dachepalli
-
పల్నాడుజిల్లా దాచేపల్లిలో రెచ్చిపోయిన జనసేన కార్యకర్తలు
-
దాచేపల్లి మోడల్ స్కూల్ సమీపంలో వ్యక్తి దారుణ హత్య
-
కుక్కను తప్పించబోయి.. డివైడర్‌ను ఢీకొట్టిన కారు
ఇలా జరిగింది..: రోడ్డుకు అడ్డంగా వచ్చిన కుక్కను తప్పించబోయి కారు డివైడర్‌ను ఢీకొట్టి.. ముందుకు దూసుకెళ్లి పల్టీలు కొట్టడంతో ప్రమాదం జరిగింది. ఎప్పుడు.. ఎక్కడ: గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం గామాలపాడు వద్ద సోమవారం ఈ ఘటన జరిగింది. పర్యవసానం: అతి వేగం వల్ల ముగ్గురు అక్కడికక్కడే మృతి. ఇద్దరికి తీవ్ర గాయాలు. మృతుల్లో ఇద్దరు తల్లీకూతుళ్లు. దాచేపల్లి(గురజాల): గుంటూరు జిల్లాలో సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. కుక్కను తప్పించబోయి డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. పల్టీలు కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. తెలంగాణలోని శంషాబాద్ సమీపంలో ఉన్న ఓ ఇంజనీరింగ్ కాలేజీలో తెలపల వెంకట రమణమ్మ(46), ఆమె కుమారుడు వేణు స్వీపర్లుగా పనిచేసేవారు. వెంకట రమణమ్మ వద్ద శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గుండలమ్మపాలేనికి చెందిన ఆమె తల్లి యకసిరి రమణమ్మ(71) కూడా ఉంటోంది. ఈ నేపథ్యంలో రమణమ్మ, వెంకట రమణమ్మ, ఆమె కుమారుడు వేణు, అతని స్నేహితుడు సందీప్ యాదవ్, డ్రైవర్ శ్రీకాంత్(19) సోమవారం కారులో గుండలమ్మపాలేనికి బయల్దేరారు. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం గామాలపాడు సమీపంలోని పెట్రోల్ బంక్ వద్దకు రాగానే.. రోడ్డుకు అడ్డుగా వెళ్తున్న కుక్కను తప్పించేందుకు శ్రీకాంత్ కారును పక్కకు తిప్పాడు. దీంతో కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి.. పల్టీలు కొడుతూ సమీపంలోని ఓ దుకాణంపై పడింది. దీంతో రమణమ్మ, డ్రైవర్ శ్రీకాంత్ అక్కడికక్కడే మృతిచెందగా.. గురజాల ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ వెంకట రమణమ్మ మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన వేణు, సందీప్‌కు గురజాల ఆస్పత్రిలో వైద్యం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నట్లు సీఐ ఉమేష్, ఎస్ఐ బాలనాగిరెడ్డి చెప్పారు. -
గ్రామస్థులపై దాడి, నిరసనగా ధర్నా
సాక్షి, గుంటూరు: జిల్లాలోని దాచేపల్లి మండలం పెదగార్లపాడులో ఉద్రిక్తత నెలకొంది. కరోనా కారణంగా లాక్డౌన్ విధించడంతో చాలా మంది ఉపాధి కోల్పొయి తిండి కూడా లేక ఇబ్బంది పడుతున్నారు. ఇక వలస కార్మికుల విషయానికి వస్తే సొంత గ్రామాలకు వెళ్లలేక ఉన్న చోట ఉపాధిలేక, ఆహారం దొరకక, తలదాచుకోవడానికి నీడ లేక చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. చెట్టినాడు సిమెంట్ ఫ్యాకర్టీలో బీహార్ నుంచి వచ్చిన చాలా మంది కార్మికులు పని చేస్తోన్నారు. (యాక్టివ్ కేసుల కంటే డిశ్చార్జ్ కేసులే ఎక్కువ) అయితే లాక్డౌన్ కారణంగా వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి పరిస్థితి ఎలా ఉందో చూడటానికి బుధవారం పెదగార్లపాడు గ్రామస్థులు వారి వద్దకు వెళ్లారు. వారికి సాయం అందించాలనే ఉద్దేశంతో గ్రామస్తులు అక్కడికి వెళ్లగా వారిపై సిమెంట్ ఫ్యాక్టరీ సెక్యూరిటీ సిబ్బంది దాడికి పాల్పడింది. దీంతో గ్రామస్థులు దాడికి నిరసనగా ఫ్యాక్టరీ ఎదుట ధర్నాకి దిగారు. కరోనా కారణంగా సామాజిక దూరం పాటించాల్సిన సమయంలో ఇలా జరగడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. (ఆర్టీసీ బస్సులకు గ్రీన్ సిగ్నల్..) -
లైంగిక దాడి ఘటనపై సీఎం జగన్ సీరియస్
సాక్షి, నరసరావుపేట: గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడు గ్రామంలో జరిగిన ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులు ఎంతటివారైనా చట్టపరంగా వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా డీజీపీకి, కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో మరెక్కడా ఇలాంటి ఘటనలు జరగడానికి వీల్లేకుండా కఠినంగా వ్యవహరించాలని పోలీసులు, అధికారులను సీఎం ఆదేశించారు. ప్రభుత్వం తరపున బాధిత బాలికకి అండగా నిలవాలన్నారు. ఈ ఘటనపై హోంమంత్రి సుచరిత మాట్లాడుతూ.. లైంగిక దాడి జరిగిన 24 గంటల్లోనే నిందితుడిని అరెస్ట్ చేశాం. చట్టపరంగా చర్యలు తీసుకోమని అధికారులను ఆదేశించాం. ప్రస్తుతం బాలిక ఆసుపత్రిలో కోలుకుంటోంది. ప్రభుత్వం తరపున బాధితురాలి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని తెలిపారు. లైంగిక దాడికి గురైన బాధిత బాలిక కుటుంబాన్ని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ నిన్న (శుక్రవారం) పరామర్శించారు. ప్రభుత్వం నుంచి సహాయం సత్వరం అందే విధంగా కృషి చేయడంతో పాటూ, గ్రామంలో రక్షణ కూడా కల్పిస్తామని వెల్లడించారు. లైంగిక దాడికి గురై నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న ఆరేళ్ల బాలికను పరామర్శించి, సంఘటన గురించి బాలిక తల్లితండ్రుల్ని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అండగా ఉంటుందని, ధైర్యంగా ఉండాలని చెప్పారు. ఈ సందర్భంగా ఆమె విలేకర్లతో మాట్లాడుతూ జరిగిన సంఘటనపై జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్‌కుమార్‌తో మాట్లాడానని చెప్పారు. బాధితులకు ప్రభుత్వం నుంచి సహాయం పూర్తిస్థాయిలో అందే విధంగా మహిలా కమిషన్ చొరవ తీసుకుంటుందని తెలిపారు. పోలీసు నివేదిక అందగానే ఆ కుటుంబానికీ మొదట కొంత మొత్తంలో ఆర్థిక సాయం అందుతుందని, చార్జిషీటు పెట్టిన తర్వాత మరికొంత అందుతుందని చెప్పారు. బాలిక పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించాలని గైనకాలజిస్టుకు ఆదేశాలు ఇచ్చామన్నారు. పల్నాడు ప్రాంతంలోని దాచేపల్లిలో ఇటువంటి సంఘటనలు గతంలో జరిగాయని, మళ్లీ పునరావృతం కావడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడి ఎస్ఐతో మాట్లాడామన్నారు. నిందితుడిని అరెస్టు చేసినట్లు చెప్పారన్నారు. గ్రామ వలంటీర్ల ద్వారా ఇటువంటి దుశ్చర్యలపై తల్లితండ్రులు, బాలికలకు అవగాహన కల్పించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. నిందితులకు కఠినమైన శిక్షలు పడే విధంగా మహిళా కమిషన్ తరఫున ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. నిందితుడి వయస్సుపై వస్తున్న ఆరోపణలపై కూడా మహిళా కమిషన్ విచారిస్తుందని తెలిపారు. గ్రామంలో ఆ కుటుంబానికీ రక్షణ కోసం జిల్లా ఎస్పీతో మాట్లాడతానని చెప్పారు. ప్రభుత్వం ఎవరినీ వెనకేసుకు రాదని హామీ ఇచ్చారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం గాకుండా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని ఆమె కోరారు. -
సీబీఐ విచారణతో టీడీపీలో ఉలికిపాటు
సాక్షి, గుంటూరు: గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమ మైనింగ్ వ్యవహారంపై నిగ్గుతేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు అంగీకరించటం సర్వత్రా చర్చనీయాంశమైంది. గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో దాచేపల్లి మండలం కేశానుపల్లి, నడికుడి, పిడుగురాళ్ల మండలం కొనంకి, సీతారామపురంలో ఐదేళ్లపాటు యథేచ్ఛగా జరిగిన అక్రమ మైనింగ్‌పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో రాష్ట్ర మంత్రివర్గం సీబీఐ విచారణకు ఆమోదం తెలపటంతో టీడీపీ నేతలు హడలెత్తిపోతున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు జోరుగా జరిగిన అక్రమ మైనింగ్ ద్వారా 32 లక్షల టన్నుల ఖనిజ సంపద దోచుకున్నారని లోకాయుక్త, సీబీ సీఐడీ అధికారులు నిర్ధారించారు. అక్రమ మైనింగ్ ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన వందల కోట్ల రూపాయలకు గండికొట్టారని విచారణలో తేలింది. తాజాగా రాష్ట్ర మంత్రి వర్గం భేటీలో సీబీఐ విచారణకు అంగీకారం తెలుపుతూ కీలక నిర్ణయం తీసుకోవటంతో స్థానికంగా ప్రజలు చర్చించుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదేననే అభిప్రాయం ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. సీబీఐ విచారణ జరిగితే అక్రమ మైనింగ్ వ్యవహారంలో పూర్తిస్థాయి నిజాలు ప్రజలకు తెలుస్తాయని పేర్కొంటున్నారు. ఇది చదవండి : యరపతినేని అక్రమ మైనింగ్‌పై సీబీ‘ఐ’ తిన్నదంతా రాబట్టాల్సిందే.. గత టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు దగ్గర నుంచి యరపతినేని వరకు అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారు. ఈ రోజు అక్రమ మైనింగ్ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించింది. అక్రమ మైనింగ్‌లో తిన్నదంతా కక్కితీరాల్సిందే. అక్రమ మైనింగ్ వలన ప్రభుత్వం, ప్రజలకు జరిగిన నష్టం వడ్డీతో సహ వసూలు చేయాలి. దోషులు ఎంతటివారైనా కఠినంగా శిక్షించాల్సిందే. –షేక్ జాకీర్‌హుస్సేన్, దాచేపల్లి అక్రమార్కులను బయటపెట్టాలి అక్రమ మైనింగ్ వ్యవహారంలో టీడీపీ నాయకులు చేసిన అక్రమాలన్నింటినీ బయటపెట్టాలి. సీఐడీ విచారణ పూర్తిస్థాయిలో అక్రమాలను గుర్తించలేకపోయారు. సీఐడీ విచారణపై కూడా అనుమానాలు లేకపోలేదు. సీబీఐ విచారణ ద్వారానే అక్రమ మైనింగ్ వ్యవహారం వెలుగులోకి వస్తుందని భావిస్తున్నాం. –మోమిన్ నాగుల్‌మీరా, కేసానుపల్లి -
ఖాకీ సర్కార్
అడుగడుగునా భారీగా మోహరించిన పోలీసులు.. అర్ధరాత్రి నుంచే ముఖ్యనాయకుల గృహనిర్బంధాలు.. ఆపై నాయకులు, కార్యకర్తల అడ్డగింతలు.. అదేమని ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు.. ఇవీ అక్రమ మైనింగ్ జరిగిన క్వారీలను సందర్శిం చేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన చలో దాచేపల్లి కార్యక్ర మాన్ని భగ్నం చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు. టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అక్రమ మైనిం గ్ ద్వారా ఎంత మొత్తం దోచుకున్నారు, ఎన్ని వందల ఎకరాల్లో ప్రకృతి సంపద కనుమరుగైందో తేల్చేందుకు వైఎస్సార్ సీపీ నిజనిర్ధారణ కమిటీ దాచేపల్లి వెళ్లకుండా పోలీసులు అష్టదిగ్బంధం విధించారు. నాయకులు దాచేపల్లి వైపు వెళ్లేందుకు వీలులేకుండా ఎమర్జెన్సీని తలపించేలా పోలీసులు ప్రవర్తించారు. సాక్షి,గుంటూరు/పిడుగురాళ్ల/మాచర్ల/దాచేపల్లి/కారంపూడి/తాడేపల్లిరూరల్ /పట్నంబజారు(గుంటూరు)/ఏఎన్‌యూ: అడుగడుగున అడ్డగింతలు.. అక్రమ అరెస్టులు.. గృహనిర్భందాలు.. అధి కార పార్టీ నేతల దాష్టీకానికి పరాకాష్టగా నిలి చాయి. అన్యాయం జరుగుతోందని.. అక్రమాలు రాజ్యమేలుతున్నాయని.. మైనింగ్ మాఫియాకు అమాయకులు బలైపోతున్న నేపథ్యంలో నిజాల నిగ్గుతేల్చేందుకు బయలుదేరిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల అక్రమ అరెస్టుల పర్వానికి చంద్రబాబు సర్కారు తెరతీసింది. పల్నాడులోని గురజాల నియోజకవర్గం కేసానుపల్లి, నడికుడి, కోనంకి ప్రాంతాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అక్రమ మైనింగ్ నిర్వహించి వందల కోట్ల విలువ చేసే ప్రభుత్వ ధనాన్ని, ప్రకృతి వనరులను దోచుకున్న నిజాన్ని ప్రజలకు తెలిపేందుకు వెఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిజనిర్ధారణ కమిటీగా క్వారీలను తనిఖీ చేసేం దుకు సోమవారం దాచేపల్లి వెళ్లాలని నిర్ణయిం చింది. చలో దాచేపల్లిలో పాల్గొనేందుకు బయలుదేరిన పార్టీ నాయకులను ఎక్కడికక్కడ పోలీసులు అరెస్టుచేసి బలవంతంగా పోలీసుస్టేషన్లకు తరలించారు. కొంత మంది నాయకులు ఇంటి నుంచి బయటకి రాకుండా గృహనిర్బంధం చేశారు. ఎమ్మెల్యే యరపతినేని ఆదేశాలతోనే క్వారీలకు వెళ్లొద్దంటూ వైఎస్సార్ సీపీ శ్రేణులకు ముందస్తు నోటీసులు ఇచ్చిన పోలీసులు ఆదివారం రాత్రి నుంచే పార్టీ నేతల నివాసాల వద్ద స్పెషల్ బ్రాంచి, ఇంటెలిజెన్స్ వర్గాలతో పూర్తి స్థాయిలో నిఘా ఉంచారు. అక్రమ అరెస్టులు, గృహనిర్బంధాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ నాయకులు చలో దాచేపల్లి కార్యక్రమం చేపట్టారు. వైఎస్సార్ సీపీ నాయకులు క్వారీలను సందర్శిస్తే అక్రమ మైనింగ్‌లో అధికార పార్టీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అవినీతి అక్రమాలు బట్టబయలు అవుతా యనే భయంతో ప్రభుత్వం పోలీసులను రంగంలోకి దించి అరెస్టుల పర్వానికి తెరతీసింది. విజ యవాడ నుంచి దాచేపల్లికి బయలుదేరిన పార్టీ సీనియర్ నేత, జిల్లా పరిశీలకుడు బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యే ముస్తఫా, గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త లావు శ్రీకృష్ణదేవరాయలు, నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, పెదకూరపాడు నియోజకవర్గ సమన్వయకర్త కావటి మనోహరనాయుడు, తెనాలి సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్, రాష్ట్ర కార్యదర్శి లాల్పురం రామును కాజ టోల్గేట్ వద్ద పోలీసులు అడ్డుకుని దుగ్గిరాల పోలీస్ స్టేషన్‌కు తరలిం చారు. మాచర్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణరెడ్డి, రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి పిన్నెల్లి వెంకటరామిరెడ్డిని గృహ నిర్బంధం చేశారు. మాజీ ఎమ్మెల్సీ టి.జి.వి.కృష్ణారెడ్డి హైదరాబాద్ నుంచి పిడుగురాళ్ల వస్తున్న క్రమంలో ఆయన వస్తున్న రైలును నడికుడిలో పోలీసులు అరగంటకుపైగా నిలిపి బలవంతంగా అరెస్టు చేసి గాది వారిపాలెంలోని ఆయన ఇంటికి తరలించారు. నరసరావుపేట ఎమ్మెల్యే గొపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గురజాల నియోజకవర్గ సమన్వయకర్త కాసు మహేష్‌రెడ్డిని ఆదివారం అర్ధరాత్రి నుంచే గృహనిర్బంధం చేసి, బయటకు రాకుండా అడ్డుకున్నారు. బారికేడ్లు ఏర్పాటు చేసి పార్టీ నేతలు, కార్యకర్తలు అటువైపు రాకుండా అడ్డుకుని బెదిరింపులకు దిగారు. ఎమ్మెల్యే పీఆర్కేకు సంఘీభావం చలో దాచేపల్లి కార్యక్రమంలో పాల్గొన్నకుండా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిని ఆదివారం రాత్రి నుంచే పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఈ సమాచారం తెలుసుకున్న జెడ్పీటీసీ సభ్యుడు శౌర్రెడ్డి గోపిరెడ్డి, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్లు యరబోతుల శ్రీనివాసరావు, తాడి వెంకటేశ్వరరెడ్డి, సొసైటీ అధ్యక్షుడు గుంటక పెదచెన్నారెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్లు బత్తుల ఏడుకొండలు, కామనబోయిన కోటయ్యయాదవ్, పట్టణ పార్టీ అధ్యక్షుడు చుండూరి రోశయ్య, యూత్ కన్వీ నర్ తురకా కిషోర్, జిల్లా కార్యదర్శులు మారుమాముల శ్రీనివాసశర్మ, బండారు పరమేశ్వరరావు, పురపాలక సంఘ ఫ్లోర్‌లీడర్ రఘురామిరెడ్డి, నియోజకవర్గ మైనార్టీ కన్వీనర్ షేక్ కరిముల్లా, కౌన్సిలర్లు అన్నెం అనంతరావమ్మ, పోలా శ్రీనివాసరావుభారతి, బిజ్జం నాగలక్ష్మి, సుధాకర్‌రెడ్డి, వింజ మూరి రాణి, మహిళా అధ్యక్షురాలు బూదాల మరియమ్మ ఎమ్మెల్యే ఇంటికి వచ్చి సంఘీభావం తెలిపారు. కాసు ఇంటికి చేరిన పార్టీ నేతలు పోలీసులు ఎన్ని అడ్డంకులు కల్పించిన శాసన మండలిలో ప్రతిపక్షనేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మర్రి రాజశేఖర్, గురజాల నియోజకవర్గ నేత యనుముల మురళీధర్‌రెడ్డి భారీ ఎత్తున కార్యకర్తలను వెంటబెట్టుకుని సోమవారం మధ్యాహ్నానికి కాసు మహేష్‌రెడ్డి ఇంటికి చేరారు. అనంతరం పార్టీ నేతలంతా కార్యకర్తలతో కలిసి ‘చలో దాచేపల్లి’ అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీగా బయలుదేరారు. అప్పటికే భారీగా మోహరించిన పోలీసు బలగాలు, రోప్ పార్టీ, ఏఎన్ఎస్, టాస్కఫోర్స్ సిబ్బంది పార్టీ నేతలు, కార్యకర్తలను అడ్డుకునే ప్రయత్నాలు చేశాయి. దీంతో పోలీసులు, పార్టీ శ్రేణుల మధ్య తోపులాట జరిగి తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు ఎంతగా అడ్డుకున్నా చలో దాచేపల్లి నిర్వహించి తీరుతామని నాయకులు పట్టుబట్టారు. పోలీసులు ఎంతకీ అంగీకరించకపోవడంతో కనీసం తనను ఒక్కడినే దాచేపల్లి వెళ్లేందుకు అనుమతించాలని కాసు మహేష్‌రెడ్డి పట్టుబట్టినా పోలీసులు అంగీకరించలేదు. దీంతో రోడ్డుపైనే పోలీసులతో కాసు వాగ్వాదానికి దిగారు. మాజీ ఎమ్మెల్సీ టీజీవి గృహనిర్భంధం మాజీ ఎమ్మెల్సీ టి.జి.వి.కృష్ణారెడ్డిని సోమవారం ఆయన స్వగ్రామమైన గాదెవారిపల్లెలో పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు. జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో సికింద్రాబాదు నుంచి పిడుగురాళ్ల వస్తుండగా నడికుడి రైలే స్టేషన్లో బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. ఇందుకోసం 25 నిమిషాలపాటు రైలును ఆపివేశారు. అనంతరం ఆయన్ను కారంపూడి మండలంలోని గాదెవారిపల్లెలో ఆయన ఇంటిలో నిర్బంధించారు. సీఐ, ఎస్ఐ ఆధ్వర్యంలో స్పెషల్ పార్టీ పోలీసులు ఆయన ఇంటి వద్ద మోహరించారు. జంగా గృహనిర్భధం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తిని పోలీసులు గృహనిర్బంధం విధించారు. దాచేపల్లిలో మృతిచెందిన తన స్నేహితుడికి నివాళ్లర్పించేందుకు గుంటూరు నుంచి బయలుదేరిన జంగాను పోలీసులు వెంబ డించారు. సత్తెనపల్లిలో అడ్డగించగా తన స్నేహితుడు మృతిచెందటంతో దాచేపల్లి వెళ్తున్నానని జంగా చెప్పటంతో ఎస్కార్ట్‌గా ఒక కానిస్టేబుల్‌ను వెంట పంపించారు. దాచేపల్లిలో వెల్దుర్తి ఎస్ఐ శ్రీహరి తన సిబ్బందితో జంగాను వెంబడించారు. అనంతరం జంగా తన స్వగ్రామమైన గామాలపాడులోని ఇంటికి చేరుకున్న తరువాత పోలీసులు ఇంటిని చుట్టుముట్టారు. అప్పటికే జంగా కోసం కార్యకర్తలు, నాయకులు భారీగా తరలివచ్చారు. జంగాతో పాటుగా అక్కడ ఉన్న పార్టీ మండల కన్వీనర్ షేక్ జాకీర్‌హుస్సేన్, జెడ్పీటీసీ సభ్యుడు మూలగొండ్ల ప్రకాష్‌రెడ్డి, మాజీ సర్పంచ్ బుర్రి విజయ్‌కుమార్‌రెడ్డితో పాటుగా 50మందికిపైగా నాయకులు, కార్యకర్తలను గృహనిర్భంధం చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. పల్నాడులో 144 సెక్షన్ వెఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిజనిర్ధారణ కమిటీ సందర్శించనున్న నేపథ్యంలో పోలీసులు పల్నాడు ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు. మాచర్ల నియోజకవర్గంలో 33 మంది, గురజాల నియోజకవర్గంలో 79 మందిని అరెస్టు చేశారు. రోడ్లపైకి ఎవరూ రావద్దంటూ మైకుల్లో ప్రచారం చేశారు. దీంతో రోడ్డన్నీ నిర్మానుష్యంగా మారి అత్యవసర పరిస్థితిని తలపించాయి. దుగ్గిరాల పోలీస్‌స్టేషన్ వద్ద ధర్నా చలో దాచేపల్లిలో పాల్గొనేందుకు వెళ్తున్న వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా ఇన్చార్జి బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యే ముస్తఫా, లేళ్ల అప్పిరెడ్డి తదితరులను కాజ టోల్గేట్ వద్ద పోలీ సులు సోమవారం అరెస్టుచేసి దుగ్గిరాల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సమాచారం తెలుసుకున్న ఎంపీపీ యేళ్ల జయలక్ష్మి, జెడ్పీటీసీ సభ్యురాలు చల్లపల్లి భారతీదేవి, పార్టీ కన్వీనర్ సాయిబాబు, భారీ సంఖ్యలో కార్యకర్తలు పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. లోనికి వెళ్తుండగా పోలీసులు అడ్డుకోవడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. ఆందోళన విరమించాలని, లేకుంటే అరెస్టు చేస్తామంటూ పేర్లు రాసుకుని బెదిరించారు. అయితే తమ నాయకులను విడుదల చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. పోలీసులు పట్టించుకోకుండా వారిని బలవంతంగా అక్కడి నుంచి ఖాళీచేయించారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర చేనేత విభాగం అధ్యక్షుడు చిల్లపల్లి మోహనరావు, నాయకులు మున్నంగి గోపిరెడ్డి, మునగాల మల్లేశ్వరరావు, పాటిబండ్ల కృష్ణమూర్తి, మాజీ ఎంపీపీ వెనిగళ్ల శ్రీకృష్ణప్రసాద్, మార్కెట్‌యార్డ్ మాజీ చైర్మన్ కొరటాల సురేష్, ఎంపీటీసీ సభ్యులు రజనీకాంత్, వీరరాఘవయ్య, సర్పంచ్ రత్నం ఆందోళనలో పాల్గొన్నారు. దాచేపల్లి, నడికుడిని జల్లెడపట్టిన పోలీసులు ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆధ్వర్యం లో జరుగుతున్న అక్రమమైనింగ్ నిగ్గుతేల్చేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన చలో దాచేపల్లి కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు దాచేపల్లి, నడికుడి గ్రామాలను జల్లెడపట్టారు. జిల్లా అడిషనల్ ఎస్పీ ఎస్.వి.డి.ప్రసాద్ పర్యవేక్షణలో పలువురు డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు, ఏఎస్ఐలు, కానిస్టేబుళ్లు, 400మందికిపైగా స్పెషల్‌పార్టీ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ముఖ్య ప్రాంతాల్లో చెక్‌పోస్ట్‌లు ఏర్పా టుచేసి నాయకులు, కార్యకర్తల కదలికలను గమనించారు. పార్టీ మండల కన్వీనర్ షేక్ జాకీర్‌హుస్సేన్, పట్టణ కన్వీనర్ మునగా పున్నారావు, జెడ్పీటీసీ సభ్యుడు మూలగొండ్ల ప్రకాష్‌రెడ్డితో పాటుగా పలువురికి ముందస్తుగానే పోలీసులు నోటీసులు ఇచ్చారు. అర్ధరాత్రి నుంచి మునగా పున్నారావు, మాజీ ఎంపీపీలు అంబటి శేషగిరిరావు, కొప్పుల సాంబయ్య, నాయకులు మందపాటి రమేష్‌రెడ్డి, జంగా సైదులు, మునగా శ్రీనివాసరావు, ఉల్లేరు హనుమంతరావు, బత్తుల బయ్యన్నను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. రమేష్‌రెడ్డిని అదుపులోకి తీసుకొంటుండగా కుటుంబసభ్యులు అడ్డుపడ్డారు. మరికొందరు నాయకుల కోసం పోలీసులు గాలించారు. పలువురు పోలీసులు తమ దుస్తులకు కెమెరాలు పెట్టుకుని నాయకుల రాకపోకలను చిత్రీకరించారు. -
హత్యాచార భారతం
-
రోడ్లపైకి వస్తేనే న్యాయం చేస్తారా?
సాక్షి, గుంటూరు: దాచేపల్లిలో తొమ్మిదేళ్ల బాలికపై వృద్ధుడు సుబ్బయ్య లైంగికదాడికి పాల్పడిన ఘటనను మరువక ముందే ఆ గ్రామంలోనే మరో బాలికను టీడీపీ కో ఆప్షన్ సభ్యుడు షేక్ మాబువలి గర్భిణిని చేసిన ఘటన శనివారం వెలుగు చూసింది. మాబువలి వ్యవహారం వెలుగులోకి వచ్చి 24 గంటలు గడిచినా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ప్రజ, మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న లైంగికదాడి బాధితురాలిని పరామర్శించిన సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ లైంగికదాడికి పాల్పడిన వారికి అదే ఆఖరి రోజవుతుందని హెచ్చరించారు. ఇప్పుడు టీడీపీ నాయకుడే 12 ఏళ్ల బాలికపై లైంగికదాడికి పాల్పడితే సీఎం ఎందుకు స్పందించడంలేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రోడ్లపైకి వస్తే కానీ స్పందించరా? ‘లైంగికదాడి బాధిత కుటుంబాలకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం ఎక్కడికి పోయింది? తమ పార్టీ నాయకుడు నిందితుడని తెలిస్తే స్పందించారా?’ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కుమ్మర శాలీవాహన సంఘాల నేతలు, సీపీఐ, సీపీఎంతో పాటుగా పలు మహిళ సంఘాల నాయకులు ఆదివారం ప్రశ్నిం చారు. మాబువలిని కఠినంగా శిక్షించాలని, బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ వైఎస్సార్ సీపీ జెడ్పీ ఫ్లోర్ లీడర్ దేవళ్ల రేవతి, జెడ్పీటీసీ సభ్యుడు మూలగొండ్ల ప్రకాష్ రెడ్డి, పార్టీ నాయకులు షేక్ జాకీర్ హుస్సేన్, మందపాటి రమేష్‌రెడ్డి, మునగా పున్నారావు, మాజీ ఎంపీపీ అంబటి శేషగిరిరావు, ఎంపీటీసీ మాజీ సభ్యుడు షేక్ షరిఫ్, ఓబీసీ మహిళా ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు వేమవరపు వరలక్ష్మి, 50 మందికి పైగా వామపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు దాచేపల్లిలో ఆదివారం ఆందోళనకుదిగారు. నడికుడి పంచాయతీ పరిధిలోని నారాయణపురం ఆర్అండ్బీ బంగ్లా వద్ద అద్దంకి – నార్కెట్‌పల్లి హైవేపై బైఠాయించారు. వారిని పోలీసులు వారించేందుకు యత్నించడంతో తోపులాట, వాగ్వివాదం చోటుచేసుకుని ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసు బలగాలు ముందుగానే దాచేపల్లి, నడికుడి కూడళ్ల వద్ద భారీగా మోహరించాయి. మాబువలిని కఠినంగా శిక్షించాలి బాధిత బాలిక తండ్రి ఆందోళనలో పాల్గొని తన కుమార్తె జీవితాన్ని నాశనం చేసిన మాబువలిని కఠినంగా శిక్షించాలని ఆందోళనకారులు నినాదాలు చేశారు. అధికార పార్టీ నాయకుడు కావడంతో అతడిని రక్షించేందుకు యత్నిస్తున్నారని వాపోయారు. ఆందోళన కారులకు సర్దిచెప్పినా ఎలాంటి ప్రయోజనం లేక పోవడంతో పాటు సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా నారాయణపురంలో పోలీసు పికెటింగ్‌లు ఏర్పాటు చేశారు. బాలికకు అన్యాయంజరిగితే పట్టించుకోరా మహిళలు, బాలికలపై లైంగికదాడులకుపాల్పడే నీచులను భూమి మీద ఉండనివ్వబోమని తాను హెచ్చరించిన వారం రోజులకే దాచేపల్లిలో బాలికపై టీడీపీ కో ఆప్షన్ సభ్యుడు షేక్ మాబూవలి అకృత్యానికి పాల్పడితే ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించకపోవటం దారుణమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిలారి రోశయ్య ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన సాక్షితో మాట్లాడారు. టీడీపీ నాయకుల అకృత్యాలను ఖండించారు. ఆందోళనలు చేస్తే తప్ప బాధిత కుటుంబానికి న్యాయం చేయరా అని ప్రశ్నించారు. బీసీ వర్గానికి చెందిన బాలిక కావడంతోనే ప్రభుత్వం స్పందించటంలేదా అని ప్రశ్నించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుం బానికి అండగా నిలవాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. -
ఏపీ-టీఎస్: చిన్నారులపై వరుస అత్యాచారాలు
సాక్షి, హైదరాబాద్: చాక్లెట్లు కొనిపెడతానంటూ చిన్నారి పాపను తీసుకెళ్లి దారుణంగా అత్యాచారం చేశాడో వృద్ధుడు... బాలికను గర్భవతిని చేశాడు మరో ముసలోడు... నాలుగు నెలలుగా విద్యార్థినిపై అఘాయిత్యం జరుపుతూ పట్టుపబడ్డాడో ట్యూషన్ టీచర్! తెలుగు రాష్ట్రాల్లో ఒక్క శనివారం రోజే మధ్యాహ్నం వరకు రిపోర్ట్ అయిన కీచకపర్వాలివి. రాత్రికి వరకు ఇంకా ఎన్ని జరుగుతాయో, అసలు వెలుగులోకి రాకుండాపోయే ఘటనలెన్నో!! దాచేపల్లిలో మరో దారుణం: గుంటూరు జిల్లా దాచేపల్లిలో మరో దారుణం వెలుగుచూసింది. 55 ఏళ్ల వృద్ధుడు కొద్దిరోజులుగా బాలికపై అత్యాచారానికి పాల్పడేవాడు. ఇంట్లోవాళ్లకు చెబితే అందరినీ చంపేస్తానని బెదిరించేవాడు. ఇటీవలే పాప ఆరోగ్యం దెబ్బతినడంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యపరీక్షల్లో ఆమె గర్భవతని తేలింది. భయంతో వణికిపోయిన పాప.. తనపై జరిగిన అకృత్యాన్ని చెప్పేసింది. తల్లిదండ్రుల ఫిర్యాదుమేరకు నిందితుడు మహబూబ్వలీపై పోలీసులు కేసు నమోదుచేశారు. చిన్నారిపై అఘాయిత్యం.. బియ్యం ఇచ్చే యత్నం: నెల్లూరు జిల్లా నాయుడుపేటలో ఐదేళ్ల చిన్నారిపై గురుస్వామి అనే వృద్ధుడు అత్యాచారానికి యత్నించాడు. చాక్లెట్లు, బిస్కెట్లు కొనిస్తానంటూ తీసుకెళ్లి అఘాయిత్యం జరుపబోగా.. చిన్నారి నానమ్మ గమనించింది. చేసినతప్పుకు ప్రతిగా ఐదు కేజీల బియ్యం ఇచ్చి తప్పించుకోవాలని చూశాడా కీచకుడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు నిందితుడు గురుస్వామిని అదుపులోకి తీసుకున్నారు. మీర్పేట్లో విద్యార్థినిపై ట్యూటర్: హైదరాబాద్‌లోని మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోగల లెనిన్ నగర్లో దారుణం వెలుగుచూసింది. 12 ఏళ్ల విద్యార్థినిపై ఆమెకు పాఠాలు చెప్పే ట్యూటర్ గోపి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తీవ్రరక్తస్రావం అవుతున్న స్థితిలో బాలికను తల్లిదండ్రులు గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు. ట్యూటర్ గోపి.. గడిచిన నాలుగు నెలలుగా బాలికపై అత్యాచారం జరుపుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. -
చంద్రబాబుది దద్దమ్మ ప్రభుత్వం
సాక్షి, విశాఖపట్నం: దాచేపల్లి ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఉదంతంలో వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని.. అందుకే విపక్షంపై విమర్శలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. శనివారం విశాఖపట్నంలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు సిగ్గు చేటు... దాచేపల్లి ఘటనపై ఈ ఉదయం మీడియాతో సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే రోజా స్పందించారు. ‘నెల వ్యవధిలో గుంటూరులో ఎన్నో అత్యాచార ఘటనలు జరిగాయి. ఎవరినైనా చంద్రబాబు పరామర్శించారా? వైసీపీ పోరాటం చెయ్యటం వల్లే ఇవాళ సీఎం దిగి రావాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే బాధితురాలిని పరామర్శించారు. మీ తప్పును కప్పిపుచ్చుకోవడానికి బాధితులను పక్కన కూర్చోబెట్టుకున్నారు. కానీ, బాధితురాలి వివరాలు చెప్పకూడదన్న నిబంధనలు కూడా తెలియదా?. పైగా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు విపక్షంపైకి నెడుతున్నారు. ఆయన వ్యాఖ్యలు సిగ్గు చేటు. 55 ఏళ్ల వృద్ధుడ్ని పట్టుకోలేని దద్దమ్మ ప్రభుత్వం మీది. సుబ్బయ్యకు టీడీపీ సభ్యత్వం ఇచ్చింది. స్వయంగా మీ ఎమ్మెల్యేనే అతనికి ఇంటికి కేటాయించారు. వీటికి ఏం సమాధానం చెబుతారు’ అని రోజా ప్రశ్నించారు. ఇది కొత్తేం కాదు... ‘రిషితేశ్వరి కేసులో సెటిల్ మెంట్ చేశారు. కాల్ మనీ సెక్స్ రాకెట్లో టీడీపీ నేతలు ఉండటంతో ఆ కేసును నీరుగార్చారు. గుంటూరు జడ్ఫీ చైర్పర్సన్ జానీమూన్‌కు అన్యాయం చేశారు. ఎమ్మార్వో వనజాక్షిపై దాడి కేసులో స్వయంగా సీఎం రంగంలోకి దిగి సెటిల్మెంట్లు చేశారు. ఐపీఎస్ అధికారి సుబ్రహ్మణ్యంపై దాడి కేసు ఏమైంది? ఏడీఆర్ రిపోర్ట్‌లో ఐదుగురు టీడీపీ ప్రజా ప్రతినిధుల పేర్లు ఉన్నాయి. చంద్రబాబు అధికారంలోకి రాగానే 800 కేసులకు పైగా కొట్టేశారు. ఇంక ప్రజలకు రక్షణ ఏది?’ అని ఆమె నిలదీశారు. టీడీపీ నేతల సంస్కారం ఏది? ‘ఆదాయం కోసం ఎక్కడపడితే అక్కడ అడ్డగోలుగా బెల్ట్ షాపులు పెట్టేశారు. వాటి మూలంగానే నేరాలు పెరిగిపోతున్నాయి. వైజాగ్‌లో బికినీ షో పెడితే వైసీపీ అడ్డుకుంది. పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేసి ఇప్పుడు హోం మంత్రి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ప్రశ్నిస్తే నాపై కొందరు టీడీపీ మహిళా నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఇదేనా వాళ్ల సంస్కారం?.. ముందు మహిళలను గౌరవించటం టీడీపీ నేతలు నేర్చుకోవాలి. అధికారంలోకి మద్యపాన నిషేధం అమలు చేస్తానని వైఎస్ జగన్ మొదటి నుంచి చెబుతున్నారు. ఆయన అధికారంలోకి వస్తేనే మహిళలకు రక్షణ ఉంటుంది’ అని ఎమ్మెల్యే రోజా చెప్పారు. -
ఇదే ఆఖరి ఘటన కావాలి : చంద్రబాబు
సాక్షి, గుంటూరు : మైనర్ బాలికలపై దారుణాలకు పాల్పడే వారికి ఉరిశిక్ష విధిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో ఇదే ఆఖరి ఘటన కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. శనివారం దాచేపల్లి ఘటనలో బాధితురాలైన బాలికను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయన పరామర్శించారు. అనంతరం సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. అన్నెంపున్నె ఎరుగని పసిబిడ్డలపై అఘాయిత్యాలు జరిగితే తల్లిదండ్రులకు ఎంత బాధ ఉంటుందో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని అన్నారు. ఇలాంటి అమానవీయ ఘటనలను చూసి నాగరిక ప్రపంచం సిగ్గుతో తలదించుకోవాలన్నారు. ఘటనపై స్సందించి వెంటనే 17 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని చెప్పారు. ఘోరంపై స్పందించిన ప్రజలను సీఎం అభినందించారు. సోమవారం ఆడబిడ్డకు రక్షణగా కదులుదాం అనే ర్యాలీని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. సాంకేతికత కారణంగా విచ్చలవిడితనం పెరిగిపోతోంది. అవసరమైన మేరకు టెక్నాలజీని వాడకుండా చెడు మార్గాల్లో వినియోగిస్తున్నారు. టెక్నాలజీ కారణంగా పోర్న్ చిత్రాల వ్యాప్తి పెరుగుతూ వస్తోంది. దాని నుంచే సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. పోర్న్ చిత్రాలను నియంత్రించాలని, అత్యాచారానికి పాల్పడితే భూమ్మీద ఉండమనే భయం కల్పించాలని చంద్రబాబు అన్నారు. -
దాచేపల్లి ఘటన: సుబ్బయ్య మృతిపై అనుమానాలు?
సాక్షి, గుంటూరు: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన దాచేపల్లి అత్యాచార ఘటనలో నిందితుడు రామ సుబ్బయ్య మరణంపై అనుమానాలు మొదలయ్యాయి. సుబ్బయ్యని చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని అతడి తరపు బంధువులు ఆరోపిస్తున్నారు. చెట్టుకు ఉరేసుకున్నట్లు పోలీసులు మృతదేహం ఫోటోను చూపించిన తర్వాత.. వాళ్లు తమ వాదనను వినిపిస్తున్నారు. సుబ్బయ్య కాళ్లు నేలను తాకినట్లుగా ఫోటోలో స్పష్టంగా కనిపిస్తుండటంతో చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని బంధువులు ఆరోపణలకు దిగారు. మరోవైపు బాధితురాలి కుటుంబ సభ్యులు కూడా సుబ్బయ్యను చంపి ఉంటారన్న అనుమానం వ్యక్తం చేశారు. ‘మా చేతుల్లో చావలేదని బాధపడుతున్నాం. ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. సుబ్బయ్య కొడుకును కూడా ఉరితీయాలి’ అని బాలిక బంధువులు డిమాండ్ చేస్తున్నారు. దాచేపల్లిలో 9 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన సుబ్బయ్య 48 గంటల హైడ్రామా తర్వాత శవమై తేలాడు. గురజాల మండలం దైద వద్ద అటవీలో ఓ చెట్టుకు ఉరి వేసుకుని కనిపించాడు. మరి కాసేపట్లో దీనిపై పోలీసులు అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. -
వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేల పై పోలీసుల దౌర్జన్యం
-
వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేల అరెస్టు
సాక్షి, గుంటూరు : దాచేపల్లిలో మృగాడి దాడిలో తీవ్రంగా గాయపడిన మైనర్ బాలికకు న్యాయం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆర్కే రోజా, ముస్తఫా, గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి గుంటూరు ప్రభుత్వాసుపత్రి ముందు శుక్రవారం రాస్తారోకోకు దిగారు. ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడి చేరుకున్న పోలీసులు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలను అరెస్టు చేశారు. న్యాయం కోసం నినదిస్తున్న ఎమ్మెల్యే రోజాను మహిళా పోలీసులు ఈడ్చుకెళ్లారు. అంతకుముందు గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను ఎమ్మెల్యే రోజా పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. బాలికకు నాలుగు కుట్లు పడ్డాయని, తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతోందని రోజా చెప్పారు. మనం రాష్ట్ర రాజధాని ప్రాంతంలో బతుకుతున్నామా? లేక అడవిలో ఉన్నామా? అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. మగాళ్లు అంటేనే బాలిక భయపడి ఏడుస్తోందని చెప్పారు. ఆసుపత్రి సూపరిటెండెంట్ గది లోపలికి వచ్చినా హడలిపోతోందని, మనషులకు ఇంత చీప్ మెంటాలిటీ ఉంటుందని తెలిసి కుమిలిపోతోందని తెలిపారు. మగాళ్లు మృగాళ్లలా ప్రవర్తిస్తారని చిన్నారి మనసులో ముద్రించుకుపోయిందని వివరించారు. ఇంతవరకూ నిందితుడిని అరెస్టు చేయకపోవడం ప్రభుత్వ వైఫల్యమేనని అన్నారు. ‘పేదల ప్రాణాలంటే ప్రభుత్వానికి లెక్కలేదు. ఇలాంటి ఘటన జరిగితే బాలికను పరామర్శించని చంద్రబాబు పెళ్లి వేడుకకు వెళ్లారు. ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు భద్రత లేకుండా పోయింది. ఇందుకు బాధ్యత వహిస్తూ చంద్రబాబు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి. దాచేపల్లిలో ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికే తునిలో టీడీపీ నాయకుడు ఒకరు బాలికపై అత్యాచారానికి యత్నించారు. ఎమ్మార్వో వనజాక్షిపై దాడి చేసిన చింతమనేనిపై చర్యలు లేవు. కాల్‌మనీ సెక్స్ రాకెట్లో ఉన్న టీడీపీ నేతలపై చర్యలు తీసుకోలేదు. మహిళా వ్యతిరేక నేరాల్లో ఐదుగురు టీడీపీ నాయకులు ఉన్నట్లు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) రిపోర్టులో పేర్కొంది. కేసుల్లో ఇరుక్కున్న నేతలకు పదవులు అప్పగిస్తూ చంద్రబాబు వారికి మద్దతుగా నిలుస్తున్నారు. చంద్రబాబుకు ఆడవాళ్లు ఉసురు కచ్చితంగా తగులుతుంది. ఒక ముఖ్యమంత్రి, డీజీపీ ఉన్న చోట ఈ ఘటనలు జరుగుతున్నాయి. ఈ ఘోరాలకు పాల్పడుతున్న వారిలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, వారి మద్దతుదారులే ఎక్కువ మంది ఉన్నారు. రాష్ట్ర డీజీపీ ఓ రబ్బరు స్టాంప్‌లా ప్రవర్తిస్తున్నారు. ఒక ముసలివాడు అమ్మాయిని గంటపాటు రేప్ చేసి వెళ్తుంటే మన పోలీసులు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నార’ని రోజా ఆవేదన వ్యక్తం చేశారు. -
దాచేపల్లి హైవేపై ఉద్రిక్త పరిస్థితులు
-
ఏసీబీకి చిక్కిన మెదక్ జిల్లా ఎమ్మార్వో
-
200 మంది ముస్లింల పుష్కర స్నానం...
దాచేపల్లి: దాచేపల్లి మండలం తంగెడ పుష్కర ఘాట్‌లో సుమారు 200 మంది ముస్లింలు పుష్కర స్నానం చేసి మతసామరస్యాన్ని చాటి చెప్పారు. అమరావతి, విజయపురిసౌత్ కృష్ణవేణి ఘాట్, సీతానగరం ఘాట్ల వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. సత్రశాల పుష్కర ఘాట్‌లో పరాశక్తి సిమెంట్స్, వివిధ సామాజిక వర్గాలకు చెందిన సత్రాల్లో పుష్కరాలకు వచ్చిన భక్తులకు అన్నదానం నిర్వహించారు. అచ్చంపేట మండలం నందులరేవు పుష్కర ఘాట్‌లో భక్తులు స్నానాలు చేస్తుండగా హఠాత్తుగా కొండచిలువ రావడంతో భయంతో పరుగులు తీశారు. పోలీసులు దాన్ని చంపడంతో ఊపిరి పీల్చుకున్నారు. -
ఆర్టీసీ బస్సు- లారీ ఢీ: ప్రయాణికుడి మృతి
-
ఆర్టీసీ బస్సు- లారీ ఢీ: ప్రయాణికుడి మృతి
దాచేపల్లి: వేగంగా వెళ్తున్న బస్సును పెట్రోల్ బంక్ నుంచి బయటకు వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి మృతిచెందగా.. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. గుంటూరు జిల్లా దాచెపల్లి మండల కేంద్రంలోని పెట్రోల్ బంక్ సమీపంలో మంగళవారం ఉదయం ఈ సంఘటన జరిగింది. నెల్లూరు నుంచి హైదరాబాద్ వస్తున్న బస్సును పెట్రోల్ బంక్ నుంచి బయటకు వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న వేపూరి కొండయ్య(35) అక్కడికక్కడే మృతిచెందగా, మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. -
'ఎస్బీఐ'లో చోరీకి యత్నం
గుంటూరు: గుంటూరు జిల్లా దాచేపల్లి నడికుడి భారతీయ స్టేట్ బ్యాంకులో శనివారం దొంగలు పడ్డారు. బాత్ రూం కిటికీలోంచి బ్యాంకులోకి ప్రవేశించారు. అక్కడున్న సీసీ కెమెరాలకు కవర్లు చుట్టి చోరీకి ప్రయత్నించారు. ఆ సమయంలో స్ట్రాంగ్ రూం తలుపులు ఓపెన్ కావడంతో దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మొదటి భార్య బంధువుల చేతిలో టెకీ హతం!!
విడాకులు తీసుకుని.. రెండో పెళ్లికి సిద్ధమైన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ను మొదటి భార్య బంధువులు, మరి కొందరు కలిసి దాడిచేసి అతడిని, అతడి మేనత్తను పొడిచి చంపేశారు. ఈ దారుణం గుంటూరు జిల్లా దాచేపల్లిలో శుక్రవారం మధ్యాహ్నం జరిగింది. బాధితుల కథనం ప్రకారం, దాచేపల్లికి చెందిన రావుల కోటేశ్వరరావు (30) బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. అతడికి రెండేళ్ల క్రితం పెళ్లయింది, ఏడాది క్రితమే మనస్పర్థలతో భార్యభర్తలు విడాకులు తీసుకున్నారు. కోటేశ్వరరావుకు పెళ్లి గుంటూరులో శనివారం జరగాల్సి ఉంది. ఈ ఏర్పాట్లలో వాళ్లంతా హడావుడిగా ఉండగా, మొదటి భార్యకు సంబంధించిన కొంతమంది వచ్చి ఈ కుటుంబ సభ్యులపై కత్తులతో దాడి చేశారు. దాంతో కోటేశ్వరరావుతో పాటు అతడి మేనత్త మల్లమ్మ అక్కడికక్కడే మరణించారు. కోటేశ్వరరావు తండ్రి చంద్రయ్య, తల్లి వీరనాగమ్మ, సోదరుడు లింగరాజు తీవ్రంగా గాయపడ్డారు. మరో మేనత్త వెంకటకోటమ్మ కూడా గాయపడ్డారు. -
నడికుడి రైల్వేస్టేషన్‌ను తనిఖీ చేసిన జీఎం
దాచేపల్లి: నడికుడి రైల్వేస్టేషన్‌ను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ పీఎన్ శ్రీవాత్సవ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సికింద్రాబాద్ నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రైలులో జీఎం శ్రీవాస్తవ నడికుడి రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. స్టేషన్‌లోని రైల్వే క్యాంటీన్‌ను పరిశీలించారు. క్యాంటీన్లో ప్రయాణికులకు లభిస్తున్న ఆహార పదార్థాలను జీఎం పరిశీలించారు. క్యాంటీన్లో క్రయవిక్రయాలపై నిర్వహకులు స్పేషిప్‌ను జీఎం అడిగి తెలుసుకున్నారు. అనంతరం బుకింగ్ కౌంటర్‌ను తనిఖీచేశారు. రోజుకు ఎన్ని టికెట్లు అమ్ముతున్నదీ.. రిజర్వేషన్లు ఎన్ని జరుగుతున్నాయని సిబ్బందిని జీఎం అడిగి తెలుసుకున్నారు. స్టేషన్లో ప్రయాణికులకు అందిస్తున్న తాగునీటిని జీఎం స్వయంగా పరిశీలించారు. స్టేషన్ మేనేజర్ ఎంఎల్ మీనా వివరాలు వెల్లడించారు. అనంతరం స్టేషన్ పరిసరాలను పరిశీలించి స్టేషన్ ముందుభాగంలో గార్డెన్‌ను ఏర్పాటు చేయాలని జీఎం ఆదేశించారు. ఈ సందర్భంగా జీఎం శ్రీవాత్సవను జేపీ సిమెంట్స్ వైస్ ప్రెసిడెంట్ ఆర్కే దూదా, డిప్యూటీ జీఎం గిరిష్‌కుమార్, సీనియర్ అధికారి జి.విశ్వనాథరెడ్డిలు కలిసి సిమెంట్ లోడింగ్‌కు తగిన ఏర్పాట్లు చేయాలని కోరారు. జీఎం వెంట సీఎంవో జేఎన్ జాను తదితరులున్నారు. -
ప్రమాదాల హైవే...
తెలంగాణ రాష్ట్ర సరిహద్దు పొందుగల నుంచి పిడుగురాళ్ళ వరకు 37 కి.మీ విస్తరించి ఉన్న అద్దంకి-నార్కెట్‌పల్లి హైవే రక్తమోడుతోంది. ప్రతి ఐదు రోజులకో ప్రమాదం చొప్పున ఈ ఐదు నెలల్లో 25 ప్రమాదాలు జరిగాయి. 28 ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. హైవేపై వాహనాలకు వేగపరిమితి లేకపోవడంతో ప్రమాదాలకు ఆస్కారం ఏర్పడుతోంది. ప్రమాదాల్లో ఎన్నో కుటుంబాల్లో యజమానులు అర్ధంతరంగా తనువు చాలించడంతో ఆ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. హైవే మీదకు వస్తే ఇంటికి తిరిగి వెళ్లేంతవరకూ మనిషి ప్రాణానికి హామీ లేకుండా పోతోంది. ప్రభుత్వం హైవేపై నిర్దిష్టమైన నియమ నిబంధనలు ప్రవేశపెట్టి వేగ నియంత్రణ చేయని పక్షంలో ఈ ప్రాంతంలో ప్రయాణికుల బతుకులకు భద్రత కరువే. దాచేపల్లి,న్యూస్‌లైన్: అద్దంకి-నార్కెట్‌పల్లి హైవే రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారింది. ఐదురోజులకొకసారి ఈ రోడ్డుపై ప్రమాదాలు జరుగుతున్నా యి. నిండుప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. కళ్లుమూసి కళ్లు తెరిచే లోపే ఘోర ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఈ ఏడాది జనవరి నెల ప్రారంభం నుంచి మే 30 వరకు ఐదు నెలల కాలంలో హైవేపై దాచేపల్లి మండలం పొందుగల గ్రామం నుంచి పిడుగురాళ్ల మధ్య 25కు పైగా రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో 28 మంది మృ త్యువాత పడగా మరో 15మంది తీవ్రగాయాల పాలయ్యారు. హైవేలో వెళ్లే వాహనాలు అతివేగంతో వెళ్లడం వలన తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాల నివారణకు హైవే ఆథారిటీ పోలీ సులు, స్థానిక పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఈ రోడ్డుపై ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నా యి. దాచేపల్లి మండలం పొందు గల గ్రామం నుంచి పిడుగురాళ్ల వరకు సుమారుగా 37 కిలోమీటర్ల పొడవునా హై వే రహదారి విస్తరించి ఉం ది. ఈ రహదారిపై ఈ ఏడా ది జనవరి నెల ప్రారంభం నుంచి పోలీ సుల రికార్డుల ప్రకారం పరిశీలిస్తే ప్రతి ఐదు రోజుల కొకసారి రోడ్డు ప్రమాదం జరుగుతూనే ఉంది. జనవరి నెలలో వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ఆటోను అతివేగంతో వచ్చిన లారీ ఢీకొట్టడంతో ఒక మహిళ మృతి చెందింది. ఆటో నిబంధనల ప్రకారం వెళ్తున్నా లారీ మితిమీరిన వేగంతో రావడం వలన ఈ ప్రమా దం సంభవించింది. ఫిబ్రవరిలో శ్రీనగర్‌లో రోడ్డు వెంట నడుస్తున్న వ్యక్తిని లారీ ఢీకొట్టింది. మార్చిలో రోడ్డుపై నడుస్తున్న వ్యక్తిని లారీ అతివేగంతో వచ్చి ఢీకొట్టింది. ఇలా చెప్పుకుంటూపోతే ఇలాంటి సం ఘటనలు ఎన్నో జరిగాయి. ద్విచక్రవాహనంపై వెళ్తున్న వ్యక్తులను, రో డ్డుపై నడిచి వెళ్తున్న వ్యక్తులను లారీలు ఢీకొనడం వంటి సంఘటనలు హైవేపై తరచుగా జరుగుతున్నాయి. ఎక్కువగా ఒక లారీని మరో లారీ ఢీకొనడం..ఆటోలను, ద్విచక్రవాహనాలను లారీలు ఢీకొనడం లాంటి సంఘటనలు జరిగి ప్రజలు మృత్యుకౌగిట్లో చిక్కుకుంటున్నారు. ప్రమాదాలకు నిలయం ఈ ప్రదేశాలు.: హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా మండలంలోని ముత్యాలంపాడు రోడ్డు వద్ద, శ్రీనగర్, దాచేపల్లి బస్టాండ్ సెంటర్, పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లి వద్ద జరుగుతున్నాయి. శ్రీనగర్ గ్రామం హైవే రోడ్డును ఆనుకుని సుమారుగా కిలోమీటర్‌కు పైగా ఉంటుంది. హైవే నిర్మాణం సమయంలో గ్రామంలో పెడస్ట్రల్ అండర్ ప్రాసెస్ (పీయూపీ)ని నిర్మించేందుకు అధికారులు చర్యలు తీసుకున్న నేపథ్యంలో తమకు పీయూపీ అవసరం లేదని గ్రామస్తులు చెప్పారు. దీంతో నిర్మాణాన్ని ఆపివేసి రోడ్డును మాత్రమే నిర్మించారు. దీంతో ఇక్కడ రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. దాచేపల్లి బస్టాండ్ సెంటర్లో జనం రద్దీగా ఉంటుంది. ఈ ప్రాంతంలో లారీలు మితిమీరిన వేగంతో వెళ్తూ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. దాచేపల్లి నుంచి ముత్యాలంపాడు రోడ్డు వద్ద కూడా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇక్కడ పీయూపీ నిర్మాణం చేపట్టిన తరువాత ముత్యాలంపాడులో వెళ్లేందుకు ఇబ్బందిగా ఉందని గ్రామస్తులు చెప్పడంతో 20 మీటర్ల పీయూపీని తొలగించారు. గుంటూరు వైపు నుంచి వచ్చే వాహనాలు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో వస్తుండటం వలన ఇక్కడ కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. పీయూపీ పల్లంలో ఉండడం వలన ఇక్కడ ప్రమాదాలు జరిగేందుకు ఆస్కారమేర్పడుతోంది. ముత్యాలంపాడు నుంచి వచ్చే వాహనాలు హైవేపై వచ్చే వాహనాలకు కనిపించకపోవడంతో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. బ్రాహ్మణపల్లి వద్ద కూడా రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. మితిమీరిన వేగంతో వాహనాలు.: హైవేలో వాహనాలు మితిమీరిన వేగంతో వెళ్తున్నాయి. రోడ్డులో ఎక్కడా స్పీడ్‌బ్రేకర్లు లేకపోవడం, రో డ్డు సాఫీగా ఉండడంతో వాహనాల వేగానికి అడ్డూ అదుపులేకుండా పోతోంది. లారీలు 80 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో వె ళ్తుండగా, కారులు 100 నుంచి 120 కి.మీ వేగంతో వెళ్తున్నాయి. బస్సులు కూడా 90 కిలోమీటర్లకు తగ్గకుండా వెళ్తున్నాయి. వాహనాల వేగానికి కళ్లెం వేసి నియంత్రించినట్లయితే రోడ్డు ప్రమాదాలు కొంతవరకు తగ్గే పరిస్థితులు కన్పిస్తున్నాయి. రోడ్డు ప్రమాదాలు జరగకుండా పోలీసులు నిత్యం గస్తీ తిరుగుతూ తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
కరెంటులేక.. దాహం తీరక
దాచేపల్లి, న్యూస్‌లైన్: విద్యుత్ సరఫరాలో ఏర్పడిన అంతరాయంతో ప్రజలు నరకయాతన అనుభవించారు. సోమవారం తెల్లవారుజాము నుంచి వీచిన బలమైన ఈదురుగాలులకు, భీకరమైన వర్షానికి విద్యుత్ సరఫరాకు ఆటంకం ఏర్పడింది. దాచేపల్లి మండల వ్యాప్తంగా సోమవారం తెల్లవారుజాము నుంచి కరెంట్ సరఫరా నిలిచిపోయింది. మండలంలోని తాగునీటి పెలైట్ ప్రాజెక్ట్‌లు, ఇళ్లల్లోని తాగునీటి మోటార్లూ పనిచేయక తాగునీటికి ప్రజలు పడ్డ బాధలు వర్ణనాతీతం. దాచేపల్లి, నడికుడి, కేసానుపల్లి, తక్కెళ్లపాడువాసులు అష్టకష్టాలు పడ్డారు. కేసానుపల్లిలోట్రాక్టర్ ద్వారా తాగునీరు అందించే మోటర్‌కు కనెక్షన్ ఇచ్చి మూడుగంటల పాటు నీటిని అందించారు. దీంతో కొళాయిల దగ్గర జనం బారులు తీరారు. స్పందించిన గీతాగురుకులం యజమాన్యం ప్రజల దాహార్తి తీర్చేందుకు మండలంలోని కేసానుపల్లిలోని గీతాగురుకులం హైస్కూల్ యజమాన్యం మంగళవారం స్పందించింది. కరస్పాండెంట్ అనిశెట్టి సాంబశివరావు హైస్కూల్లోని జనరేటర్ ద్వారా తాగునీటి మోటర్‌కు కనెక్షన్ ఇచ్చారు. దీంతో గ్రామంలోని ప్రజలు హైస్కూల్ నుంచే నీటిని తెచ్చుకున్నారు. చెరువు బాటపట్టిన జనం తాగునీటి కోసం ప్రజలు చెరువుబాట పట్టారు. మాదినపాడు, సారంగపల్లి అగ్రహారం వాసులు చెరువుల వద్ద క్యూకట్టారు. ఎడ్లబండ్లు, ద్విచక్రవాహనాలు, ఆటో, ట్రాక్టర్ల సాయంతో నీరు తెచ్చుకున్నారు. ముత్యాలంపాడులోని చెరువు నుంచి దాచేపల్లి, తంగెడ గ్రామాల ప్రజలు కూడా నీళ్లు తీసుకెళ్లారు. కాట్రపాడు, భట్రుపాలెం, రామాపురం, పోందుగల, శ్రీనగర్ గ్రామాల ప్రజలు కృష్ణానది నుంచి నీటిని తీసుకున్నారు.