ఇలా జరిగింది..: రోడ్డుకు అడ్డంగా వచ్చిన కుక్కను తప్పించబోయి కారు డివైడర్‌ను ఢీకొట్టి.. ముందుకు దూసుకెళ్లి పల్టీలు కొట్టడంతో ప్రమాదం జరిగింది.
ఎప్పుడు.. ఎక్కడ: గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం గామాలపాడు వద్ద సోమవారం ఈ ఘటన జరిగింది.
పర్యవసానం: అతి వేగం వల్ల ముగ్గురు అక్కడికక్కడే మృతి. ఇద్దరికి తీవ్ర గాయాలు. మృతుల్లో ఇద్దరు తల్లీకూతుళ్లు.
దాచేపల్లి(గురజాల): గుంటూరు జిల్లాలో సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. కుక్కను తప్పించబోయి డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. పల్టీలు కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. తెలంగాణలోని శంషాబాద్ సమీపంలో ఉన్న ఓ ఇంజనీరింగ్ కాలేజీలో తెలపల వెంకట రమణమ్మ(46), ఆమె కుమారుడు వేణు స్వీపర్లుగా పనిచేసేవారు. వెంకట రమణమ్మ వద్ద శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గుండలమ్మపాలేనికి చెందిన ఆమె తల్లి యకసిరి రమణమ్మ(71) కూడా ఉంటోంది.
ఈ నేపథ్యంలో రమణమ్మ, వెంకట రమణమ్మ, ఆమె కుమారుడు వేణు, అతని స్నేహితుడు సందీప్ యాదవ్, డ్రైవర్ శ్రీకాంత్(19) సోమవారం కారులో గుండలమ్మపాలేనికి బయల్దేరారు. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం గామాలపాడు సమీపంలోని పెట్రోల్ బంక్ వద్దకు రాగానే.. రోడ్డుకు అడ్డుగా వెళ్తున్న కుక్కను తప్పించేందుకు శ్రీకాంత్ కారును పక్కకు తిప్పాడు. దీంతో కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి.. పల్టీలు కొడుతూ సమీపంలోని ఓ దుకాణంపై పడింది. దీంతో రమణమ్మ, డ్రైవర్ శ్రీకాంత్ అక్కడికక్కడే మృతిచెందగా.. గురజాల ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ వెంకట రమణమ్మ మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన వేణు, సందీప్‌కు గురజాల ఆస్పత్రిలో వైద్యం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నట్లు సీఐ ఉమేష్, ఎస్‌ఐ బాలనాగిరెడ్డి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment