులు  దాచేపల్లి వైపు వెళ్లేందుకు వీలులేకుండా ఎమర్జెన్సీని తలపించేలా పోలీసులు ప్రవర్తించారు.  

సాక్షి,గుంటూరు/పిడుగురాళ్ల/మాచర్ల/దాచేపల్లి/కారంపూడి/తాడేపల్లిరూరల్‌ /పట్నంబజారు(గుంటూరు)/ఏఎన్‌యూ: అడుగడుగున అడ్డగింతలు.. అక్రమ అరెస్టులు.. గృహనిర్భందాలు.. అధి కార పార్టీ నేతల దాష్టీకానికి పరాకాష్టగా నిలి చాయి. అన్యాయం జరుగుతోందని.. అక్రమాలు రాజ్యమేలుతున్నాయని.. మైనింగ్‌ మాఫియాకు అమాయకులు బలైపోతున్న నేపథ్యంలో నిజాల నిగ్గుతేల్చేందుకు బయలుదేరిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతల అక్రమ అరెస్టుల పర్వానికి చంద్రబాబు సర్కారు తెరతీసింది. పల్నాడులోని గురజాల నియోజకవర్గం కేసానుపల్లి, నడికుడి, కోనంకి ప్రాంతాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అక్రమ మైనింగ్‌ నిర్వహించి వందల కోట్ల విలువ చేసే ప్రభుత్వ ధనాన్ని, ప్రకృతి వనరులను దోచుకున్న నిజాన్ని ప్రజలకు తెలిపేందుకు వెఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నిజనిర్ధారణ కమిటీగా క్వారీలను తనిఖీ చేసేం దుకు సోమవారం దాచేపల్లి వెళ్లాలని నిర్ణయిం చింది. చలో దాచేపల్లిలో పాల్గొనేందుకు బయలుదేరిన పార్టీ నాయకులను ఎక్కడికక్కడ పోలీసులు అరెస్టుచేసి బలవంతంగా పోలీసుస్టేషన్లకు తరలించారు. కొంత మంది నాయకులు ఇంటి నుంచి బయటకి రాకుండా గృహనిర్బంధం చేశారు. ఎమ్మెల్యే యరపతినేని ఆదేశాలతోనే క్వారీలకు వెళ్లొద్దంటూ వైఎస్సార్‌ సీపీ శ్రేణులకు ముందస్తు నోటీసులు ఇచ్చిన పోలీసులు ఆదివారం రాత్రి నుంచే పార్టీ నేతల నివాసాల వద్ద స్పెషల్‌ బ్రాంచి, ఇంటెలిజెన్స్‌ వర్గాలతో పూర్తి స్థాయిలో నిఘా ఉంచారు.

అక్రమ అరెస్టులు, గృహనిర్బంధాలు
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ నాయకులు చలో దాచేపల్లి కార్యక్రమం చేపట్టారు. వైఎస్సార్‌ సీపీ నాయకులు క్వారీలను సందర్శిస్తే అక్రమ మైనింగ్‌లో అధికార పార్టీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అవినీతి అక్రమాలు బట్టబయలు అవుతా యనే భయంతో ప్రభుత్వం పోలీసులను రంగంలోకి దించి అరెస్టుల పర్వానికి తెరతీసింది. విజ యవాడ నుంచి దాచేపల్లికి బయలుదేరిన పార్టీ సీనియర్‌ నేత, జిల్లా పరిశీలకుడు బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యే ముస్తఫా, గుంటూరు పార్లమెంట్‌ నియోజకవర్గ సమన్వయకర్త లావు శ్రీకృష్ణదేవరాయలు, నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, పెదకూరపాడు నియోజకవర్గ సమన్వయకర్త కావటి మనోహరనాయుడు, తెనాలి సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్, రాష్ట్ర కార్యదర్శి లాల్‌పురం రామును కాజ టోల్‌గేట్‌ వద్ద పోలీసులు అడ్డుకుని దుగ్గిరాల పోలీస్‌ స్టేషన్‌కు తరలిం చారు. మాచర్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణరెడ్డి, రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి పిన్నెల్లి వెంకటరామిరెడ్డిని గృహ నిర్బంధం చేశారు. మాజీ ఎమ్మెల్సీ టి.జి.వి.కృష్ణారెడ్డి హైదరాబాద్‌ నుంచి పిడుగురాళ్ల వస్తున్న క్రమంలో ఆయన వస్తున్న రైలును నడికుడిలో పోలీసులు అరగంటకుపైగా నిలిపి బలవంతంగా అరెస్టు చేసి గాది వారిపాలెంలోని ఆయన ఇంటికి తరలించారు.  నరసరావుపేట ఎమ్మెల్యే గొపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గురజాల నియోజకవర్గ సమన్వయకర్త కాసు మహేష్‌రెడ్డిని ఆదివారం అర్ధరాత్రి నుంచే గృహనిర్బంధం చేసి, బయటకు రాకుండా అడ్డుకున్నారు. బారికేడ్లు ఏర్పాటు చేసి పార్టీ నేతలు, కార్యకర్తలు అటువైపు రాకుండా అడ్డుకుని బెదిరింపులకు దిగారు.

ఎమ్మెల్యే పీఆర్కేకు సంఘీభావం
చలో దాచేపల్లి కార్యక్రమంలో పాల్గొన్నకుండా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిని ఆదివారం రాత్రి నుంచే పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు. ఈ సమాచారం తెలుసుకున్న జెడ్పీటీసీ సభ్యుడు శౌర్రెడ్డి గోపిరెడ్డి, మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్లు యరబోతుల శ్రీనివాసరావు, తాడి వెంకటేశ్వరరెడ్డి, సొసైటీ అధ్యక్షుడు గుంటక పెదచెన్నారెడ్డి, మున్సిపల్‌ మాజీ చైర్మన్లు  బత్తుల ఏడుకొండలు, కామనబోయిన కోటయ్యయాదవ్, పట్టణ పార్టీ అధ్యక్షుడు చుండూరి రోశయ్య, యూత్‌ కన్వీ నర్‌ తురకా కిషోర్, జిల్లా కార్యదర్శులు మారుమాముల శ్రీనివాసశర్మ, బండారు పరమేశ్వరరావు, పురపాలక సంఘ ఫ్లోర్‌లీడర్‌ రఘురామిరెడ్డి, నియోజకవర్గ మైనార్టీ కన్వీనర్‌ షేక్‌ కరిముల్లా, కౌన్సిలర్లు అన్నెం అనంతరావమ్మ, పోలా శ్రీనివాసరావుభారతి, బిజ్జం నాగలక్ష్మి, సుధాకర్‌రెడ్డి, వింజ మూరి రాణి, మహిళా అధ్యక్షురాలు బూదాల మరియమ్మ ఎమ్మెల్యే ఇంటికి వచ్చి సంఘీభావం తెలిపారు.

కాసు ఇంటికి చేరిన పార్టీ నేతలు
పోలీసులు ఎన్ని అడ్డంకులు కల్పించిన శాసన మండలిలో ప్రతిపక్షనేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మర్రి రాజశేఖర్, గురజాల నియోజకవర్గ నేత యనుముల మురళీధర్‌రెడ్డి భారీ ఎత్తున కార్యకర్తలను వెంటబెట్టుకుని సోమవారం మధ్యాహ్నానికి కాసు మహేష్‌రెడ్డి ఇంటికి చేరారు. అనంతరం పార్టీ నేతలంతా కార్యకర్తలతో కలిసి ‘చలో దాచేపల్లి’ అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీగా బయలుదేరారు. అప్పటికే భారీగా మోహరించిన పోలీసు బలగాలు, రోప్‌ పార్టీ, ఏఎన్‌ఎస్, టాస్కఫోర్స్‌ సిబ్బంది పార్టీ నేతలు, కార్యకర్తలను అడ్డుకునే ప్రయత్నాలు చేశాయి. దీంతో పోలీసులు, పార్టీ శ్రేణుల మధ్య తోపులాట జరిగి తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు ఎంతగా అడ్డుకున్నా చలో దాచేపల్లి నిర్వహించి తీరుతామని నాయకులు పట్టుబట్టారు. పోలీసులు ఎంతకీ అంగీకరించకపోవడంతో కనీసం తనను ఒక్కడినే దాచేపల్లి వెళ్లేందుకు అనుమతించాలని కాసు మహేష్‌రెడ్డి పట్టుబట్టినా పోలీసులు అంగీకరించలేదు. దీంతో రోడ్డుపైనే పోలీసులతో కాసు వాగ్వాదానికి దిగారు.

మాజీ ఎమ్మెల్సీ టీజీవి గృహనిర్భంధం
మాజీ ఎమ్మెల్సీ టి.జి.వి.కృష్ణారెడ్డిని సోమవారం ఆయన స్వగ్రామమైన గాదెవారిపల్లెలో పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు. జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో సికింద్రాబాదు నుంచి పిడుగురాళ్ల వస్తుండగా నడికుడి రైలే స్టేషన్‌లో బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. ఇందుకోసం 25 నిమిషాలపాటు రైలును ఆపివేశారు. అనంతరం ఆయన్ను కారంపూడి మండలంలోని గాదెవారిపల్లెలో ఆయన ఇంటిలో నిర్బంధించారు. సీఐ, ఎస్‌ఐ ఆధ్వర్యంలో స్పెషల్‌ పార్టీ పోలీసులు ఆయన ఇంటి వద్ద మోహరించారు. 

జంగా గృహనిర్భధం
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తిని పోలీసులు గృహనిర్బంధం విధించారు. దాచేపల్లిలో మృతిచెందిన తన  స్నేహితుడికి నివాళ్లర్పించేందుకు గుంటూరు నుంచి బయలుదేరిన జంగాను పోలీసులు వెంబ డించారు. సత్తెనపల్లిలో అడ్డగించగా తన స్నేహితుడు మృతిచెందటంతో దాచేపల్లి వెళ్తున్నానని జంగా చెప్పటంతో ఎస్కార్ట్‌గా ఒక కానిస్టేబుల్‌ను వెంట పంపించారు. దాచేపల్లిలో వెల్దుర్తి ఎస్‌ఐ శ్రీహరి తన సిబ్బందితో జంగాను వెంబడించారు. అనంతరం జంగా తన స్వగ్రామమైన గామాలపాడులోని ఇంటికి చేరుకున్న తరువాత పోలీసులు ఇంటిని చుట్టుముట్టారు. అప్పటికే జంగా కోసం కార్యకర్తలు, నాయకులు భారీగా తరలివచ్చారు. జంగాతో పాటుగా అక్కడ ఉన్న పార్టీ మండల కన్వీనర్‌ షేక్‌ జాకీర్‌హుస్సేన్, జెడ్పీటీసీ సభ్యుడు మూలగొండ్ల ప్రకాష్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌ బుర్రి విజయ్‌కుమార్‌రెడ్డితో పాటుగా 50మందికిపైగా నాయకులు, కార్యకర్తలను గృహనిర్భంధం చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు.

పల్నాడులో 144 సెక్షన్‌
వెఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నిజనిర్ధారణ కమిటీ  సందర్శించనున్న నేపథ్యంలో పోలీసులు పల్నాడు ప్రాంతంలో 144 సెక్షన్‌ విధించారు. మాచర్ల నియోజకవర్గంలో 33 మంది, గురజాల నియోజకవర్గంలో 79 మందిని అరెస్టు చేశారు. రోడ్లపైకి ఎవరూ రావద్దంటూ మైకుల్లో ప్రచారం చేశారు. దీంతో రోడ్డన్నీ నిర్మానుష్యంగా మారి అత్యవసర పరిస్థితిని తలపించాయి.

దుగ్గిరాల పోలీస్‌స్టేషన్‌ వద్ద ధర్నా
చలో దాచేపల్లిలో పాల్గొనేందుకు వెళ్తున్న వైఎస్సార్‌ సీపీ గుంటూరు జిల్లా ఇన్‌చార్జి బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యే ముస్తఫా, లేళ్ల అప్పిరెడ్డి తదితరులను కాజ టోల్‌గేట్‌ వద్ద పోలీ సులు సోమవారం అరెస్టుచేసి దుగ్గిరాల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సమాచారం తెలుసుకున్న ఎంపీపీ యేళ్ల జయలక్ష్మి, జెడ్పీటీసీ సభ్యురాలు చల్లపల్లి భారతీదేవి, పార్టీ కన్వీనర్‌ సాయిబాబు, భారీ సంఖ్యలో  కార్యకర్తలు పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. లోనికి వెళ్తుండగా పోలీసులు అడ్డుకోవడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. ఆందోళన విరమించాలని, లేకుంటే అరెస్టు చేస్తామంటూ పేర్లు రాసుకుని బెదిరించారు. అయితే తమ నాయకులను విడుదల చేయాలని ఆందోళనకారులు డిమాండ్‌ చేశారు. పోలీసులు పట్టించుకోకుండా వారిని బలవంతంగా అక్కడి నుంచి ఖాళీచేయించారు. వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర చేనేత విభాగం అధ్యక్షుడు చిల్లపల్లి మోహనరావు, నాయకులు మున్నంగి గోపిరెడ్డి, మునగాల మల్లేశ్వరరావు, పాటిబండ్ల కృష్ణమూర్తి, మాజీ ఎంపీపీ వెనిగళ్ల శ్రీకృష్ణప్రసాద్, మార్కెట్‌యార్డ్‌ మాజీ చైర్మన్‌ కొరటాల సురేష్, ఎంపీటీసీ సభ్యులు రజనీకాంత్, వీరరాఘవయ్య, సర్పంచ్‌ రత్నం ఆందోళనలో పాల్గొన్నారు.

దాచేపల్లి, నడికుడిని జల్లెడపట్టిన పోలీసులు
ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆధ్వర్యం లో జరుగుతున్న అక్రమమైనింగ్‌ నిగ్గుతేల్చేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన చలో దాచేపల్లి కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు దాచేపల్లి, నడికుడి గ్రామాలను జల్లెడపట్టారు. జిల్లా అడిషనల్‌ ఎస్పీ ఎస్‌.వి.డి.ప్రసాద్‌ పర్యవేక్షణలో పలువురు డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు, ఏఎస్‌ఐలు, కానిస్టేబుళ్లు, 400మందికిపైగా స్పెషల్‌పార్టీ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ముఖ్య ప్రాంతాల్లో చెక్‌పోస్ట్‌లు ఏర్పా టుచేసి నాయకులు, కార్యకర్తల కదలికలను గమనించారు. పార్టీ మండల కన్వీనర్‌ షేక్‌ జాకీర్‌హుస్సేన్, పట్టణ కన్వీనర్‌ మునగా పున్నారావు, జెడ్పీటీసీ సభ్యుడు మూలగొండ్ల ప్రకాష్‌రెడ్డితో పాటుగా పలువురికి ముందస్తుగానే పోలీసులు నోటీసులు ఇచ్చారు. అర్ధరాత్రి నుంచి మునగా పున్నారావు, మాజీ ఎంపీపీలు అంబటి శేషగిరిరావు, కొప్పుల సాంబయ్య, నాయకులు మందపాటి రమేష్‌రెడ్డి, జంగా సైదులు, మునగా శ్రీనివాసరావు, ఉల్లేరు హనుమంతరావు, బత్తుల బయ్యన్నను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. రమేష్‌రెడ్డిని అదుపులోకి తీసుకొంటుండగా కుటుంబసభ్యులు అడ్డుపడ్డారు. మరికొందరు నాయకుల కోసం పోలీసులు  గాలించారు. పలువురు పోలీసులు తమ దుస్తులకు కెమెరాలు పెట్టుకుని నాయకుల రాకపోకలను చిత్రీకరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement