అక్రమమైనింగ్ జరిగిన ప్రాంతం
సాక్షి, గుంటూరు: గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమ మైనింగ్ వ్యవహారంపై నిగ్గుతేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు అంగీకరించటం సర్వత్రా చర్చనీయాంశమైంది. గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో దాచేపల్లి మండలం కేశానుపల్లి, నడికుడి, పిడుగురాళ్ల మండలం కొనంకి, సీతారామపురంలో ఐదేళ్లపాటు యథేచ్ఛగా జరిగిన అక్రమ మైనింగ్‌పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో రాష్ట్ర మంత్రివర్గం సీబీఐ విచారణకు ఆమోదం తెలపటంతో టీడీపీ నేతలు హడలెత్తిపోతున్నారు.
చంద్రబాబు ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు జోరుగా జరిగిన అక్రమ మైనింగ్ ద్వారా 32 లక్షల టన్నుల ఖనిజ సంపద దోచుకున్నారని లోకాయుక్త, సీబీ సీఐడీ అధికారులు నిర్ధారించారు. అక్రమ మైనింగ్ ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన వందల కోట్ల రూపాయలకు గండికొట్టారని విచారణలో తేలింది. తాజాగా రాష్ట్ర మంత్రి వర్గం భేటీలో సీబీఐ విచారణకు అంగీకారం తెలుపుతూ కీలక నిర్ణయం తీసుకోవటంతో స్థానికంగా ప్రజలు చర్చించుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదేననే అభిప్రాయం ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. సీబీఐ విచారణ జరిగితే అక్రమ మైనింగ్ వ్యవహారంలో పూర్తిస్థాయి నిజాలు ప్రజలకు తెలుస్తాయని పేర్కొంటున్నారు. ఇది చదవండి : యరపతినేని అక్రమ మైనింగ్‌పై సీబీ‘ఐ’
తిన్నదంతా రాబట్టాల్సిందే..
గత టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు దగ్గర నుంచి యరపతినేని వరకు అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారు. ఈ రోజు అక్రమ మైనింగ్ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించింది. అక్రమ మైనింగ్‌లో తిన్నదంతా కక్కితీరాల్సిందే. అక్రమ మైనింగ్ వలన ప్రభుత్వం, ప్రజలకు జరిగిన నష్టం వడ్డీతో సహ వసూలు చేయాలి. దోషులు ఎంతటివారైనా కఠినంగా శిక్షించాల్సిందే.
–షేక్ జాకీర్‌హుస్సేన్, దాచేపల్లి
అక్రమార్కులను బయటపెట్టాలి
అక్రమ మైనింగ్ వ్యవహారంలో టీడీపీ నాయకులు చేసిన అక్రమాలన్నింటినీ బయటపెట్టాలి. సీఐడీ విచారణ పూర్తిస్థాయిలో అక్రమాలను గుర్తించలేకపోయారు. సీఐడీ విచారణపై కూడా అనుమానాలు లేకపోలేదు. సీబీఐ విచారణ ద్వారానే అక్రమ మైనింగ్ వ్యవహారం వెలుగులోకి వస్తుందని భావిస్తున్నాం.
–మోమిన్ నాగుల్‌మీరా, కేసానుపల్లి
Comments
Please login to add a commentAdd a comment